Home

»

Latest News

ఆ అవ‌మానం భ‌రించ‌లేక క‌ట్టుబ‌ట్ట‌ల‌తో హైద‌రాబాద్ వచ్చేశారు..!

Mar 11, 2026

లోకంలో అన్నిటికంటే బలమైనది ఏది అంటే ‘డబ్బు’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ చేరి పలకరించే బంధువులే, అదే డబ్బు లేనప్పుడు ముఖం చాటేస్తారు. మన కళ్ళ ముందే ఉన్న మనవాళ్ళు పరాయి వాళ్ళలా మారిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఒకప్పుడు రాజ పరంపర అనిపించుకున్న కుటుంబం, పరిస్థితులు తారుమారైతే ఎంతటి దయనీయ స్థితికి చేరుతుందో, ఆ సమయంలో సొంత రక్తమే ఎంతటి ద్రోహానికి ఒడిగడుతుందో తెలియజెప్పే ఈ వీడియో రాజీవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రియురాలు పిలిచింది’ చిత్రంలోనిది. మమ్ముట్టి, అజిత్, టబు, ఐశ్వర్యారాయ్, శ్రీవిద్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నం దించారు. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తండ్రి వీలునామాలో ఆస్తినంతా కొడుకు పేరున రాశాడని తెలియగానే, అప్పటి వరకు ప్రేమానురాగాలతో ఉన్న బంధాలు ఒక్కసారిగా తెగిపోయాయి. తన సోదరి పద్మకు, ఆమె పిల్లలకు కనీసం ఉండటానికి నీడ కూడా లేకుండా చేయడమే కాక, ఆమెను తన ఇంట్లోనే ఒక పనిమనిషిలా చూడటం ఆ కొడుకు కసాయి బుద్ధిని తెలియజేస్తుంది. 

‘అమ్మా.. మనం వాళ్ళని ఎదిరించి పోరాడాలి లేదా ఊరు వదిలిపోవాలి’ అన్న కూతురి మాటలు ఆనాటి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడతాయి. సొంత మేనమామ దగ్గరే తప్పుడు లెక్కలు రాయించి ఆస్తి కాజేశారన్న నిందలు వస్తాయి. ఆ అవమానాన్ని భరించలేక కట్టుబట్టలతో ఆ ఇల్లు వదలాల్సి వచ్చింది. గౌరవంగా బతికిన ఆ కుటుంబం హైదరాబాద్ వంటి నగరానికి వచ్చి, వెయ్యి రూపాయల అద్దె ఇంట్లో నివసిస్తూ ప్రతి రూపాయి కోసం పడే కష్టాలు ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ‘రాజ పరంపర, మంచి కుటుంబం అని అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఇల్లు అద్దెకు ఇచ్చాను’ అని ఇంటి యజమాని అవమానించినప్ప్పుడు, సాయంత్రంలోగా డబ్బు కట్టకపోతే సామాన్లు బయట పారేస్తానని బెదిరించినప్ప్పుడు ఆ తల్లి పడే వేదన మాటల్లో చెప్పలేం.

ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అనుభవం ఉన్నా, కుటుంబం కోసం ఆ తల్లి టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగానికి కూడా సిద్ధపడటం, హోటల్‌లో అరటి పువ్వు వలిచే పని చేయడం చూస్తుంటే... ఆకలి ముందు అర్హతలు ఎంత చిన్నవో అర్థమవుతుంది. ‘మా కష్టం మాతోనే పోవాలి, మేము హోటల్‌లో పనిచేస్తున్న విషయం మా పిల్లలకు తెలియనివ్వకండి’ అని ఆ తల్లి పడే ఆరాటం ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తుంది.

డబ్బు లేనప్పుడు అయినవాళ్ళు కూడా ఎంత హీనంగా చూస్తారో, లోకం మనల్ని ఎంత  తక్కువ చేసి మాట్లాడుతుందో ఈ గాథ మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. కానీ ఎంతటి కష్ట కాలంలోనైనా అధైర్యపడకుండా, ఆత్మగౌరవంతో బ్రతకడమే నిజమైన గెలుపు. బంధాల కంటే డబ్బే ముఖ్యం అనుకునే ఈ లోకంలో, నిజమైన విలువలు ఎక్కడ ఉన్నాయో మనం గుర్తించాలని తెలియజెప్పే సన్నివేశాలతో కూడిన ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com