LATEST NEWS
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని ఉద్వేగభరితమైన దృశ్యాలు మాత్రం నెటిజన్ల మనసును హత్తుకుంటాయి. అలాంటి కోవకే చెందిన ఓ అరుదైన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం అంతర్జాలంలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్‌లో ఓ యువకుడు సైకిల్‌పై ఆర్డర్లు డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎండనకా వాననకా కష్టపడి పనిచేస్తున్న ఆ యువకుడి అంకితభావం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా పట్టుదలతో పనిచేస్తున్న అతడి దీనస్థితి పలువురిని ఆలోచింపజేసింది. రోజూ సైకిల్ తొక్కుతూ ఇబ్బంది పడుతున్న ఆ డెలివరీ ఏజెంట్‌కు కొందరు వ్యక్తులు ఊహించని బహుమతిని అందించారు. అతడి కష్టాన్ని గుర్తించిన ఒక సామాజిక కార్యకర్త బృందం ముందుకు వచ్చి అతనికి నూతన మోటార్ సైకిల్‌ను కానుకగా అందజేశారు. తమ కష్టానికి తగిన గుర్తింపు లభించడంతో ఆ యువకుడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కొత్త స్కూటీని కళ్లారా చూసి కంటతడి పెట్టుకున్న ఆ క్షణాలు అక్కడున్న వారిని సైతం కదిలించాయి. ఈ ఉద్విగ్నభరితమైన దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడంతో ఇవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, ఈ సరికొత్త బహుమతిని ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ స్వయంగా లేదా ఆయన తరఫున అందించారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ కథనం ప్రకారం.. మానవతా దృక్పథంతో ఆ యువకుడికి ఈ సాయం అందించినట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు.   అయితే, ఈ వార్తకు సంబంధించి అధికారిక సమాచారం లేదా స్వతంత్ర ధ్రువీకరణ మాత్రం లభించలేదు. అయినప్పటికీ, కష్టపడి పనిచేసే సామాన్యులకు ఇలాంటి సహాయాలు అందడం అభినందనీయమని నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.    డెలివరీ బాయ్స్ పడుతున్న శ్రమను, వారి నిజాయితీని ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న కార్మికులకు దాతలు ముందుకెళ్లి సాయం చేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని దీని ద్వారా మరోసారి నిరూపితమైంది.ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఘటనలు కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసం కాకుండా, సమాజంలో తోటివారికి సాయం చేయాలనే భావనను ప్రతి ఒక్కరిలో మరింత పెంచుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.       [ Blinkit delivery boy viral video, Sujit viral video, cycle delivery to scooty gift, Anant Ambani viral news, TeluguOne viral news, social media trending videos, Telugu One, Telugu News ]  
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ముఖ్యంగా విద్యారంగంలో వస్తున్న మార్పులు విప్లవాత్మకంగా మారుతున్నాయి. పుస్తకాల్లోని విషయాలను పరీక్షల్లో రాసే పాత పద్ధతులకు కాలం చెల్లిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో కేవలం సమాచారాన్ని సేకరించి అందించడమే చదువుగా భావించేవారు. కానీ, నేడు ఆ పనులన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిటికెలో చేసిపెడుతోంది. దీంతో కేవలం సమాచారాన్ని బట్టీపట్టే విద్యకు ప్రాధాన్యం తగ్గిపోయి, స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి అత్యావశ్యకంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరిగింది. గురువులు కేవలం పాఠాలు చెప్పే బోధకులుగా మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో అన్వేషణను పెంచే మార్గదర్శకులుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ పేర్కొన్నట్లుగా, కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకునే సామర్థ్యమే నేడు అసలైన నైపుణ్యంగా పరిగణిస్తున్నారు. దిగ్గజ కంపెనీలు సైతం అಂತಹ ప్రతిభ ఉన్నవారికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. తరగతి గదిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య నిర్మాణాత్మక సంభాషణలు జరగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరి మధ్య ఉన్న అంతరాలను తగ్గించి, కలిసికట్టుగా విషయాలను అన్వేషించే వాతావరణం ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడం ద్వారానే వారిని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దవచ్చు. ఏఐ కాలంలో ఈ నైపుణ్యమే విద్యార్థులను ప్రత్యేకంగా నిలబెడుతుంది. సమాజంలో ఎదురయ్యే ప్రతి సమస్యను శాస్త్రీయంగా పరిశీలించి, సరైన సమాధానాలు రాబట్టే ఆత్మవిశ్వాసాన్ని యువతలో నింపాలి. విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం తయారు చేయడం కాకుండా, జీవితాంతం నేర్చుకునే యోధులుగా మార్చడమే నేటి చదువుల అసలు లక్ష్యం కావాలి.       [ AI in Education, AI Education, Role of Teachers, Changes in the Education System, Critical Thinking in Students, Telugu One, Telugu News ]
పెరిగిన నిత్యావసరాలు  నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో, కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలకు నూతన ఆశలు చిగురింపజేసే వినూత్న ప్రయోగం వెలుగులోకి వచ్చింది. పర్యావరణానికి హాని కలిగించే పారిశ్రామిక వ్యర్థాలు మరియు రసాయన అవశేషాలను పూర్తిగా రీసైక్లింగ్ చేసి, అతి తక్కువ ఖర్చుతో సురక్షితమైన గృహాలను నిర్మించే దిశగా ఒక అసాధారణ ముందడుగు పడింది. గుజరాత్‌లోని అంక్లేశ్వర్ ప్రాంతానికి చెందిన అదితి, వేదాంత్ గాంధీ అనే యువ నిపుణులు ఈ విప్లవాత్మక ఆలోచనకు రూపకల్పన చేశారు. ఒకప్పుడు అత్యంత కాలుష్యపూరితంగా మారిన తమ సొంతూరిలో పేరుకుపోయిన పారిశ్రామిక బూడిద కుప్పలు, విషపూరిత లైమ్ స్లడ్జ్ వంటి వ్యర్థాలను చూసి చలించిన వారు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించి భవన నిర్మాణ సామగ్రిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. సాప్రదాయ సిమెంట్ నిర్మాణాలకు భಿన్నంగా, గత కాలపు సున్నపు కట్టడాల స్పూర్తితో ఈ ప్రత్యేకమైన 'కార్బన్‌క్రీట్' ఇటుకలను అభివృద్ధి చేశారు. సిమెంటును పూర్తిగా పక్కన పెట్టి, ఫ్యాక్టరీ వ్యర్థాలు మరియు పాత భవనాల శిథిలాలను సరైన నిష్పత్తిలో కలపడం ద్వారా అత్యంత పటిష్టమైన ఇటుకలను తయారు చేయడంలో వీరు సఫలమయ్యారు. ఈ వినూత్న పదార్థాల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి సాధారణ ఇటుకల మాదిరిగా కాకుండా గాలిలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుంటూ కాలక్రమేణా మరింత దృఢంగా మారుతాయి. అంతేకాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఉద్యోగాలను వదిలిపెట్టి ఈ పరిశోధనల బాటపట్టిన ఈ దంపతులకు తొలినాళ్లలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రభుత్వ మద్దతుతో తమ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఫ్యాక్టరీలోనే ముందే సిద్ధం చేసే ఈ ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ పద్ధతి వల్ల నిర్మాణ సమయం సగానికి పైగా తగ్గిపోవడంతో పాటు ప్లాస్టరింగ్ అవసరం లేకుండా నేరుగా రంగులు వేసుకునే వెసులుబాటు కలుగుతోంది. కేవలం రూ.7 లక్షల బడ్జెట్‌లోనే నాణ్యమైన పక్కా గృహాలను అందిస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అగ్నిప్రమాదాలను తట్టుకునే శక్తి కలిగి ఉండటంతో పాటు ఇంటి లోపల ఎల్లప్పుడూ చల్లని వాతావరణాన్ని అందించడం ఈ గృహాల మరో ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పటివరకు వందలాది ఇళ్లను విజయవంతంగా నిర్మించిన ఈ స్టార్టప్‌ సంస్థ, పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరాస్తి రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ఈ సాంకేతికత మరింత విస్తరించి, దేశవ్యాప్తంగా సామాన్యులందరికీ తక్కువ ధరకే పర్యావరణ హితమైన ఇళ్లు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.       [ CO2ncrete startup, affordable housing India, eco friendly bricks, industrial waste recycling, lime sludge bricks, low cost home construction, sustainable architecture, Telugu One, Telugu News ]
