హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'జేమ్స్ బాండ్' నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు డేనియల్ క్రెయిగ్ తర్వాత ఏజెంట్ 007 పాత్రలో ఎవరు కనిపిస్తారనే ప్రశ్నకు తెరపడింది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. 40 ఏళ్ల రాబర్ట్ ప్యాటిన్సన్ ఈ ప్రతిష్ఠాత్మక పాత్రను పోషించనున్న ఏడో నటుడిగా గుర్తింపు పొందాడు.
ఇప్పటివరకు జేమ్స్ బాండ్ పాత్రలో సీన్ కానరీ, జార్జ్ లాజెన్బై, రోజర్ మూర్, తిమోతీ డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రెయిగ్ నటించారు. వీరిలో డేనియల్ క్రెయిగ్ చివరిగా 2021లో విడుదలైన 'నో టైమ్ టు డై' చిత్రంలో బాండ్‌గా కనిపించాడు. అప్పటి నుంచి ఈ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంపై ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు రాబర్ట్ ప్యాటిన్సన్ను ఎంపిక చేయడంతో ఈ చర్చలకు ముగింపు పలికినట్టయింది.
అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మిస్తున్న జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలోని 26వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం వహించనున్నారు. 'పీకీ బ్లైండర్స్' సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న స్టీవెన్ నైట్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. అమీ పాస్కల్, డేవిడ్ హేమన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2025లో ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన సృజనాత్మక నియంత్రణను అమెజాన్ ఎంజీఎం సొంతం చేసుకున్న తర్వాత రూపొందుతున్న తొలి జేమ్స్ బాండ్ చిత్రం కావడం విశేషం.
ఇక కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్ కనిపించనున్న ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. బాండ్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే బ్లాక్ టక్సేడో సూట్లో ఆయన స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం జోష్ ఓ'కానర్, కల్లమ్ టర్నర్ వంటి నటుల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరకు రాబర్ట్ ప్యాటిన్సన్ను ఎంపిక చేస్తూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.
ఇది కూడా చదవండి: ఉపాసన ఎమోషనల్ కామెంట్స్.. ఆ సమయంలో రామ్ చరణ్!
ఈ సందర్భంగా రాబర్ట్ ప్యాటిన్సన్ స్పందిస్తూ.. జేమ్స్ బాండ్ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప పాత్రల్లో ఒకటని, అలాంటి పాత్రను తనకు అప్పగించడం జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేశాడు. దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ కూడా ప్యాటిన్సన్కు స్వాగతం పలుకుతూ, ఆయన బాండ్ పాత్రకు సరికొత్త శైలిని తీసుకొస్తారని ప్రశంసించారు. ఈ పాత్రలో ఆయనను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఇక రాబర్ట్ ప్యాటిన్సన్ కెరీర్ విషయానికి వస్తే.. 'హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్', 'ట్విలైట్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'టెనెట్', 'ది లైట్‌హౌస్', 'ది బ్యాట్‌మ్యాన్' వంటి చిత్రాలతో నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 2022లో వచ్చిన 'ది బ్యాట్‌మ్యాన్'లో బ్రూస్ వేన్ పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం 'ది బ్యాట్‌మ్యాన్ 2'తో పాటు పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు జేమ్స్ బాండ్‌గా కొత్త అవతారం ఎత్తనున్న నేపథ్యంలో ఆయన 007గా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
హైదరాబాద్‌లో ప్రాపర్టీ అమ్మేసిన అనుష్క!
చిరంజీవి సినిమా అనగానే రోజా రియాక్షన్: రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ, రకరకాల కులాలు ఉండవు!
[RobertPattinson, JamesBond, Daniel Craig, Agent007, DenisVilleneuve]





