LATEST NEWS
అంతర్జాతీయ  దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ధరలు మరింత తగ్గుతాయా లేక ఇదే సరైన కొనుగోలు సమయమా అన్న సందేహాల మధ్య ప్రముఖ ఆర్థిక రచయిత, పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి చేసిన వ్యాఖ్యలు మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.   అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఇటీవల సుమారు 9 శాతం మేర పడిపోయి 14 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.  సింగపూర్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,543.19 డాలర్ల స్థాయికి దిగిరాగా, భారత ఎంసీఎక్స్ మార్కెట్‌లోనూ పసిడి ఫ్యూచర్స్ భారీగా తగ్గి 10 గ్రాములకు రూ. 1,22,430 వద్ద కదలాడాయి. వెండి ధరలు కూడా భారీగా పతనమై కిలోగ్రాముకు రూ. 1,48,466 స్థాయికి చేరాయి.   ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన గరిష్ట స్థాయిలతో పోలిస్తే బంగారం ధరలు గణనీయంగా వెనక్కి తగ్గడం సాధారణ ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.  దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.   ధరల పతనంపై రాబర్ట్ కియోసాకి భిన్న కోణంలో స్పందించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంకింగ్ వ్యవస్థ, బాండ్ మార్కెట్లలోని లోపాలు అలాగే పెరుగుతున్న అమెరికా రుణభారం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.  ఇది కూడ చదవండి: పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.! మార్కెట్ కుదుపుల సమయంలో బలహీనంగా ఉన్న మదుపరులు భయంతో అమ్ముతుంటే, దీర్ఘకాల దృష్టి ఉన్నవారు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.అదే సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా కియోసాకి హెచ్చరించారు. "పడుతున్న కత్తిని పట్టుకునే ప్రయత్నం చేయకూడదు" అనే సామెతను గుర్తుచేస్తూ, ధరల పతనం పూర్తిగా ఆగే వరకు వేచి చూడటం లేదా దశలవారీగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచించారు.  మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు, గోల్డ్ ఈటీఎఫ్‌లు పసిడి నిల్వలను పెంచుకోవడం మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తోందని నివేదికలు చెబుతున్నాయి.   మున్ముందు ద్రవ్యోల్బణ గణాంకాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు, భౌగోళిక ఉద్రిక్తతల ఆధారంగా బంగారం ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. దీంతో చిన్న పెట్టుబడిదారులు, పసిడి ప్రియులు ఒక్కసారిగా కాకుండా తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: బంగారం ధరలు భారీ తగ్గుదల.. ప్రధాని మోదీకి సీటీఐ కృతజ్ఞతలు.! మీకు నచ్చవచ్చు: జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.!   [ Robert Kiyosaki, Gold Price Crash, Gold Price Today, Gold Rate, Silver Price, Gold Investment, Gold Market, MCX Gold, International Gold Prices, Gold ETF, US Federal Reserve ]
బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కళాకారులతో పాటు కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం దొరబాబు, రైజింగ్ రాజు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండల పరిధిలోని గొరగనమూడి, పెన్నాడ అగ్రహారం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కాకినాడలో కార్యక్రమాలు, ప్రచార పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను తొలుత సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం దొరబాబు, రైజింగ్ రాజును భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు అదుపుతప్పడానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇది కూడ చదవండి: పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.! జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ఇద్దరు నటులు ప్రమాదానికి గురయ్యారన్న వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రాణాపాయం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. తోటి కళాకారులు, అభిమానులు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నవ్వులు పంచే కళాకారులు ఇలా రోడ్డు ప్రమాదానికి గురికావడంతో బుల్లితెర అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు: మూడు వెంట్రుకలు..రూ.3.7 లక్షల ధర.. ఎవరివో తెలిస్తే షాకే.! మీకు నచ్చవచ్చు: బంగారం ధరలు భారీ తగ్గుదల.. ప్రధాని మోదీకి సీటీఐ కృతజ్ఞతలు.!     [ Jabardasth, Dorababu, Rising Raju, Jabardasth Comedians Accident, Road Accident, West Godavari, Palakoderu, Bhimavaram Hospital, Kakinada, Telugu TV Comedians ]