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.! తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం కలిగిస్తున్న అక్రమ రైస్ మిల్లర్లపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేయగా, మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.  ప్రాథమిక విచారణ ప్రకారం ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.96 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విధానంలో అప్పగించగా, కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన నాణ్యమైన సన్న బియ్యానికి బదులుగా, బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు లభించే దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.  మరోవైపు, ప్రభుత్వానికి చెందిన ధాన్యం, బియ్యాన్ని అక్రమ మార్గాల్లో ఇతర వ్యాపారులకు విక్రయించి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీఎంఆర్ బియ్యం నిల్వలు, లెక్కల్లో భారీ వ్యత్యాసాలు గుర్తించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించగా పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో, సంబంధిత ఆధారాలతో కూడిన నివేదికను సీఐడీకి అందజేసి ఫిర్యాదు చేశారు.  దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందాలు నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, ములుగు, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు రైస్ మిల్లులు, కార్యాలయాలు, నివాసాలపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ధాన్యం నిల్వలు, రికార్డుల మధ్య భారీ తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. నకిలీ వేబిల్లులు, రిజిస్టర్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకుని కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.  అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో రైస్ మిల్లర్లతో పాటు వారికి సహకరించినట్లు అనుమానిస్తున్న అధికారులు, మధ్యవర్తుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిన విధానం, అక్రమాలకు పాల్పడిన వారి నెట్‌వర్క్‌పై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు పురోగతిని బట్టి ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించారు.       [ Telangana Rice Mill Scam, CID Raids, Telangana CID, Rice Millers Arrested, ₹96 Crore Scam, Telangana Civil Supplies Department, Custom Milling Rice (CMR), Public Distribution System (PDS), Government Paddy Scam, Rice Mill Irregularities, Paddy Diversion, Rice Supply Fraud, Food Grain Scam, Telangana Corruption Case ]
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో విధులను నిర్వర్తిస్తున్న మహిళా కండక్టర్ ప్రవల్లిక వద్దకు ఓ ప్రయాణికురాలు తన కొడుకు టికెట్ కోసం వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికురాలు రూ. 100 నోటును ఇవ్వగా, టికెట్ మొత్తానికి సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ ప్రవల్లిక ఆమెను కోరింది. సరిగ్గా ఇదే విషయమై ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం మొదలైంది. క్రమంగా ఈ చిన్న వాగ్వాదం కాస్తా తీవ్ర స్థాయికి చేరుకుని పెద్ద లొల్లా మారిపోయింది. ఇరువురి మధ్య తీవ్ర వాదన జరుగుతున్న సమయంలో సహనం కోల్పోయిన ఆ ప్రయాణికురాలు క్షణికావేశంలో హద్దు మీరింది. బస్సులో అందరూ చూస్తుండగానే విధుల్లో ఉన్న కండక్టర్‌ను ఏమాత్రం ఆలోచించకుండా బస్సు బయటికి తోసేసింది. అయితే అదే సమయంలో బస్సు కదులుతుండటంతో జరిగిన ఈ అనూహ్య పరిణామంలో తీవ్రమైన దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. కండక్టర్ ప్రవల్లిక కాలు ప్రమాదవశాత్తూ ఆర్టీసి బస్సు టైర్ కింద పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా నలిగిపోయి విరిగినంత పనైంది. ఈ ఊహించని ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిన కండక్టర్‌ను చూసి తోటి సిబ్బంది ఆందోళన చెందారు. తక్షణమే స్పందించిన స్థానికులు, సిబ్బంది 108 అత్యవసర అంబులెన్స్ సహాయంతో తీవ్ర గాయాలపాలైన కండక్టర్ ప్రవల్లికను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆమెకు అత్యవసర వైద్య చికిత్సనందిస్తున్నారు. మరోవైపు ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న అశ్వాపురం పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. బస్సులో విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడి, ప్రాణాంతక ప్రమాదానికి కారణమైన ఆ ప్రయాణికురాలను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు తప్పవని ఆర్టీసి యాజమాన్యం పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. క్షణికావేశంలో వ్యవహరించే తీరు వల్ల అమాయక ఉద్యోగుల ప్రాణాల మీదకు రావడంతో పాటు, నిందితులు సైతం కఠినమైన చట్టపరమైన చిక్కులను కొనితెచ్చుకుంటున్నారు. ఈ ఘటన ఆర్టీసీ సిబ్బంది భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.       [ Rtc bus conductor, passenger pushed conductor, mittagudem news, telangana rtc news, rtc bus incident, bhadradri kothagudem, CM Revanth reddy, Minister ponnam prabhakar ]
ALSO ON TELUGUONE N E W S
సినిమా నచ్చితే ప్రశంసించడం.. నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం మామూలే. కానీ స్టార్‌ కుటుంబాలకు చెందినవారు తమ అభిప్రాయాలను బయటపెడితే మాత్రం ఆ చర్చ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్‌ ఘట్టమనేని విషయంలోనూ ఇదే జరుగుతోంది. నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ సినిమాకు ఆయన ఇచ్చిన రేటింగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. గౌతమ్‌ తన లెటర్‌బాక్స్‌ (Letterboxd) ఖాతాలో ‘ది ప్యారడైజ్‌’ సినిమాను రివ్యూ చేస్తూ ఐదింటికి ఒక స్టార్‌ మాత్రమే ఇచ్చాడు. సినిమాలో సినిమాటోగ్రఫీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటీనటుల నటన నచ్చాయని పేర్కొన్నాడు. అయితే మిగతా అంశాలేవీ తనను ఆకట్టుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. “సినిమాటోగ్రఫీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటీనటుల నటన నచ్చాయి. మిగతా ఏదీ నచ్చలేదు. చాలా నిరాశపరిచింది. ఎడిటింగ్‌ కూడా చాలా దారుణంగా ఉంది” అంటూ గౌతమ్‌ తన రివ్యూలో పేర్కొన్నాడు. గౌతమ్‌ సినిమాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినిమాకు కూడా ఆయన కేవలం అర స్టార్‌ రేటింగ్‌ ఇచ్చాడు. తన తండ్రి మహేశ్‌బాబు సినిమాలకు సైతం తక్కువ రేటింగ్స్‌ ఇచ్చిన సందర్భాలు ఉండటంతో.. గౌతమ్‌ రివ్యూలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ‘ది ప్యారడైజ్‌’ థియేటర్లలో విడుదలైనప్పటి నుంచే భిన్నమైన స్పందనను అందుకుంది. కథాంశం, నాని నటన, సినిమాటోగ్రఫీ వంటి అంశాలపై ప్రశంసలు వచ్చినప్పటికీ.. కథనంలో వేగం, ఎడిటింగ్‌, కొన్ని సన్నివేశాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా చర్చ కొనసాగుతోంది. ఓటీటీ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేయడం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ ఇచ్చిన వన్‌ స్టార్‌ రేటింగ్‌ సినిమాపై మరోసారి చర్చకు కారణమైంది. ఇది కూడా చదవండి: ‘ఫౌజీ’లో ప్రభాస్ విధ్వంసం.. ఆ 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌కి థియేటర్లు షేక్ అవుతాయి.!       [The Paradise One Star Rating, Gautam Ghattamaneni, Letterboxd Review, Mahesh Babu Son Gautam, The Paradise Movie, The Paradise OTT, Nani Paradise OTT, Telugu Film News]  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా ప్రభాస్ చేతిలో భారీ రైఫిల్‌తో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ గ్లింప్స్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గ్లింప్స్‌లో చూపించిన ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ సినిమాలో సుమారు 15 నిమిషాల పాటు సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేసేలా ఈ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో రూపొందించారని, దాని అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వచ్చిందని టాక్‌. రెండో ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ‘ఫౌజీ’ కథ సాగనుంది. గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పాటు, బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరే రహస్య సైనికుడిగా ప్రభాస్ పాత్రను పరిచయం చేశారు. దేశం కోసం పోరాడే తిరుగుబాటు సైనికుడిగా ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ప్రభాస్ లుక్‌, యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో స్పై థ్రిల్లర్ అంశాలను జోడించడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘సీతారామం’తో గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, సుబోధ్ భావే, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, టీ-సిరీస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ముందుగా 2026 డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి, 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది కూడా చదవండి: మెగా అప్డేట్.. చిరంజీవి ‘కాకా’లో మరో బాలీవుడ్ స్టార్.!       [Prabhas Fauzi 15 Minute Action Sequence, Prabhas Fauzi Movie, Fauzi Action Sequence, Fauzi Glimpse, Rebel Star Prabhas, Fauzi Release Date, Hanu Raghavapudi, Imanvi, Telugu Film News]  
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ పేరు వినిపిస్తోంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అనిల్ కపూర్ ‘కాకా’లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్‌. ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథను మలుపు తిప్పే ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో, ఇప్పుడు అనిల్ కపూర్ పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కేవీఎన్ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు 85 శాతం పూర్తయిందని, డిసెంబర్ మొదటి వారంలోగా షూటింగ్ ను  ముగించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘కాకా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి, బాబీ కలయికలో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.  ఇది కూడా చదవండి: బిగ్గెస్ట్ డీల్‌.. ‘జనవరి 12 విడుదల’ బిజినెస్‌ క్రేజ్ మామూలుగా లేదుగా.!       [Anil Kapoor In Kaaka Movie, Chiranjeevi Kaaka, Megastar Chiranjeevi, Kaaka Movie Update, Anil Kapoor, Anurag Kashyap, Bobby Kolli, Anaswara Rajan, Telugu Film News]  
సంక్రాంతి బరిలోకి దిగుతోందంటే చాలు.. అనిల్‌ రావిపూడి సినిమాపై అంచనాలు పెరిగిపోతుంటాయి. అందులోనూ వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ లాంటి ఇద్దరు ప్రముఖ నటులు కలిసి నటిస్తుండటంతో ‘జనవరి 12 విడుదల’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌ గురించి వినిపిస్తున్న వార్తలు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తాజా ట్రేడ్‌ టాక్‌ ప్రకారం.. ‘జనవరి 12 విడుదల’ థియేట్రికల్‌ హక్కులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనే రూ.100 కోట్లకు పైగా బిజినెస్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే వెంకటేశ్‌ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రీ-రిలీజ్‌ డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా హక్కుల కోసం ఇతర ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించడం అనిల్‌ రావిపూడికి బాగా కలిసొచ్చింది. ‘ఎఫ్‌2’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలతో ఆయనకు ఈ పండగ సీజన్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. వెంకటేశ్‌తో ఆయనకు ఉన్న విజయవంతమైన అనుబంధం కూడా ఈ కొత్త సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక కారణం. ఇప్పుడు తొలిసారి వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ. కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌లోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన చిత్రబృందం.. 2027 జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి సీజన్‌లో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘ఇడుపు కాయితం’ సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ వేణు ఉడుగుల.!       [January 12 Vidudala Business, January 12 Vidudala Movie, Anil Ravipudi Sankranthi Movies, Victory Venkatesh, Nandamuri Kalyan Ram, Anil Ravipudi, Sankranthi 2027 Movies, Telugu Film News]  
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న రూరల్ ఎంటర్‌టైనర్‌ ‘ఇడుపు కాయితం’ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా టైటిల్‌ ప్రకటించినప్పుడే తెలంగాణ యాసలో ఉన్న పేరుపై కొందరు ట్రోల్స్ చేశారు. అసలు ఆ టైటిల్‌కు అర్థమేంటంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాట కూడా వివాదానికి దారితీయడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని పాటలో పెళ్లి వేడుకకు సంబంధించిన సన్నివేశాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పెళ్లిళ్లలో మందు పోసే సంప్రదాయాన్ని సినిమాలో చూపించిన తీరు వాస్తవానికి భిన్నంగా ఉందని విమర్శిస్తున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం తెలంగాణ సంస్కృతిని తప్పుగా చూపించొద్దంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు వేణు ఉడుగుల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి. తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలి. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను ఆదరిద్దాం.సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే  విమర్శించండి. కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని మీ అజ్ఞానంతో నిర్వచించకండి." అని వేణు ఉడుగుల తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మొత్తానికి, పాటలోని సన్నివేశాలపై వస్తున్న విమర్శలు ఒకవైపు.. తెలంగాణ సంస్కృతిని తెరపై చూపించే విధానంపై వేణు ఉడుగుల చేసిన వ్యాఖ్యలు మరోవైపు.. ‘ఇడుపు కాయితం’ చుట్టూ చర్చను మరింత పెంచాయి. సినిమా విడుదలయ్యాక ఈ సన్నివేశాలపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ సినిమాపై ఎన్టీఆర్ జెలసీ.. త్రివిక్రమ్‌కి ఫోన్ చేసి తిట్టేశాడు.! https://x.com/venuudugulafilm/status/2114227465283637420       [Venu Udugula On Idupu Kayitham Trolls, Idupu Kayitham Song, Idupu Kayitham Movie, Idupu Kayitham Trolls, Telangana Culture, Venu Udugula Twitter, Priyadarshi, Naga Durga, Telugu Film News]  
ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో త్రివిక్రమ్, తమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాలోని పాటలు, కథలోని భావోద్వేగాలు ఒక ప్రత్యేకమైన మూడ్‌లో సాగుతాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో తమన్ స్వరపరిచిన ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ వంటి పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ రెండు సినిమాల పాటలను పోల్చుతూ ఎన్టీఆర్ తమన్‌ను సరదాగా ఆటపట్టించారట. ‘అరవింద సమేత’లో తనకు విషాదభరితమైన పాటలు ఇచ్చి.. బన్నీకి మాత్రం ఇంత స్టైలిష్‌గా, హుషారుగా ఉండే పాటలు ఎలా ఇచ్చావంటూ ఫోన్‌లో తనదైన శైలిలో ప్రశ్నించారని తమన్ గుర్తుచేసుకున్నారు. "మాకేంట్రా ఏడపోయినావో, ఎప్పుడొస్తావో, ఎప్పుడు వెళ్లిపోతావో పాటలు ఇచ్చావు. వెంటనే బన్నీకి సామజవరగమన, బుట్టబొమ్మ, రాములో రాముల ఇచ్చావు" అంటూ ఎన్టీఆర్ ఫోన్ చేసి సరదాగా తిట్టాడని తమన్ వెల్లడించారు. https://x.com/ASVR_tarak/status/2113925818711994868 అలాగే ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రఫ్‌గా, మాస్ యాక్షన్‌తో సాగుతుంది. ‘అల వైకుంఠపురములో’ మూవీలో మాత్రం అల్లు అర్జున్‌ను చాలా స్టైలిష్‌గా చూపించారు త్రివిక్రమ్. ఈ విషయాన్ని కూడా ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారట. దీనిపై త్రివిక్రమ్ మాట్లాడుతూ.. తారక్ మా ఇద్దరికీ తలంటేశాడు. "నన్నేమో ఎండల్లో నిలబెట్టి, మీద దుమ్మేసేసి, చొక్కాలిప్పించేశారు" అంటూ తారక్ సరదాగా కోప్పడ్డాడని చెప్పారు. మొత్తానికి, ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర సినిమా విషయాలను ఎంత సరదాగా ప్రస్తావిస్తారో ఈ సంఘటన మరోసారి తెలియజేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి కలిసి ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్రివిక్రమ్ ఇప్పటికే వెల్లడించారు.  ఇది కూడా చదవండి: టాయిలెట్‌లో గ్యాంగ్‌స్టర్.. అసలు స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!       [Jr NTR, Aravinda Sametha Movie, Allu Arjun, Ala Vaikunthapurramuloo, NTR Trivikram Movie, Trivikram Srinivas, God Of War, Thaman s, Telugu Film News]
ఓ చిన్న పిల్లాడు.. ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్.. వీరిద్దరి మధ్య జరిగే ఓ విచిత్రమైన సంఘటన. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. ఇదే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘బత్తా’ సినిమా థియేటర్లలో మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. విజయ్ సేతుపతి నటించిన ‘బత్తా’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 29 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. విభిన్నమైన కథాంశం, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బత్తా అనే పేరు వింటేనే జనాలు భయపడేంత క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌గా విజయ్ సేతుపతి కనిపిస్తారు. తన మాటే శాసనంగా సాగిపోయే ఆయన జీవితంలో.. ఓ చిన్న పిల్లాడి కారణంగా ఊహించని పరిణామం ఎదురవుతుంది. శబరి అనే స్కూల్ పిల్లాడు అనుకోకుండా బత్తాను పాఠశాల టాయిలెట్‌లో బంధిస్తాడు. అక్కడి నుంచి బయటపడలేక గ్యాంగ్‌స్టర్ ఇబ్బందులు పడుతుంటాడు. మరోవైపు, తన ముందు ఉన్న వ్యక్తి ఎంత ప్రమాదకరమైనవాడో తెలిసి ఆ పిల్లాడు భయపడుతుంటాడు. అసలు ఆ చిన్న పిల్లాడు గ్యాంగ్‌స్టర్‌ను బయటకు తీసుకొస్తాడా? ఆ టాయిలెట్‌లో చిక్కుకున్న సమయం బత్తా జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? హింసతో బతికే అతడిలో మార్పు ఎలా మొదలవుతుంది? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. యాక్షన్, డార్క్ కామెడీతో పాటు భావోద్వేగాలకు కూడా ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు మాస్టర్ సాయి పృథ్వీరాజ్, లిజోమోల్ జోస్, అజయ్ ఘోష్, శాంతి బాలచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్‌గా విజయ్ సేతుపతి నటన, చిన్న పిల్లాడితో ఆయనకు ఏర్పడే అనుబంధం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దర్శకుడు బాలాజీ తరణీతరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అట్లీ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. సాధారణ గ్యాంగ్‌స్టర్ కథలా కాకుండా.. ఒక చిన్న సంఘటన ద్వారా మనిషిలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇది కూడా చదవండి: సెన్సార్ బోర్డులో కలకలం.. 500 సినిమాల డేటా లీక్.!       [Baththa OTT Release Date, Baththa Movie OTT, Vijay Sethupathi Baththa, Baththa Netflix Release, Baththa Telugu OTT, Vijay Sethupathi, Baththa Movie Story, Baththa Movie, Baththa OTT, Telugu Film News]  
సినిమా విడుదలకు ముందే కథలోని కీలక విషయాలు బయటకు వస్తే.. మేకర్స్‌కు ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే స్క్రిప్టులు, షూటింగ్ వివరాలను గోప్యంగా ఉంచేందుకు నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఇప్పుడు సినిమాలకు సర్టిఫికెట్లు ఇచ్చే సెన్సార్ బోర్డు దగ్గరే కీలక సమాచారం బయటకు వచ్చినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 500కు పైగా సినిమాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాల సర్టిఫికేషన్ ప్రక్రియ కోసం ‘ఈ-సినీప్రామాణ్’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగిస్తోంది. నిర్మాతలు తమ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన పత్రాలను ఈ పోర్టల్‌లో సమర్పిస్తుంటారు. అయితే, ఈ పోర్టల్‌లోని భద్రతా లోపం కారణంగా 500కు పైగా సినిమా టైటిళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటకు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. వీటిలో షూటింగ్ స్క్రిప్టులు, సెన్సార్ కట్ ఆర్డర్లు, సర్టిఫికేషన్ రికార్డులు, ఇతర కీలక పత్రాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఫైళ్లు కొంతకాలం పాటు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. కొన్ని సినిమాలకు సంబంధించిన పంపిణీ ఒప్పందాలు కూడా బయటపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి వివరాలు బయటకు వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగే వ్యాపార చర్చలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పోర్టల్ భద్రతను పరిశీలించేందుకు సెక్యూరిటీ ఆడిట్ కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో చిన్న సమాచారం లీక్ అయినా.. సినిమా ప్రచారంపై, ప్రేక్షకుల ఆసక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార ఒప్పందాలు బయటపడితే నిర్మాతలు, పంపిణీదారులకు అదనపు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి, 500కు పైగా సినిమాలకు సంబంధించిన పత్రాలు బయటపడినట్లు వస్తున్న వార్తలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ ఘటనకు అసలు కారణమేంటి? ఏయే సినిమాలపై ప్రభావం పడింది? అనే విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. CBFC విచారణ, సెక్యూరిటీ ఆడిట్‌లో బయటపడే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ కంటే వారణాసి 5 రెట్లు పెద్ద సినిమా.. కానీ 40 రోజులు ముందే.!       [Censor Board 500 Films Data Leak, CBFC Data Leak, 500 Movies Scripts Leak, CBFC Security Breach, e-Cinepramaan Portal, Film Certification Records, Telugu Film News]  
