నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి తినడం వరకు, తక్కువ తినడానికి, త్వరగా బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం ఒక సులభమైన మార్గంగా అందరికీ కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఉంది. దీన్నే మధ్యంతర ఉపవాసం అని కూడా పిలుస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే.. హాని చేయడమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఇది పరిశోధనలలో తేలిందని కూడా అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
పరిశోధనలు తేల్చిన నిజం..
ఇటీవల 20,000 మందికి పైగా ప్రజలపై జరిపిన ఒక విశ్లేషణలో, రోజుకు ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు ఆహారం తీసుకోకుండా ఉండే వారికి గుండె జబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదం 91 శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. దీని అర్థం ఉపవాసం అందరికీ హానికరం అని కాదు, కానీ తక్కువ తినడం, ఎక్కువ సమయం ఆహారం లేకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.
వైద్యులు ఏం చెప్తున్నారంటే..
ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది శరీరంలో అనేక ఆకస్మిక మార్పులకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి, ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి, , కొవ్వు స్థాయిలు కూడా ప్రభావితమవుతాయి. ఈ మార్పులన్నీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయట. మరోవైపు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల చక్కెర, ఖనిజాలు , హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతుందని, ఇది హృదయ స్పందనలు గాడి తప్పే పరిస్థితి తీసుకొస్తుందని అంటున్నారు.
నీటి కొరత..
ఆహారం ఎక్కువ సేపు తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. ప్రజలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోనప్పుడు, తక్కువ నీరు తాగుతారు. దీనివల్ల సాధారణ గుండె కొట్టుకోవడానికి అవసరమైన పొటాషియం , మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు శరీరంలో తగ్గిపోతాయి. ఈ ఖనిజ లోపాలు డీహైడ్రేషన్ కారణంగా హృదయ స్పందన సజావుగా సాగడం కోసం గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా.. ఇది అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వదు. కొందరికి ఇది సమస్య కలిగిస్తుంది, మరికొందరికి మంచి ఫలితాలు కూడా ఇవ్వవచ్చు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు, ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా, కొన్ని రకాల మందులు తీసుకునే వారికి ఉపవాసం మంచిది కాదు,, ఆహారం తినకుండా మందులు వేసుకోలేం, ఆహారం తినకుండా మందులు వేసుకున్నా అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉంటే.. తరచుగా అలసట, తలతిరగడం, ఛాతిలో ఇబ్బందిగా ఉండటం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పే లక్షణాలు.
కాబట్టి ఉపవాసం పేరుతో ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండటం, శరీరాన్ని ఇబ్బందికి గురిచేసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే.. బరువు తగ్గాలన్నా, ఫిట్ గా ఉండాలన్నా మంచి పద్దతులలో ఆహారం తీసుకుంటూనే గోల్ రీచ్ అవ్వాలి.
*రూపశ్రీ.