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది. గతంలో పసిడి కొనుగోళ్ల విషయంలో ప్రధాని ఇచ్చిన సూచన వల్ల లక్షలాది మంది వ్యాపారులు, మదుపరులు పెద్ద ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారని సీటీఐ పేర్కొంది.    మార్కెట్ గణాంకాల ప్రకారం కిలో బంగారం ధర రూ. 1.90 కోట్ల స్థాయి నుంచి రూ. 1.25 కోట్లకు దిగివచ్చింది. అంటే కిలోపై ఏకంగా రూ. 65 లక్షల మేర ధర తగ్గినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి.    కొన్ని నెలల క్రితం అధిక ధరల వద్ద బంగారం కొనవద్దంటూ ప్రధాని చేసిన సూచనను పాటించడం వల్లే ఇప్పుడీ భారీ పతనంలో నష్టాలు తప్పాయని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. ఆ సమయంలో గనుక భారీగా నిల్వలు కొనుగోలు చేసి ఉంటే, ఎంతోమంది ఆభరణాల వర్తకులు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పసిడి వ్యాపారం చేసే చిరు వర్తకులతో పాటు స్టాక్ మార్కెట్ మదుపరుల పెట్టుబడులకు కూడా ఈ జాగ్రత్త రక్షణ కల్పించిందని సీటీఐ తన లేఖలో వివరించింది. తొలుత ఆ సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, ప్రస్తుత పరిణామాలతో వ్యాపారుల ఆలోచనలో మార్పు వచ్చిందని తెలిపింది. ఇది కూడా చదవండి: అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.! లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, తన మాట విని ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించడం వల్ల ధరలు తగ్గాయని, తద్వారా సామాన్యుల సొమ్ము ఆదా అయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు తగ్గడం కుటుంబాలకు ఊరటనిచ్చే అంశమని పరిశీలకులు భావిస్తున్నారు.    బంగారం, వెండి వంటి సున్నితమైన లోహాల మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇస్తూ ఉండాలని సీటీఐ కోరింది. రానున్న రోజుల్లో సట్టా వ్యాపారం, నిల్వల కట్టడితో పాటు ధరల స్థిరత్వంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై వ్యాపారులు, కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకు నచ్చవచ్చు: ఒకే వేదికపై సీఎం విజయ్–సంగీత.. వేర్వేరు ఎంట్రీలతో రిసెప్షన్‌లో హాట్ టాపిక్.! మీకు నచ్చవచ్చు: పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.!     [ Gold prices, CTI, Prime Minister Modi, gold price fall, jewellers, Gold Prices India, Gold Import Duty Hike ]  
పెళ్లంటే ఎన్నో ఆశలు.. కొత్త జీవితంపై మరెన్నో కలలు. నిన్నటి వరకు అపరిచితులుగా ఉన్న ఇద్దరు.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఆ వరుడి జీవితంలో పెళ్లయిన మరుసటి రోజే ఊహించని విషాదం చోటుచేసుకుంది. చేతిలో చేయి వేసుకుని ఏడడుగులు నడిచిన ఆ నవదంపతుల జీవితంలోకి ఓ పసికందు రాకతో పెను కలకలం రేగింది.  అయితే ఆ పసికందు అప్పటికే విగతజీవిగా జన్మించడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన వెనుక ఉన్న పరిణామాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలయంకోట్టై సమీపంలోని అరియకుళం ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడికి, తాళయూత్తు ప్రాంతానికి చెందిన  ఓ యువతితో ఇటీవల వివాహం జరిగింది.  కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఆ యువకుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కానీ పెళ్లయిన కొన్ని గంటల్లోనే పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వివాహమైన మరుసటి రోజు ఉదయం నవవధువుకు తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావం మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  మరోవైపు వరుడి ఇంట్లోని బాత్రూమ్‌లో మృతశిశువు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏడు నెలల గర్భంతో ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో వరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనకు పెళ్లి చేసే సమయంలో వధువు గర్భవతి అన్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దాచిపెట్టారని ఆరోపించాడు. ఏడు నెలల గర్భంతో ఉన్న విషయాన్ని ముందే చెప్పకుండా వివాహం జరిపించి తనను మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవవధువును విచారిస్తున్నారు. అసలు గర్భధారణ విషయం ఎప్పుడు తెలిసింది? వివాహానికి ముందు ఈ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదు? కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవైపు పెళ్లయిన మరుసటి రోజే నవజాత శిశువు మృతి.. మరోవైపు వివాహానికి ముందే గర్భధారణ విషయాన్ని దాచారంటూ వరుడి ఫిర్యాదు.. వెరసి ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. అయితే శిశువు మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదికతోనే తేలనుంది. పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. మీకు నచ్చవచ్చు: అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.! మీకు నచ్చవచ్చు: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి.!     [ The bride gave birth the day after the wedding, Tirunelveli Crime News, Pichammal, Venkatesh, Tamil Nadu news,Marriage fraud case]