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్, ఊహకందని యాక్షన్ సీక్వెన్స్‌లు గుర్తుకొస్తాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు మహేశ్ బాబుతో ‘వారణాసి’ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి చెప్పిన విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఐదు నుంచి ఆరు రెట్లు భారీ స్థాయిలో ‘వారణాసి’ రూపొందుతోందని ఆయన వెల్లడించారు. అంతేకాదు.. అంత పెద్ద సినిమా షూటింగ్‌ను గత చిత్రంతో పోలిస్తే 40 రోజులు తక్కువ సమయంలో పూర్తి చేశారట. బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న రాజమౌళి, తన కొత్త సినిమా నిర్మాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి చేయడానికి 315 రోజులు పట్టిందని.. ‘వారణాసి’ మాత్రం 275 రోజుల్లోనే పూర్తయిందని తెలిపారు. ఇక్కడే అసలు విశేషం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ కంటే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా అయినప్పటికీ, షూటింగ్ సమయాన్ని 40 రోజులు తగ్గించగలిగారంటే దాని వెనుక ఎంత ప్రణాళిక ఉందో అర్థం చేసుకోవచ్చు. గత సినిమా నిర్మాణంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, ముందస్తు సన్నాహాలు ఈసారి బాగా ఉపయోగపడ్డాయని రాజమౌళి వివరించారు. ‘వారణాసి’ ప్రత్యేకత కేవలం భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో సినిమాలా రూపొందించాల్సి వచ్చిందని రాజమౌళి వెల్లడించారు. వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా వంటి విభిన్న ప్రాంతాలతో పాటు పురాణాలు, కాల ప్రయాణం వంటి అంశాలు కథలో భాగంగా ఉండనున్నాయి. ఒక్కో ప్రాంతం, ఒక్కో సన్నివేశం కోసం ప్రత్యేకంగా పరిశోధన చేయాల్సి వచ్చిందని.. వాటన్నింటినీ ఒకే కథలో భావోద్వేగపరంగా అనుసంధానించడం అతిపెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పారు. ఆరు, ఏడు సినిమాల అనుభూతిని ఒకే సినిమాలో ఇమిడ్చే ప్రయత్నం చేసినట్లు వివరించారు. ఈ సినిమాలో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీరాముడిగానూ కాసేపు కనువిందు చేయనున్నారు. ప్రియాంక చోప్రా జోనస్ మందాకిని పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘వారణాసి’ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందించడం కూడా ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’.. డిసెంబర్ నుంచి అసలు వేట మొదలు.!       [Rajamouli About Varanasi, Varanasi Bigger Than RRR, Varanasi Movie Update, RRR vs Varanasi, Varanasi Release Date, Varanasi Shoot Days, Varanasi Movie, SS Rajamouli, Mahesh Babu, Telugu Film News]  
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఈసారి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.. ఏకంగా మైథలాజికల్ ఎపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ ఇద్దరూ సిద్ధమవుతున్నారు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కోసం డిసెంబర్ 2026 నుంచి పూర్తిస్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్యస్వామి(మురుగన్) పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికే ఈ సినిమా కథను ఎన్టీఆర్‌కు వినిపించారని, స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారట. మైథలాజికల్ కథను తెరకెక్కించాలంటే కథ, పాత్రల రూపకల్పనతో పాటు సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకే ముందుగానే ప్రీ-ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పనులు పూర్తయ్యాక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం తన లుక్‌ను మార్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2027లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలవడం, అందులోనూ పౌరాణిక నేపథ్యంతో భారీ సినిమా చేయాలనుకోవడం ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి, ‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఆయన కెరీర్‌లోనే భిన్నమైన ప్రయత్నంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. డిసెంబర్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలైతే.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.  మరి మురుగన్ పాత్రలో ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ ఏ స్థాయిలో చూపించబోతున్నారు? అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇది కూడా చదవండి: విజయ్-రష్మిక విడాకుల న్యూస్.. ఎటుపోతోంది ఈ సమాజం.!       [God Of War Pre Production Begins In December, Jr NTR God Of War, NTR Trivikram Movie, God Of War Movie Update, NTR Lord Murugan Role, NTR Dragon Movie, NTR Kumara Swamy, Trivikram Srinivas, Anirudh Ravichander, Telugu Film News]  
భారతీయ వంటింటి అమృతం.. కొబ్బరి ప్రాముఖ్యత, ఆసక్తికరమైన విషయాలు..!   భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు. ఆరోగ్యం కోసం ప్రకృతి అందించిన అమృతంగా కొబ్బరిని చెప్పుకోవచ్చు.  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కోకోనట్ డే లేదా ప్రపంచ కొబ్బరి దినోత్సవం ను  జరుపుకుంటారు. ఆసియా-పసిఫిక్ కొబ్బరి కమ్యూనిటీ స్థాపించిన ఈ రోజును పురస్కరించుకుని 2009వ సంవత్సరం నుండి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  కొబ్బరి  ప్రాముఖ్యతను తెలుసుకోవడం, దాని సాగు, వినియోగం, అలాగే ఆర్థిక వ్యవస్థలో దాని పాత్రపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించడం వరల్డ్ కోకోనట్ డే ప్రధాన ఉద్దేశం. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  కొబ్బరి  చారిత్రక , సాంస్కృతిక ప్రాముఖ్యత.. భారతీయ సంస్కృతిలో , సనాతన సంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. అందుకే దీనిని కల్పవృక్షంతో  సమానంగా  పిలుస్తారు. కల్పవృక్షం అంటే అడిగిన కోరికలన్నీ తీర్చే చెట్టు అని అర్థం. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఆకుల నుండి పీచు వరకు, కొబ్బరి నీళ్ల నుండి కొబ్బరి నూనె వరకు అన్నీ మానవాళికి మేలు చేసేవే. భారతీయులు పూజలు, వ్రతాలు, శుభకార్యాలు, , కొత్త పనులు  మొదలు పెట్టేముందు కొబ్బరికాయ కొట్టడం శుభసూచకంగా భావిస్తారు. శ్రీఫలం అని పిలిచే ఈ కొబ్బరి దైవిక శక్తికి , పవిత్రతకు ప్రతీక. రైతుల జీవితాల్లో , ఆర్థిక వ్యవస్థలో కొబ్బరి పాత్ర.. కొబ్బరి కేవలం ఒక ఫలం మాత్రమే కాదు, లక్షలాది మంది రైతుల జీవనాధారం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కొబ్బరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో కొబ్బరి సాగు విస్తృతంగా జరుగుతుంది. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ద్వారా కోట్లాది మందికి ఉపాధి లభిస్తోంది. కొబ్బరి నూనె తయారుచేసే మిల్లులు, పీచుతో తయారు చేసే మ్యాట్లు, తాళ్ళు, కంపోస్ట్ ఎరువులు, కొబ్బరి చిప్పలతో చేసే హస్తకళల ద్వారా ఎంతోమంది స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతర్జాతీయంగా కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి వల్ల మన దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. ఆరోగ్య ప్రయోజనాల నిధి.. ఆరోగ్య పరంగా కొబ్బరి అందించే మేలు అపారమైనది. నేటి ఆధునిక జీవనశైలిలో ఏర్పడే అనేక ఆరోగ్య సమస్యలకు కొబ్బరి ఒక సహజమైన పరిష్కారంగా నిలుస్తుంది. లేత కొబ్బరి నీళ్లు ప్రకృతి అందించిన సహజమైన ఎనర్జీ డ్రింక్. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో లేదా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. కొబ్బరి నూనె.. కొబ్బరి నూనెను కేవలం వంటలకే కాకుండా ఆయుర్వేదంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, జుట్టు ఎదుగుదలకు,  గాయాలను మానడానికి బాగా తోడ్పడుతుంది. పచ్చి కొబ్బరి.. పచ్చి కొబ్బరిలో మంచి కొవ్వులు, పీచు పదార్థం , విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది , జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా కొబ్బరి మితంగా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో కొబ్బరి.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్లాస్టిక్ కాలుష్యం. ఈ సమస్యకు కొబ్బరి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. కొబ్బరి పీచు , చిప్పలతో తయారుచేసే ఉత్పత్తులు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. ఇవి త్వరగా మట్టిలో కలసిపోతాయి. కొబ్బరి పీచును కోకో పీట్ అని పిలుస్తారు. దీన్ని మొక్కల పెంపకంలో  నీటిని పట్టి ఉంచేందుకు ఉపయోగిస్తారు. దీనివల్ల నీటి వినియోగం తగ్గుతుంది. వరల్డ్ కోకోనట్ డే అనేది కొబ్బరి చెట్టు మనకు అందిస్తున్న ఎన్నో ప్రయోజనాలను గుర్తుచేసుకునే ఒక గొప్ప రోజు. సహజసిద్ధమైన కొబ్బరి ఉత్పత్తులను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, కొబ్బరి సాగుపై ఆధారపడిన రైతులకు, చిన్న తరహా పరిశ్రమలకు మద్దతుగా నిలిచినవారమవుతాం.  రూపశ్రీ.
