Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెళ్లికి ఒప్పుకునే ముందు అబ్బాయిలను ఈ విషయాలు తప్పకుండా అడగాలి..!
posted on: Mar 11, 2026 5:32PM

వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది. అబ్బాయి విషయంలో అయినా, అతని కుటుంబం పరంగా అయినా, ఆర్థిక విషయాలు అయినా.. ఏ సమస్య వచ్చినా అమ్మాయిలు ఎక్కువ ఇబ్బందుల పాలవుతారు.
ఒకప్పుడు సమస్య వస్తే.. సర్దుకుపోవాలని అనుకునేవారు అమ్మాయిలు. కానీ.. నేటికాలంలో అలా లేదు.. సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు ముఖ్య కారణం.. అబ్బాయిలు, అతని కుటుంబ సభ్యులు అయినప్పుడు ఆమె వారిని ఎదిరించడానికి సిద్దపడుతోంది, ప్రశ్నిస్తోంది, కానీ ఒత్తిడి అనుభవించేది కూడా అమ్మాయిలే. ఈ గొడవలు ఏమీ లేకుండా వివాహం తర్వాత జీవితం బాగుండాలంటే.. పెళ్లికి ఒప్పుకోవడానికి ముందు ప్రతి అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని అడగవలసిన ప్రశ్నలు కొన్నిఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
కెరీర్ లక్ష్యం..
సంబంధం ఫైనల్ కాబోతుంటే లేదా ఇప్పటికే ఫైనల్ అయి ఉంటే, కాబోయే భర్తను అతని కెరీర్ లక్ష్యాల గురించి అడగాలి. దీని గురించి ముందుగానే చర్చించడం మంచిది. అతను తన కెరీర్ గురించే కాదు.. అమ్మాయి కెరీర్‌కు మద్దతు ఇస్తాడా? లేదా.. ఈ విషయాలు ముందే మాట్లాడటం మంచిది. ఎందుకంటే వివాహం తర్వాత కెరీర్ ను పక్కన పెట్టి ఇంటిని చూసుకోమని చెప్పేవారు చాలా ఎక్కువమంది ఉంటారు.
డబ్బు..
డబ్బు గురించి మాట్లాడితే.. ఈ అమ్మాయి మనీ మైండెడ్ అని ఎవరైనా అనుకుంటారేమో అని వెనకడుగు వేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. కానీ పెళ్లి తర్వాత జీవితంలో చాలా వరకు డబ్బు కారణంగా గొడవలు వస్తుంటాయి. కాబోయే భర్తతో ముందుగానే డబ్బు నిర్వహణ గురించి చర్చించాలి. అతను డబ్బును ఎలా తెలివిగా ఆదా చేస్తాడో, అతను అప్పుల్లో ఉన్నాడా లేదా అనే విషయాలు మాట్లాడాలి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తారనే విషయం కూడా చర్చించాలి.
లైఫ్ స్టైల్..
సంబంధాన్ని నిర్ధారించుకునే ముందు అతని జీవనశైలి గురించి ప్రశ్నలు అడగాలి. భర్త జీవిత లక్ష్యాలను ప్రతి అమ్మాయి అడిగి తెలుసుకోవాలి. అతనికి ప్రయాణం చేయడం ఇష్టమా? అతనికి సినిమాలు చూడటం ఇష్టమా? రోజును ఎలా మలచుకుంటాడు.. ఇవన్నీ చర్చిస్తే.. వీటి సమాధానల మీదే అతని వ్యక్తిత్వం కూడా స్పష్టంగా తెలుస్తుంది.
పర్సనల్ సేవింగ్స్..
సంబంధం ఇక ఖాయం అనుకున్నప్పుడు వారితో వ్యక్తిగత పొదుపు గురించి చర్చించాలి. వారి భవిష్యత్తు ప్రణాళికలను కూడా ముందుగానే తెలుసుకోవాలి. వారి ప్లానింగ్స్ ప్రకారమే భార్య భవిష్యత్తు అతనితో ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తుంది. దీని వల్ల ఏవైనా సమస్యలు ఉంటే ముందే పరిష్కారమవుతాయి.
లోన్ లు, అప్పులు..
కాబోయే భర్తకు ఏవైనా అప్పులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అతని కుటుంబానికి ఏవైనా పెద్ద అప్పులు ఉన్నాయా లేదా బ్యాంక్ లోన్లు వంటివి ఉన్నాయా అని కూడా ముందుగానే అడగాలి.
పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందే అమ్మాయిలు కాబోయే భర్తను అడిగి క్లియర్ చేసుకుంటే వివాహం తర్వాత జీవితం చాలా వరకు సంతోషంగా గడిచిపోతుంది.
*రూపశ్రీ.






