Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజంపేట కూటమిలో అంతర్యుద్ధం!
posted on: Mar 8, 2026 12:55PM

రాయలసీమ ముఖద్వారం, అన్నమయ్య జిల్లా రాజకీయ కేంద్రం రాజంపేటలో ఇప్పుడు అసలైన 'రాజకీయం' మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే.. సొంత గూటిలోనే సాగుతున్న 'ఆధిపత్య పోరు' ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాసరాజుల మధ్య సాగుతున్న అంతర్యుద్ధం కూటమి శ్రేణులను అయోమయంలో నెట్టడమే కాకుండా, రాబోయే స్థానిక సమరానికి సవాలుగా మారింది.
*ఆధిపత్య పోరు
టిడిపి ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని, కష్టకాలంలో కేడర్‌కు అండగా నిలిచిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఇన్చార్జ్గా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నిర్మించుకున్న ఆయన, రాజంపేటపై తనదే పైచేయి అని భావిస్తున్నారు. మరోవైపు, మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో యల్లటూరు శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యావంతుడు, మృదుస్వభావి అనే ఇమేజ్‌తో ఆయన కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు.
*అసలు చిచ్చు ఎక్కడ?
రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న 'రాజుల' వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూలకారణమని పరిశీలకులు భావిస్తున్నారు.
*ప్రోటోకాల్ రచ్చ:
ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పార్టీ వేదికలు ఏర్పాటు చేసినా 'ముందువరుస' ఎవరిది? అనే అంశంపై ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోంది. రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా "అది మా నాయకుడి చలవే" అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితులు కూటమి క్యాడర్ పై ప్రభావం చూపుతోంది.ఒకే కూటమి కింద ఉన్నప్పటికీ, కార్యకర్తలు "జగన్ మోహన్ రాజు వర్గం", "శ్రీనివాసరాజు వర్గం"గా విడిపోవడం భవిష్యత్తులో కూటమికి గొడ్డలిపెట్టులా మారే ప్రమాదం ఉంది.
*వైఎస్సార్సీపీకి 'అయాచిత' బలం!
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీకి ఈ అంతర్గత కలహాలు వరంగా మారాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వంటి ఉద్ధండులను ఢీకొట్టాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి. కానీ, ఇక్కడ "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న చందంగా ఒకరిని ఒకరు నష్టం పరుచుకునే క్రమంలో ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
*అధిష్టానం మౌనం..
ఈ ఆధిపత్య పోరుపై అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినాయకత్వానికి పూర్తి సమాచారం ఉంది. అయితే, ఇద్దరినీ వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం మౌనం వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ మౌనం రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తోందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
రాజంపేట రాజకీయ యవనికపై ఈ ఇద్దరు 'రాజుల' పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకరు అనుభవాన్ని నమ్ముకుంటే, మరొకరు మారుతున్న సమీకరణాలను నమ్ముకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నడిస్తే రాజంపేటలో కూటమికి తిరుగుండదు.. కానీ, నేనే రోజు..నేనే రాజు అన్న చందంగా ఎవరికి వారు సాగితే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది



.webp)