వివాహం తర్వాత ప్రేమ నిలబడాలంటే.. ఈ విషయాలు తప్పక మాట్లాడుకోవాలి..! వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం వంటి అనేక విషయాలు  దంపతుల జీవితంలో భాగమవుతాయి. పెళ్లైన మొదట్లో  ఉన్న అనురాగం క్రమంగా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ల మధ్య కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే, ఎన్నో  జంటలు తమ మనసులోని ఆలోచనలను లేదా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందులను భాగస్వామితో సరిగ్గా పంచుకోకపోవడం వల్ల, ఆ సమస్యలు రానురాను పెద్దవిగా మారి ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. బంధం ఎప్పుడూ బలంగా, సంతోషంగా సాగాలంటే దంపతుల మధ్య ఎప్పుడూ  ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్  జరగడం చాలా అవసరం. నెలకు కనీసం ఒకసారైనా ఒక చోట ప్రశాంతంగా కూర్చుని, ఎలాంటి విమర్శలు లేదా వాదనలు లేకుండా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ముచ్చటించుకోవడం వల్ల దంపతుల మధ్య అవగాహన మరింత పెరుగుతుంది.  ఆర్థిక విషయాలు.. దంపతులు ప్రతి నెలా పంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో మొదటిది ఆర్థిక విషయాలు , ఖర్చులు. కుటుంబ ఆదాయం ఎంత, నెలకు ఎంత ఖర్చు అవుతోంది, పొదుపు ఎంత చేయాలి, ముందస్తుగా ఎదురయ్యే పెద్ద ఖర్చులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ఇద్దరూ స్పష్టత తెచ్చుకోవాలి. ఆర్థిక ప్రాధాన్యతలు ఇద్దరికీ భిన్నంగా ఉన్నప్పటికీ, వాటిని ఒకరికొకరు వివరించి అర్థం చేసుకోవడం వల్ల అనవసరమైన ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఎమోషన్స్.. బంధంలో కేవలం అంతా బాగానే ఉందా అని అడిగితే సరిపోదు. జీవిత భాగస్వామి మనసులోని భావాలను, వారికి ఏమైనా లోటుగా అనిపిస్తోందా లేదా అనే విషయాలను తెలుసుకోవాలి. చిన్న చిన్న అసంతృప్తులను మొదట్లోనే  గుర్తించి వాటిని అడిగి తెలుసుకోవడం  ద్వారా పెద్ద గొడవలను నివారించవచ్చు.  ఇంటి బాధ్యతలు.. ఇంటి బాధ్యతలను విభజించుకోవడం కూడా భార్యాభర్తలు తప్పక మాట్లాడుకోవాలి. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇంటికి కావలసిన వస్తువులు కొనడం, బిల్లులు చెల్లించడం వంటి పనుల భారం కేవలం ఒక్కరిపైనే పడితే అది క్రమంగా విసుగుకు దారితీస్తుంది. అందుకే నెలకు ఒకసారి ఇంటి బాధ్యతల గురించి మాట్లాడుకుని , పనులను ఇద్దరూ సమానంగా పంచుకోవడం ద్వారా సహకారాన్ని పెంచుకోవచ్చు. కుటుంబాలతో సంబంధాలు.. ఇరువైపుల కుటుంబాలు,  బంధువులతో సంబంధాలు కూడా చాలా ముఖ్యం. రెండు కుటుంబాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా ఒత్తిళ్లు ఉన్నప్పుడు వాటిని దాచిపెట్టకుండా ప్రశాంతంగా చర్చించాలి. తన మాటలను భాగస్వామి వింటున్నారనే నమ్మకం అవతలి వ్యక్తికి కలిగేలా వాతావరణం ఉండాలి. పర్సనల్ టైమ్.. పెళ్లయినంత మాత్రాన వ్యక్తిగత ఆసక్తులు లేదా సొంత సమయాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. దంపతులు ఇద్దరూ తమకు కేటాయించుకునే పర్సనల్  సమయంతో పాటు, కేవలం ఇద్దరే ప్రశాంతంగా గడిపే సమయాన్ని కూడా నెలకు కొంతవరకు కేటాయించుకోవడం బంధానికి కొత్త ఊపిరిని ఇస్తుంది.  భవిష్యత్తు ప్రణాళికలు.. ఉద్యోగం, కొత్త ఇల్లు కొనడం, ప్రయాణాలు, పిల్లల భవిష్యత్తు లేదా దీర్ఘకాలిక పొదుపు వంటి విషయాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా లేకపోయినా, పరస్పరం చర్చించుకోవడం ద్వారా ఒకరి ప్రాధాన్యతలను మరొకరు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.   ఒకరినొకరు మెచ్చుకోవడం.. భార్యాభర్తల కమ్యూనికేషన్ అనేది  కేవలం సమస్యలను పరిష్కరించడానికో లేదా అవసరం కొద్ది మాట్లాడటమూ  కాకుండా, భాగస్వామి చేసిన మంచి పనులను గుర్తించడానికి కూడా ఉపయోగపడాలి. భాగస్వామిలోని మంచి గుణాలను, వారు అందించిన సహకారాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం వల్ల దంపతుల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడి బంధం మరింత మధురంగా మారుతుంది.                                                                                                                                          *రూపశ్రీ.