సర్వదర్శనానికి 8 గంటల సమయం.! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. వారాంతపు సెలవులు, పవిత్ర కార్తీక మాస విశిష్టత నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు కొండకు చేరుకుంటుండటంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.   ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేకుండా నేరుగా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు ఎనిమిది గంటల పాటు నిరీక్షణ తప్పడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.   నిన్న స్వామివారిని మొత్తం 84,014 మంది భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు.  మొక్కుల్లో భాగంగా 30,116 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.28 కోట్ల ఆదాయం చేరినట్లు అధికారులు తెలిపారు.   క్యూలైన్లలో సుదీర్ఘ సమయం వేచి ఉంటున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను ఎప్పటికప్పుడు అందిస్తూ భక్తులకు సేవలు కల్పిస్తున్నారు.   కార్తీక మాసంలో ఆలయ సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్య సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది.  వారాంతాలు కలిసి రావడంతో రద్దీ మరింత పెరిగిందని, భక్తులు సంయమనంతో సహకరిస్తూ దర్శనాలు పూర్తి చేసుకోవాలని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి.రాబోయే రోజుల్లో కూడా పవిత్ర తిథులు, సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శన సమయాలు, రద్దీ వివరాలను ముందుగానే తెలుసుకుని ప్రణాళిక ప్రకారం ప్రయాణాలు పెట్టుకోవడం మేలని యాత్రికులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి:  తన పాలనకు రేవంత్ సెల్ఫ్ రేటింగ్: నూటికి 65 మార్కులే.! [ Tirumala Devotees Crowd, Srivari Sarva Darshan Time, TTD Hundi Income, Vaikuntham Q Complex Compartments, Tirumala Darshans Are Awesome ]
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మహేష్ బాబుపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. మహేష్ బాబును ఒక్క మాటలో వర్ణించమని యాంకర్ అడగ్గా.. ఆయన చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారని, తనకు మహేష్ అంటే క్రష్ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనని అనుపమ తెలిపారు. చివరకు విలన్ పాత్ర వచ్చినా వదులుకోనని ఆసక్తికరంగా చెప్పారు. అయితే అలాంటి పాత్రలో నటించేటప్పుడు తనకు ఓ సమస్య ఎదురవుతుందని సరదాగా వెల్లడించారు. సినిమాలో విలన్‌గా నటిస్తూ మహేష్ బాబును కోపంగా చూడాల్సిన సన్నివేశాలు ఉంటే.. తాను మాత్రం ఆయన్ని రొమాంటిక్‌గా చూస్తానేమోనని నవ్వుతూ చెప్పారు. అంతేకాదు, మహేష్ బాబు ఎదురుగా నిలబడితే డైలాగులు కూడా మర్చిపోయే అవకాశం ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక అనుపమ ఇటీవల ‘క్రేజీ కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అనుపమ.. మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వస్తే నిజంగానే విలన్‌గా కనిపిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.     [AnupamaParameswaran, MaheshBabu, AnupamaComments, AnupamaCrush, AnupamaVillain]
అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే గత కొద్దిరోజులుగా సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేసి ఈ వార్తలకు చెక్ పెట్టారు.  సినిమా ట్రైలర్‌ను నవంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో నాగచైతన్య, మీనాక్షి చౌదరి, జయరామ్ కనిపిస్తున్నారు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మరోసారి కన్ఫర్మ్ చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 4, 2026న ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.  ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. జయరామ్, సత్య, జరీనా వాహబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా నాగచైతన్యను మునుపెన్నడూ చూడని మిస్టరీ, అడ్వెంచర్ ప్రపంచంలో చూపించబోతున్నారని ప్రచార చిత్రాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ట్రైలర్ నవంబర్ 25న రానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాయిదా వార్తలకు మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో డిసెంబర్ 4న ‘వృషకర్మ’ విడుదల ఖాయమని తెలుస్తోంది.     [NagaChaitanya, Vrushakarma, MeenakshiChaudhary, KarthikVarmaDandu, Sukumar]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, పాటలతో సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. తాజాగా అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 27న థియేటర్లలోకి రావాల్సిన ‘మైసా’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ సినిమా వాయిదా పడటానికి గల కారణాన్ని నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ వెల్లడించింది. ప్రస్తుతం తెలుగు సినిమా సాంకేతికంగా కొత్త స్థాయికి చేరుకుంటోందని, అదే స్థాయిలో ‘మైసా’ను కూడా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ప్రేక్షకులకు గొప్ప బిగ్‌స్క్రీన్ అనుభూతిని అందించేందుకు, సినిమా విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘ఒసేయ్ రాములమ్మ’ పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ పాటలో విజయశాంతి నటించిన పాత ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రంలోని ఐకానిక్ పాటను మళ్లీ రూపొందించారు. అయితే సినిమా వాయిదా పడటంతో రష్మిక అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గోండు మహిళగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.     [RashmikaMandanna, MysaaMovie, MysaaReleasePostponed, RawindraPulle, OseyRamulamma] 
మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న టాక్ షో ‘మెగావర్స్’పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ షోతో చిరంజీవి ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తాజాగా ఈ షో గ్రాండ్ లాంచ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 30, 2026న హైదరాబాద్‌లో ‘మెగావర్స్’ కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ టాక్ షోలో చిరంజీవి పలువురు ప్రముఖ నటులతో ఆసక్తికరమైన సంభాషణలు చేయనున్నారు. నాగార్జున, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలు ఈ షోలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమా ప్రయాణం, సినీ ప్రముఖుల అనుభవాలు, తెరవెనుక ఆసక్తికరమైన విషయాలు ఈ షోలో చర్చకు రానున్నాయి. ఇప్పటికే ‘మెగావర్స్’కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. చిరంజీవి గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి హోస్ట్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ షో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది, ఎవరెవరు అతిథులుగా రానున్నారు అనే విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     [ChiranjeeviMegaverse, ChiranjeeviNetflixShow, ChiranjeeviTalkShow, MegaverseLaunchDate]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 22న కార్తికేయ తన 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో పెట్టిన బర్త్‌డే పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కార్తికేయతో కలిసి దిగిన ఓ ఫొటోను మహేష్ బాబు షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే కార్త్.. నువ్వు ఇంకా పెద్ద కలలు కనాలని, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నువ్వు పెట్టిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ ఏడాది దక్కాలి. ఎప్పుడూ నీకు అండగా ఉంటాను’ అంటూ విషెస్ తెలిపారు. ఈ ఫొటో ‘వారణాసి’ సినిమా షూటింగ్ సమయంలో తీసినదిగా తెలుస్తోంది.  ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’లో కార్తికేయ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన సహ నిర్మాతగా కూడా ఉన్నారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన పలు పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ రెండు భాగాలకు కార్తికేయ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ప్రేమలు’ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వారణాసి’ సినిమా కోసం కలిసి పనిచేస్తున్న వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని ఈ బర్త్‌డే విషెస్ మరోసారి తెలియజేస్తున్నాయి.     [MaheshBabu, SSKarthikeyaBirthday, MaheshBabuBirthdayWishes, SSRajamouli, Varanasi]
'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat)లో శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'ఈఎన్ఈ రిపీట్'లో గ్యాంగ్‌లో కొత్త కుర్రాడిగా శ్రీనాథ్ మాగంటి పేరును ప్రకటించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సుశాంత్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆయన స్థానంలో శ్రీనాథ్ వచ్చాడు. అయితే ఇప్పుడు అదే విమర్శలను, ట్రోల్స్‌ను తన నటనతో ప్రశంసలుగా మార్చుకున్నాడు శ్రీనాథ్. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠంలతో కలిసి ప్రధాన పాత్రలో నటించిన ఆయన తన అద్భుతమైన నటనతో అందరి మనసులను గెలుచుకుంటున్నారు. ఇతర నటులను అనుకరించడానికి ప్రయత్నించకుండా తరుణ్ భాస్కర్ ఊహించుకున్న పాత్రకు తగ్గట్టుగా, తన నిజాయితీతో ప్రాణం పోశాడు శ్రీనాథ్ మాగంటి. శివాత్మిక రాజశేఖర్‌‌తో శ్రీనాథ్ మాగంటి కెమిస్ట్రీ, ఇద్దరి జంట తెరపై అందరినీ ఆకట్టుకుంటోంది.  కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని కోణాల్లో శ్రీనాథ్ ఆడియెన్స్‌ని మెప్పించారు. మొత్తానికి తనకు లభించిన ఈ అవకాశాన్ని సవాలును స్వీకరించి, ఒక నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.   [ENE repeat, srinath maganti, tarun bhaskar, telugu movie ene repeat]
రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నటించిన క్లాసిక్‌ చిత్రం ‘భక్త కన్నప్ప’కు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ)లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. తన పెదనాన్న నటించిన సినిమా ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రదర్శితం కావడంపై పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘భక్త కన్నప్ప’ సినిమా తన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకమైనదని ప్రభాస్‌ పేర్కొన్నారు. పెదనాన్న కృష్ణంరాజు నటించిన ఈ చిత్రాన్ని తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు నిర్మించారని, బాపు గారు అద్భుతంగా తెరకెక్కించారని గుర్తు చేసుకున్నారు. ఎన్నేళ్లు గడిచినా కొన్ని కథలు ఎప్పటికీ నిలిచిపోతాయని, ఈ సినిమాకు ఇఫీలో గౌరవం దక్కడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఇది తమ కుటుంబానికి అందమైన వారసత్వం, నిజమైన గౌరవం అని భావోద్వేగంగా రాసుకొచ్చారు. 1976 మే 26న విడుదలైన ‘భక్త కన్నప్ప’ ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా ఇఫీ 2026లో భారతీయ సినిమాల స్వర్ణోత్సవ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణంరాజు భక్త కన్నప్ప పాత్రలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కన్నప్ప భక్తి, శివుడిపై ఆయనకున్న అపారమైన విశ్వాసం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ప్రభాస్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, భాను చందర్‌, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రకటించారు. మరోవైపు పెదనాన్న కృష్ణంరాజు నటించిన క్లాసిక్‌ సినిమాకు ఇఫీలో గౌరవం దక్కడం ప్రభాస్‌ అభిమానులకు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. [Prabhas, BhaktaKannappa, IFFI2026, KrishnamRaju BhaktaKannappa50Years, IFFIGoldenJubileeFilms]
నభా నటేష్.. సెల్యులాయిడ్ పై తను పెర్ఫార్మ్ చేస్తుంటే అభిమానులు వెంటనే సింగర్స్ గా మారిపోయి 'కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. రాసే నీకే ముందుగా మదిలో మాట తియ్యగా'  అనే అద్భుతమైన మెలోడీని పాడుకుంటూ ఉంటారు. అంత హృద్యంగా నభా పెర్ఫార్మ్ ఉంటుంది.ఇస్మార్ట్ శంకర్ తో పాటు ప్రీవియస్ మూవీ నాగబంధం లాంటి సినిమాలే జస్ట్ శాంపిల్ పీసెస్.  ఈ బ్యూటీ  సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక "అధికారిక ప్రకటన" ఇప్పుడు నెట్టింట విపరీతమైన చర్చకు దారితీసింది. మొదట "అధికారిక ప్రకటన" అని చూడగానే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఏదో పెద్ద సినిమానో, లేక తీవ్రమైన వ్యక్తిగత విషయమో అనుకుని ఆందోళన పడ్డారు. కానీ లోతుగా చదివిన తర్వాత అసలు విషయం వేరే ఉందని అర్థమైంది. నభా నటేష్ తన తల్లికి బహిరంగ క్షమాపణ చెబుతూ ఒక హృద్యమైన, అదే సమయంలో సరదాగా సాగే నోట్‌  పంచుకుంది. ఎన్నో ఏళ్లుగా తన తల్లి చెప్పిన మాటలను, సలహాలను పట్టించుకోకుండా తాను చేసిన పొరపాటును ఆమె ఈ పోస్ట్‌లో నిజాయితీగా ఒప్పుకున్నారు. "నాకే ఎక్కువ తెలుసు" అని ఎన్నో ఏళ్లుగా భావించానని, కానీ ఇప్పుడు ఆ నిజాన్ని ఒప్పుకోక తప్పడం లేదని నభా తన మనసులోని మాటను బయటపెట్టారు. ముఖ్యంగా "మా అమ్మ చెప్పేది కరెక్టే" అంటూ ఆమె రాసిన వాక్యం ఇప్పుడు ప్రతి ఇంట్లోని పరిస్థితిని గుర్తు చేస్తోంది.   రోజువారీ జీవితంలో ఏం తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, అతిగా ఆలోచించడం ఎప్పుడు ఆపాలి అనే విషయాల నుంచి మొదలుకొని, ఆఖరికి కడుపు నొప్పి వచ్చినా లేదా కడుపు సహకరించనప్పుడు ఏం చేయాలన్న దానికి అమ్మ దగ్గరే ఖచ్చితమైన సమాధానం ఉంటుందని నభా స్పష్టం చేశారు. అయినప్పటికీ తాను మాత్రం మొదట అడగాల్సిన అమ్మను పక్కన పెట్టి, ఇంటర్నెట్‌లో గూగుల్‌లో వెతకడం, సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, అవసరమైతే స్నేహితులను అడగడం వంటి పనులు చేసి ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తుంటానని సరదాగా చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్‌లో అందరినీ ఎక్కువగా ఆకట్టుకున్నది ఆమె చెప్పిన క్షమాపణ తీరు. అందరి ముందూ ఈ విషయాన్ని ఒప్పుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నా, ఈసారి కూడా అమ్మే కరెక్ట్ అని, అమ్మ మాట విననందుకు ఇదే తన బహిరంగ క్షమాపణ అని నభా పేర్కొన్నారు. అంతేకాకుండా, అమ్మ "నేను ముందే చెప్పాను కదా!" అనేలోపే ముందే సారీ చెప్పేస్తున్నానంటూ సరదాగా ముగించారు. కొన్ని క్షమాపణలు చెప్పడం మరికొన్నింటి కంటే కష్టమని, ముఖ్యంగా అమ్మ చెప్పిందే మొదటి నుంచి సరైనదని ఒప్పుకోవాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలతో ఆమె పెట్టిన క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అసలు ఏమైందని ఆరా తీస్తుండగా, మరికొందరు ఇది ఏదైనా సినిమా ప్రమోషన్ కోసమా అని సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు నభా తెలుగులో ఇంత చక్కగా రాయడం చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో అమ్మాయిల పరిస్థితి ఇంతేనంటూ యువతులు, నెటిజన్లు ఈ పోస్ట్‌కి బలంగానే  కనెక్ట్ అవుతున్నారు. ఇటీవల కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న నభా నటేష్, ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్  "స్వయంభూ"లో ఆమె సుందరవల్లి అనే క్యారక్టర్ లో కనిపించనుంది. అలాగే తన మాతృభాష కన్నడ సినీ రంగంలోనూ విశాల్ ఆత్రేయ దర్శకత్వంలో ధ్రువ సర్జా సరసన నటిస్తూ మరో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. https://www.instagram.com/p/Df_-EKqPeIF/   మీకు నచ్చవచ్చు:జనరల్ రైలులో విజయ్ ఆంటోనీ! మీకు నచ్చవచ్చు:సినిమాకి ఆ ప్రేక్షకులు ఎందుకు దూరమయ్యారు? వాళ్ల పుణ్యమేనా!   [Nabha Natesh ,  public apology to mother, Swayambhu, Tollywood]  
ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల అనుబంధం.. ఇలా మొదలయ్యే కథ ఒక్కసారిగా సర్వైవల్‌ థ్రిల్లర్‌గా మారితే ఎలా ఉంటుంది? తమిళంలో అశోక్‌ సెల్వన్‌, ప్రీతీ ముకుందన్‌ జంటగా నటించిన ‘అన్బిల్ అవన్’ సినిమా ఇలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తికేయన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైంది. నవంబర్‌ 20 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రొమాన్స్‌, యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. సూర్య (అశోక్‌ సెల్వన్‌), ఇందు (ప్రీతీ ముకుందన్‌) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తూ ఉద్యోగ ఒత్తిడిని, అవమానాలను ఎదుర్కొంటుంటారు. నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో హోమ్‌స్టే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఓ పాత బంగ్లా వారికి నచ్చుతుంది. ఒకప్పుడు రాణి పద్మిని (రేవతి) నివసించిన ఆ బంగ్లాను ఆమె నుంచి సూర్య అతికష్టం మీద కొనుగోలు చేస్తాడు. అయితే ఆ బంగ్లాపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే రాజనాయగం మాత్రం దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. బంగ్లా కొనుగోలు చేసినప్పటి నుంచి సూర్య దంపతులకు సమస్యలు మొదలవుతాయి. ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడులు చేయడం, పోలీస్‌ అధికారి తవసి కూడా ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించడం, ఇందుతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరుగుతాయి. చివరికి సూర్య ఇంట్లో ఏనుగు దంతాలు, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు పెట్టించి అతడిని కేసులో ఇరికించాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ఓ హత్యను సూర్య తన ఫోన్‌లో రికార్డు చేయడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. భార్యను, తాము ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని కాపాడుకోవడానికి ఓ సాధారణ యువకుడు చేసే పోరాటం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతాయి. రాజకీయ నాయకుడు, వకీలు, పోలీస్‌ అధికారి కలిసి సూర్య దంపతులను చుట్టుముట్టే సమయంలో కథ వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్‌ను రూపొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అశోక్‌ సెల్వన్‌, ప్రీతీ ముకుందన్‌ తమ పాత్రల్లో సహజంగా నటించారు. గౌతమ్‌ రాజేంద్రన్‌ కెమెరా పనితనం, గోవింద్‌ వసంత నేపథ్య సంగీతం, కార్తికేయన్‌ టేకింగ్‌ సినిమాకు బలంగా నిలుస్తాయి. అయితే కథలోని కొన్ని అంశాలు మరింత బలంగా ఉండాల్సింది. రొమాన్స్‌తో మొదలైన కథలోకి థ్రిల్లర్‌ అంశాలు వచ్చిన తర్వాత కొన్ని సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి. అయినప్పటికీ భార్యాభర్తల అనుబంధం, తమ కలను కాపాడుకోవడానికి వారు చేసే పోరాటం, చివరి భాగంలోని ఉత్కంఠ సర్వైవల్‌ థ్రిల్లర్‌ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈ జోనర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ‘అన్బిల్ అవన్’ ఓసారి చూడదగిన చిత్రంగా చెప్పొచ్చు.     [AnbilAvan, SonyLIV, AshokSelvan, Preity Mukhundhan, TamilSurvivalThriller]
ప్రముఖ యాంకర్‌, నటి ఉదయభాను తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ భేటీ అనంతరం తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు ఉదయభాను. లోకేశ్‌ ఆలోచనా విధానం, సమాజం పట్ల ఆయనకున్న దృక్పథం, తన మాటలను శ్రద్ధగా విన్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆయనపై గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా పోస్ట్‌ పెట్టారు. నారా లోకేశ్‌ను దూరదృష్టి కలిగిన నాయకుడిగా అభివర్ణించిన ఉదయభాను.. ఆయన ఆలోచనల్లో స్పష్టత, ప్రగతిశీల దృక్పథం, ఇతరుల పట్ల చూపించే నిజమైన శ్రద్ధ తనకు ఎంతో నచ్చాయని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తాను ఆలోచించిన కొన్ని ఆశయాలు, కార్యక్రమాలను ఆయనతో పంచుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అయితే ఈ సమావేశంలో తనను ఎక్కువగా ఆకట్టుకున్నది లోకేశ్‌ స్పందించిన తీరేనని ఉదయభాను