తెలంగాణలో ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీకారం చుట్టిన సవాళ్ల రాజకీయం మలుపులు తిరుగుతూ ఎక్కడెక్కడికో పోతోంది. సూది కోసం సోది కెళితే. అన్నట్లుగా అసలు చర్చ పక్కకుపోయి,రాజకీయ రచ్చ, పొంగి పొరలుతోంది. సాగుతోంది. నిజానికి, సవాళ్ల రాజకీయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేవలం రైతు సమస్యల వరకే పరిమితం అయ్యారు. ‘రైతులకు ఎవరు ఎంత మేలు చేశారు తేల్చుకుందాం రండని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’కు,బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు బహిరంగ వేదిక నుంచి ఒకే సారి సవాలు విసిరారు.
ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారణాలు ఏవైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాలును ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,మాజీముఖ్యమంత్రి కేసీఆర్, పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,కేటీఆర్’ రియాక్ట్ అయ్యారు. సోమాజీగూడ గూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సై ..అన్నారు. ఇక అక్కడి నుంచి చర్చ,రచ్చగా మారింది. చర్చ జరగవలసింది, చట్ట సభల్లో కానీ, క్లుబ్బుల్లో, పబ్బుల్లో కాదని, అసలు ముఖ్యమంత్రి సవాలు చేసింది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్’ కు కానే కేటీఆర్’కు కాదని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కేటీఆర్’ విమర్శలను తిప్పి కొట్టారు.
నిజమే, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు,కాంగ్రెస్ నాయకులు లేటెస్ట్’గా చెపుతున్నట్లుగా ప్రజాసమస్యలు, ప్రభుత్వ విధానాలు చర్చించేందుకు సరైన వేదిక చట్ట సభలే..నిజానికి సమస్య లేదా విషయం ఏదైనా, చర్చ జరగవలసింది, చట్టసభల్లోనే,..అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు,ప్రజా సమస్యలపై చర్చలు జరగవలసింది చట్టసభల్లోనే..మరో వేదిక అది ఎంత పవిత్రమైనది అయినా, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు అది తగిన వేదిక కాదు. నిజమే కావచ్చును,చట్టసభలు ఎంత చక్కగా జరుగుతున్నాయో,గౌరవ ప్రజా ప్రతినిధుల ప్రవర్తన ఎంత గౌరవ ప్రదంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం..అయినా సరే చట్ట సభల తీరు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నా సరే,పభుత్వ విధానాలు, ప్రజాసమస్యలపై చర్చ జరగవలసింది చట్ట సభల్లోనే.. క్లబ్బుల్లోనో, మరో బహిరంగ ప్రదేశంలోనో కాదు. ఈ విషయంలో
అధికార, విపక్షాలకు ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండదు,ఉండరాదు.ఉన్నా అది పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదని, న్యాయస్థానాలు,రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాలో స్పష్టం చేశారు.
కానీ, ఇప్పడు రాష్ట్రంలో, రైతులకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసింది’ అనే విషయంపై చర్చ పేరిట జరుగతున్నరచ్చ, విషయానికి వస్తే.. చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.సవాళ్లు ప్రతి సవాళ్లుగా సాగుతున్నరాజకీయం,రాజకీయమ పార్టీలు, నాయకులు గమనిస్తున్నాయో లేదో సామాన్యులకు చీదర పుట్టిస్తోంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారని మీడియా చర్చల్లో పాల్గొంటున్న పెద్దలు హెచ్చరిస్తున్నారు.నిజానికి, రాజకీయ పార్టీల తీరు, అధికార విపక్ష సభ్యుల ప్రవర్తన అంతా శ్రీ వైష్ణవులే ..అన్నట్లు, ఉందని, సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యంతో కూడిన అవేద వ్యక్తపరుస్తున్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగిస్తున రాజకీయ రచ్చలో అసలు విషయం పక్కకు పోయి, కేవలం రాజకీయ రచ్చ మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఇదలా ఉంటే ఇప్పడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త ఎజెండాతో కొత్త ప్రపోజల్’తో ముందుకొచ్చారు. కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు రమ్మంటే వస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు.
అలాగే, ‘‘మీ సుదీర్ఘ అనుభవాన్ని, ఆలోచనల్నీ తెలంగాణ ప్రజలకు సూచన కింద ఇస్తే స్వాగతిస్తాం. మీరు ఏ తారీకు చెప్పినా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా, గోదావరి జలాలపె ఉమ్మడి రాష్ట్రంలో, తొమ్మిదిన్నరేళ్ల మీ పాలనలో, గడచిన ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకశంగా చర్చిద్దాం. స్పీకర్ అనుమతితో నిపుణులను కూడా పిలిచి అభిప్రాయం తీసుకుందాం’’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు, ఈ ప్రతిపాదనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడవలసి వుంది.అయితే, చర్చ అయినా, రచ్చ అయినా, ఏమి జరిగిన ఏమి జరగక పోయినా, చివరకు మిగిలేది శూన్యం.