ప్రతి భార్య తెలుసుకోవాల్సిన విషయం.. భర్తతో ఏం చెప్పాలి..ఏం చెప్పకూడదు.! పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని, ప్రతి విషయం ఒకరితో ఒకరు పంచుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ, భర్తతో ఏ విషయాలు పంచుకోవాలి, ఏ విషయాలు పంచుకోకూడదు అనే దానిపై కొంత విజ్ఞత పాటించడం చాలా ముఖ్యం. ప్రతి భార్య తమ కాపురాన్ని మరింత సంతోషంగా ఉంచుకోవడానికి భర్తతో ఏ విషయాలు చెప్పాలి? ఏ విషయాలు చెప్పకూడదు?  వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే.. వ్యక్తిగత అభిరుచులు , స్పేస్.. పెళ్లి అయ్యాక కూడా ప్రతి ఒక్కరికీ వారి సొంత ఇష్టాలు, అలవాట్లు, అభిరుచులు ఉంటాయి. తమకు నచ్చిన దుస్తులు ధరించడం, స్నేహితులతో కొంత సమయం గడపడం లేదా వ్యక్తిగత ఆసక్తులను అనుసరించడం చాలా సాధారణమైన విషయం. వీటి కోసం ఏదో తప్పు చేస్తున్న వాళ్లలా ఫీల్ కావాల్సిన  అవసరం లేదు. భర్తతో ఈ విషయాల గురించి మనసు విప్పి మాట్లాడితే ఇద్దరూ ఒకరికొకరు వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ సంతోషంగా ఉండవచ్చు. బంధువులు లేదా స్నేహితుల రహస్యాలు.. ఎవరో తమ స్నేహితురాలూ లేదా బంధువు తమపై నమ్మకంతో కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకొని ఉండవచ్చు. అలాంటి విషయాలను అనుమతి లేకుండా ఇతరులతో, ముఖ్యంగా భర్తతో చెప్పడం సరికాదు. ఎదుటివారి వ్యక్తిగత గోప్యతను గౌరవించడం చాలా అవసరం. అయితే, ఎవరికైనా ఎలాంటిదైనా తీవ్రమైన ప్రమాదం లేదా ప్రొటెక్షన్ కు సంబంధించిన,  సహాయం కోసం అర్థించడం వంటి సమస్య ఉంటే అప్పుడు భర్తతో  మాట్లాడటంలో తప్పులేదు. పాతకాలపు జ్ఞాపకాలు లేదా సంబంధాలు.. పెళ్లికి ముందు ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. ఆ వ్యక్తిగత గతానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని భర్తకు పూసగుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రస్తుత జీవితంతో ఎలాంటి సంబంధం లేని విషయాలను అనవసరంగా మాట్లాడటం వల్ల మనసుల్లో చిన్నపాటి అపార్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గతానికి సంబంధించిన విషయాలు ప్రస్తుత కాపురాన్ని, ఆరోగ్యాన్ని లేదా భద్రతను ప్రభావితం చేసేలా ఉంటే మాత్రం నిజాయితీగా స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది. కోపంలో మాటలను మనసులో పెట్టుకోకూడదు.. కొన్నిసార్లు చిన్నపాటి మనస్పర్థల వల్ల లేదా కోపం కారణంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగవచ్చు. ఆ సమయంలో ఇద్దరూ కోపంతో కొన్ని మాటలు అనడం సాధారణం. ఆ కోపపు మాటలను జీవితాంతం మనసులో ఉంచుకొని ప్రతిసారీ గుర్తుచేయడం వల్ల బంధం బలహీనపడుతుంది. ఆవేశం తగ్గాక ప్రశాంతంగా కూర్చుని అసలు సమస్య ఏమిటో మాట్లాడుకోవడం ఎప్పుడూ మంచిది. ప్రతి చిన్న ఆందోళనను వెంటనే చెప్పాలనుకోవడం.. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే దాని గురించి ఆలోచించి ఒత్తిడికి గురికావాల్సిన పనిలేదు. ప్రతి మనిషికి తమ మనసులోని భావాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం. భార్య ఏదైనా చిన్న విషయంతో ఇబ్బంది పడుతుంటే, ముందుగా తనను తాను శాంతపరచుకొని, సరైన సమయం చూసి భర్తతో ఆ విషయం గురించి మాట్లాడవచ్చు. అయితే ఏ విషయాన్నీ చాలాకాలం పాటు మనసులోనే దాచుకోవడం కూడా మంచిది కాదు, సరైన సమయంలో భర్తతో షేర్ చేసుకోవడం  వల్ల మనసు తేలికవుతుంది. సంతోషకరమైన కాపురానికి సూత్రం.. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయం దాచడం లేదా ప్రతిదీ చెప్పాలనే ఒత్తిడి పెట్టుకోవడం రెండు పద్ధతులూ సరైనవి కావు. ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, కుటుంబ నిర్ణయాలు వంటి ముఖ్యమైన విషయాల్లో నిజాయితీగా ఉండటం ఎంత అవసరమో, పర్సనల్  స్పేస్ ను, ఇతరుల ప్రైవసీని  గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సరిహద్దులను మరొకరు గౌరవించుకుంటే ఆ బంధం ఎల్లప్పుడూ కలకాలం పదిలంగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
కాఫీ, టీ తాగడానికి ముందు మంచి నీరు తాగడం మంచిదేనా ? ఈ నిజాలు తెలుసుకోండి..! ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వచ్చే ఉత్సాహమే వేరు. రోజువారి అలసటను పారద్రోలి, మనసును తేలికపరచడంలో కాఫీ, టీలు ఎంతగానో సహాయపడతాయి. అయితే, మనలో చాలామందికి కాఫీ లేదా టీ తాగడానికి కొద్ది నిమిషాల ముందు కాస్త మంచినీరు  తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటూ ఉంటుంది. కొందరైతే కాఫీ, టీ తాగడానికి ముందు నీరు తాగితే కడుపులో యాసిడ్లు పల్చబడిపోతాయని, దానివల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుందని చెబుతుంటారు. మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో, అసలు సైన్స్ ఏం చెబుతుందో  వివరంగా తెలుసుకుంటే.. ఎసిడిటీ పెరుగుతుందా? కాఫీ ,  టీ తాగడానికి ముందు మంచి నీరు తాగితే కడుపులో ఎసిడిటీ పెరుగుతుందని అనుకోవడం కేవలం ఒక పొరపాటు లేదా  అపోహ మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిజానికి, టీ లేదా కాఫీ తాగడానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరానికి , జీర్ణవ్యవస్థకు  అనేక రకాల ప్రయోజనాలను పొందుతాయి. కెఫీన్ ప్రభావం తగ్గిస్తుంది.. కాఫీ , తేయాకులలో సహజంగానే కెఫిన్ తో పాటు కొంతవరకు యాసిడ్ స్వభావం ఉంటుంది. పరగడుపున లేదా ఖాళీ కడుపుతో వీటిని నేరుగా తాగినప్పుడు, కడుపులోని పొరలు చికాకుకు గురై ఎసిడిటీ, గుండెల్లో మంట, లేదా కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అయితే, కాఫీ లేదా టీ తాగడానికి ఐదు నుండి పది నిమిషాల ముందు సాధారణ నీటిని తాగడం వల్ల, ఆ నీరు పొట్టలోని యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇది ఒక రక్షణ పొరలా పనిచేసి, కెఫిన్ పొట్ట గోడలపై నేరుగా చూపించే తీవ్ర ప్రభావాన్ని తగ్గిస్తుంది. నీరు తాగడం వల్ల కడుపులోని  రసాలు పల్చబడి జీర్ణక్రియ పాడవుతుందని అనుకుంటారు. మనం తాగే ఒక గ్లాసు నీరు పొట్టలో చాలా వేగంగా శోషించబడుతుంది. అంతేకాకుండా, నీరు పొట్టను జీర్ణక్రియకు సిద్ధం చేస్తుంది. టీ, కాఫీలలో ఉండే టానిన్లు, కెఫిన్ వల్ల కడుపులో కలిగే మంటను నివారించడంలో ఈ నీరు ఎంతగానో తోడ్పడుతుంది.  నోటి ఆరోగ్యం.. టీ, కాఫీలు తాగడం వల్ల వాటిలోని రసాయనాలు దంతాలపై పసుపు రంగు మరకలను ఏర్పరుస్తాయి. అంతేకాకుండా దంతాల ఎనామిల్ ను బలహీనపరుస్తాయి. కాఫీ లేదా టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల నోటిలోని పిహెచ్ స్థాయిలు సమతుల్యంగా మారి దంతాల ఎనామిల్ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే, కాఫీ, టీలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహేడ్రేషన్ కు  గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ముందుగానే నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చివరిగా.. కాఫీ లేదా టీ తాగడానికి ముందు కొద్దిగా  సాధారణ నీటిని తాగడం చాలా మంచి అలవాటు. ఇది ఎసిడిటీని పెంచకపోగా, మరింత తగ్గించి జీర్ణవ్యవస్థను సురక్షితంగా ఉంచుతుంది. కాబట్టి  టీ లేదా కాఫీకి కొద్ది నిమిషాల ముందు కొద్దిగా  నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే..                                                                                                                                              *రూపశ్రీ.