చెప్పారు. తాను చెప్పిన విషయాలను ఎంతో శ్రద్ధగా వినడమే కాకుండా, వాటిపై లోతుగా అవగాహన చేసుకుని ఆలోచనాత్మకంగా స్పందించారని వెల్లడించారు. మెరుగైన భవిష్యత్తు కోసం మనం పెట్టుకున్న ఆశయాలను ఎదుటివారు అంతే నిబద్ధతతో స్వీకరించినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకంగా ఉంటుందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కొన్ని సంభాషణలు మనసులో చిరకాలం నిలిచిపోతాయని, మరికొన్ని భవిష్యత్తులో గొప్ప మార్పులకు బాటలు వేస్తాయనే ఆశను కలిగిస్తాయని ఉదయభాను రాసుకొచ్చారు. ఇది కూడా చదవండి: ‘డ్రాగన్‌’లో చర్చి సీక్వెన్స్‌.. ఎన్టీఆర్‌, రుక్మిణి వసంత్‌పై భారీ పెళ్లి వేడుక! ఉదయభాను తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులకు యాంకర్‌గా సుపరిచితురాలు. తనదైన మాటతీరుతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఆమె సినిమాల్లోనూ నటించారు. తాజాగా నారా లోకేశ్‌తో భేటీ, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఉదయభాను ప్రస్తావించిన సామాజిక కార్యక్రమాలు ఏమిటి? వాటిని అమలు చేసే దిశగా ఏమైనా ముందడుగు పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: మహేష్ బాబు, అనిల్‌ రావిపూడి కాంబో రిపీట్‌.. అసలు ట్విస్ట్ ఏంటంటే.? ప్రశాంత్‌ వర్మకు బిగ్ షాక్.. మరో ‘హనుమాన్‌ 2’ ప్రకటించిన ప్రొడ్యూసర్స్! https://www.instagram.com/reel/DgAL-4NyL2Z/       [Udaya Bhanu, Nara Lokesh, Meeting, Andhra Pradesh, Amaravati]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సాధారణంగా ఇంట్లో పొట్లకాయ కూర అనగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కానీ అదే పొట్లకాయకు పచ్చిశనగపప్పు తోడైతే ఆ రుచి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఒకసారి ఈ పద్ధతిలో పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర వండితే మాంసం కూరలను కూడా మర్చిపోవాల్సిందేనన్నంత అద్భుతమైన రుచి సొంతమవుతుంది. వేడివేడి అన్నం, చపాతీ, లేదా రోటి దేనిలోకి తిన్నా ఈ కూర అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కూర కావాలనిపించేలా చేసే ఈ వంటకం మన వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే సులభంగా సిద్ధమవుతుంది. కేవలం 5 దశల్లో ఈ వంట విధానాన్ని పూర్తి చేయవచ్చు. ఈ కూర రుచికి అసలు పునాది పచ్చిశనగపప్పును సరిగ్గా ఉడికించడంలోనే ఉంది. ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును తీసుకుని, తగినన్ని నీళ్లు మరియు కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పప్పును మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా ఒక మాదిరిగా గింజ చెదరకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యస్థంగా ఉడికిన పప్పు పొట్లకాయ ముక్కలతో కలిసినప్పుడు కూరకు ప్రత్యేకమైన పోకడ, రుచి వస్తాయి. తాలింపు వేసే విధానం కూర ఘుమఘుమలకు ప్రాణం పోస్తుంది. పాన్‌లో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మరియు శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపు గింజలు చక్కగా వేగిన వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు రంగు వచ్చేవరకు ఓపికగా వేపుకుంటే కూరకు సహజమైన తీపి, కమ్మదనం చేరుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు గుజ్జులా మగ్గాక, అందులో నాలుగు పొట్లకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరియు కారం వేసి బాగా కలపాలి. మసాలాలు, ఉప్పు, కారం పొట్లకాయ ముక్కలకు చక్కగా పట్టేలా కలిపితే ప్రతి ముక్కా రుచిగా మారుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఉదయం, ఇలా పసుపు నీళ్లు తాగితే. చర్మం మెరిసిపోవడంతో పాటు బోలెడు లాభాలు! ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు బాగా ఉడికించాలి. పొట్లకాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిశనగపప్పును ఇందులో కలపాలి. పప్పు వేసిన తర్వాత కూరను మరో 4 నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి. ఆ 4 నిమిషాల సమయం పప్పు, కూర కలిసిపోవడానికి ఎంతో కీలకం. చివరగా తాజా కొత్తిమీర చల్లి దింపేస్తే ఘుమఘుమలాడే పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర సిద్ధం. తక్కువ శ్రమతో, తక్కువ సమయంలోనే ఇంటిల్లిపాదికీ నచ్చే ఈ కూరను తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆంధ్ర రుచుల ఇష్టపడేవారికి ఇది ఖచ్చితంగా ఫేవరెట్ డిష్‌గా నిలిచిపోతుంది. మీకు నచ్చవచ్చు:ఆముదం ఆకుల, రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు! ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!                                    రోజ్ వాటర్ తో, మీ చర్మం మెరిసిపోవాలంటే, ఇలా ట్రై చేయండి!       Potlakaya Senagapappu Kura, Snake Gourd Chana Dal Curry, Andhra Veg Curries, Traditional Telugu Recipes, Vegetarian Meat Alternative, Healthy Lunch Curry, Cooking Recipes In Telugu.  