కడుపులో మంట, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారా? తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఛాతీలో మంటగా అనిపించడం, కడుపు నిండినట్లు ఉండటం వంటి లక్షణాలను చాలామంది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ఎలాంటి అలవాట్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి? ఏ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి? ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ వైద్యులు  డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు గారు గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించిన  ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. తరచుగా గ్యాస్ రావడానికి గల కారణాలు, కడుపులో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల వెనుక ఉండే కారణాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి? సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, అతిగా తినడం, నిద్రకు సంబంధించిన అలవాట్లు వంటి అనేక అంశాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. కొందరిలో తరచుగా కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, తేన్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలు పదేపదే ఎందుకు వస్తున్నాయి? మన రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అనే విషయాలను డాక్టర్ వివరణలో తెలుసుకోండి. GERD అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కడుపులోని ఆమ్లం తిరిగి ఆహారనాళంలోకి రావడాన్ని గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) అంటారు. దీనివల్ల ఛాతీలో మంట, నోటిలోకి పుల్లటి ద్రవం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలకు, GERD వంటి పరిస్థితులకు మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం ముఖ్యం. ఈ సమస్యలకు కారణాలు ఏమిటి? ఎప్పుడు వైద్య పరీక్షలు అవసరమవుతాయి? అనే అంశాలపై ఈ వీడియోలో అవగాహన పొందవచ్చు. గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష ఎప్పుడు అవసరం? గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష అవసరం ఉండదు. అయితే, లక్షణాలు, వాటి తీవ్రత, వైద్యుడి పరిశీలన ఆధారంగా ఈ పరీక్షను సూచించవచ్చు. కడుపులో మంట లేదా అజీర్ణం ఎక్కువకాలం కొనసాగితే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ఆహారపు అలవాట్లు, నిద్ర, గట్ హెల్త్ ప్రాధాన్యం జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో ముఖ్యం. మన పేగుల్లో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుంది? గట్ హెల్త్‌ను కాపాడుకోవడానికి ఎలాంటి అలవాట్లు ఉపయోగపడతాయి? తరచుగా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు తరచుగా వస్తున్నా, కడుపులో మంట తగ్గకపోయినా, అజీర్ణం లేదా కడుపు ఉబ్బరం ఎక్కువకాలం కొనసాగినా స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించండి. తీవ్రమైన కడుపునొప్పి, రక్తవాంతులు, నల్లటి మలం, మింగడంలో ఇబ్బంది లేదా కారణం తెలియని బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే తక్షణ వైద్య పరిశీలన అవసరం. గ్యాస్ట్రిక్ సమస్యలకు గల కారణాలు, GERD లక్షణాలు, గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష అవసరం, ఆహారపు అలవాట్లు, నిద్ర, గట్ హెల్త్ గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు గారి వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. మరింత ఆరోగ్య సమాచారం, వైద్య నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య విషయాల కోసం TeluguOne Health‌ను అనుసరించండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.
 జాగ్రత్త.. నొప్పి కూడా కనిపించకుండా శరీరంపై దాడి చేసే ఆరోగ్య సమస్యలు ఇవి..! శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా సాధారణంగా నొప్పి రూపంలో బయటపడుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, కీళ్లనొప్పులు వంటివి రాగానే మనం వెంటనే జాగ్రత్తపడి వైద్యులను సంప్రదిస్తాం. కానీ అన్ని ఆరోగ్య సమస్యలూ హెచ్చరికగా నొప్పిని ఇవ్వవు. మన శరీరంలో ఎలాంటి నొప్పి లేదా స్పష్టమైన లక్షణాలు లేకుండానే కొన్ని తీవ్రమైన వ్యాధులు సైలెంట్ గా మొదలై దెబ్బతీస్తుంటాయి. బయటకు మనం చాలా ఆరోగ్యంగా, ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపల అనారోగ్యం నిశ్శబ్దంగా పాకే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తుంటారు.నొప్పి లేకుండా సైలెంట్ కిల్లర్స్ లాగా శరీరాన్ని ఆక్రమించే ఆ జబ్బులు ఏంటో తెలుసుకుంటే.. నిశ్శబ్దంగా దాడి చేసే ప్రధాన ఆరోగ్య సమస్యలు.. హై బ్లడ్ ప్రెషర్ లేదా అధిక రక్తపోటు.. ఎక్కువ రక్తపోటు సమస్యను  ప్రధాన సైలెంట్ కిల్లర్ గా చెబుతారు. బిపి  బాగా పెరిగినా చాలామందికి ఎలాంటి నొప్పి గానీ, శారీరక ఇబ్బంది గానీ కనిపించదు. కేవలం తలనొప్పి లేదా తలతిరగడం వస్తేనే బిపి పెరిగిందని అనుకోవడం పొరపాటు. బిపి చాలా కాలం పాటు అదుపులో లేకపోతే అది నిశ్శబ్దంగా గుండె, మూత్రపిండాలు, కళ్లు , మెదడు రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆహారంలో ఉప్పు తగ్గించడం, రోజువారీ వ్యాయామం, బరువును అదుపులో ఉంచుకోవడం , తరచుగా బిపి తనిఖీ చేయించుకోవడం ద్వారా దీనిని అరికట్టవచ్చు. టైప్-2 డయాబెటిస్.. టైప్-2 డయాబెటిస్ కూడా మొదటి దశలో ఎలాంటి నొప్పులను కలిగించదు. శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా పనిచేయనప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. మొదట్లో  సాధారణ అలసట తప్ప ప్రత్యేకమైన లక్షణాలు ఉండవు. కానీ రక్తంలో వేగంగా  మారే చక్కెర స్థాయిలు దీర్ఘకాలంలో కంటి చూపు, నరాలు, గుండె , కిడ్నీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేదా హెచ్ బి ఎ1సి పరీక్షల ద్వారా దీనిని మొదట్లోనే  గుర్తించవచ్చు. క్రమబద్ధమైన వ్యాయామం , బాలెన్స్డ్ డైట్  తీసుకోవడం  దీనికి మంచి పరిష్కారం. ఫ్యాటీ లివర్.. ఫ్యాటీ లివర్ సమస్య కూడా కాలేయంలో కొవ్వు చేరుతున్న సమయంలో ఎలాంటి నొప్పిని తెలియజేయదు. కాలేయ కణాలలో అధిక కొవ్వు చేరడం వల్ల మొదట్లో  అసౌకర్యం ఉండదు కానీ, వ్యాధి ముదిరితే కాలేయ వాపు , ఫైబ్రోసిస్ కు దారితీస్తుంది. ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ , అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ. బరువు తగ్గడం, పౌష్టికాహారం తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్.. క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా మూత్రపిండాల వ్యాధి కూడా మొదటి దశల్లో ఎలాంటి నొప్పిని కలిగించదు. కిడ్నీల పనితీరు నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు శరీరంలో ద్రవాలు చేరి పాదాల వాపు, అలసట, మూత్రంలో మార్పులు వంటివి వ్యాధి ముదిరిన తర్వాతే కనిపిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బిపి, షుగర్  స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం మానుకోవాలి. కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి క్రియేటినిన్ , మూత్ర పరీక్షలు తోడ్పడతాయి. నొప్పి లేదు కదా అని నిర్లక్ష్యం చేయకుండా వయస్సు, శరీర తత్వాన్ని బట్టి సంవత్సరానికి కనీసం ఒకసారైనా సాధారణ హెల్త్ చెకప్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం. సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు , క్రమబద్ధమైన వైద్య పరీక్షలే మనల్ని ఈ నిశ్శబ్ద వ్యాధుల నుండి కాపాడుతాయి.                                                                                                                                                 *రూపశ్రీ.