చలికాలం రాగానే వాతావరణంలో చలిగాలులు పెరిగి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరినీ జలుబు, దగ్గు, కఫం సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో వచ్చే సాధారణ దగ్గు కూడా కొన్నిసార్లు త్వరగా తగ్గకుండా రోజుల తరబడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా గొంతు గరగర, ముక్కు కారడం, ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మందులపైనే కాకుండా మన ఇంట్లో సులభంగా దొరికే సహజ పదార్థాలతో కూడిన సాంప్రదాయ ఇంటి చిట్కాలపై కూడా దృష్టి పెట్టడం ఎంతో మేలు చేస్తుంది. మన పెద్దలు తరతరాలుగా పాటిస్తున్న ఇంటి వైద్యంలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. దగ్గులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి; అవి పొడి దగ్గు మరియు కఫంతో కూడిన దగ్గు. ఈ రెండు రకాల దగ్గులను అదుపులోకి తీసుకురావడానికి మన వంటగదిలో ఉండే పదార్థాలే చక్కగా పనిచేస్తాయి. కఫంతో కూడిన దగ్గుతో బాధపడేవారికి తమలపాకు, తేనె కలయిక ఒక అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుంది. ఒక తాజా తమలపాకు తీసుకుని దాని తొడిమను తీసేసి, ఆకుపై ఒక స్పూన్ తేనె బాగా రాసి మడత పెట్టుకుని నెమ్మదిగా నమిలి రసాన్ని మింగాలి. ఇలా వరుసగా 2 రోజుల పాటు చేస్తే ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగి, దగ్గు నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు కరక్కాయ మరియు లవంగాలు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. కరక్కాయను చిన్నగా దంచి, అందులో ఒక చిన్న ముక్కను పంటి కింద పెట్టుకుని మెల్లిగా నములుతూ రసాన్ని మింగడం వల్ల గొంతులోని చికాకు తగ్గుతుంది. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తీసుకుంటే పొడి దగ్గు నుంచి మంచి ఊరట కలుగుతుంది. అలాగే పొడి దగ్గు ఉన్నప్పుడు 2 లవంగాలను పంటి కింద ఉంచుకుని నెమ్మదిగా నములుతూ రసం మింగడం కూడా గొంతుకు హాయిని ఇస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ లేదా మంట అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. కఫం త్వరగా బయటకు రావడానికి తేనె, లవంగాల పొడి చిట్కా కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. అర టేబుల్ స్పూన్ తేనెలో తాజాగా దంచి పెట్టుకున్న లవంగాల పొడిని కలిపి తీసుకుంటే కఫం కరిగి దగ్గు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ చిట్కాను వరుసగా 2 నుంచి 3 రోజుల పాటు పాటిస్తే దగ్గు, జలుబు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల కలిగే గొంతు నొప్పి, శ్వాసకోశ అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి ఈ సహజ పద్ధతులు సులభంగా ఆచరించదగినవిగా ఉంటాయి. ఇది కూడా చదవండి:ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర! చిన్నపిల్లల విషయంలో దగ్గు, జలుబు కనిపించినప్పుడు మరింత జాగ్రత్తగా సహజ నివారణలను ఎంచుకోవాలి. ఒక స్పూన్ తులసి ఆకు రసంలో 2 నుంచి 3 చుక్కల తేనె కలిపి ఉదయాన్నే పిల్లలకు తాగిస్తే జలుబు, దగ్గు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఏడాది లోపు శిశువులకు తేనె ఇవ్వకూడదనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు లేదా ఎవరికైనా దగ్గు, జలుబు ఎక్కువ రోజులు కొనసాగినా, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం. మొత్తంగా చూస్తే, చలికాలంలో వచ్చే దగ్గు, కఫం, జలుబు సమస్యలను ఎదుర్కోవడానికి తమలపాకు, తేనె, లవంగాలు, కరక్కాయ, తులసి మరియు గోరువెచ్చని ఉప్పు నీరు వంటి సాంప్రదాయ ఇంటి చిట్కాలు మన పెద్దలు అందించిన విలువైన ఆయుర్వేద జ్ఞానం. సరైన మోతాదులో, క్రమం తప్పకుండా వీటిని పాటించడం ద్వారా సహజంగానే ఉపశమనం పొందవచ్చు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఈ చలికాలంలో దగ్గు, జలుబు బారి నుంచి మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. మీకు నచ్చవచ్చు:ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి!                               ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!         Betel Leaf For Cough And Cold, Tamalapaku Home Remedies, Winter Cold Remedies, Elders Health Tips, Natural Cough Relief, Traditional Home Remedies, Health Tips In Telugu.
చలికాలం రాగానే భుజాలపై తెల్లని పొట్టు రాలడం, తలలో తీవ్రమైన దురద, పదేపదే గోకాలనిపించడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఉష్ణోగ్రతలు పడిపోగానే చుండ్రు అకస్మాత్తుగా మొదలవ్వడం లేదా మరింత తీవ్రంగా మారడం మనం తరచూ చూస్తుంటాం. చలి గాలి వల్ల తల చర్మం పొడిబారిపోతోంది కాబోలు అని చాలా మంది సులభంగా ఊహించేసుకుంటారు. కానీ తలలో పొట్టు రాలడానికి ప్రతిసారీ ఒకే కారణం ఉండదు. కొన్ని సందర్భాల్లో సాధారణ చుండ్రులా కనిపించేది నిజానికి సెబోర్రెయిక్ డెర్మటైటిస్ (Seborrhoeic Dermatitis) అనే వాపు సంబంధిత చర్మ సమస్య కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ రెండు సమస్యలకు చికిత్స విధానాలు వేర్వేరుగా ఉంటాయి. గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ డెర్మటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రూబెన్ భాసిన్ పాసి వివరాల ప్రకారం, తల చర్మంలో తేమ స్థాయి బాగా తగ్గిపోయినప్పుడు సాధారణంగా డ్రై స్కాల్ప్ లేదా పొడి తల చర్మం ఏర్పడుతుంది. చల్లని వాతావరణం, గాలిలో తక్కువ తేమ, ఘాటైన షాంపూలతో తరచూ తలస్నానం చేయడం, ఎక్కువసేపు వేడి నీటిని వాడటం వంటివి ఈ పొడిబారడానికి దారితీస్తాయి. ఇలాంటప్పుడు వచ్చే పొట్టు చాలా చిన్నదిగా, తెల్లగా, పౌడర్‌లా ఉంటుంది మరియు తల చర్మం బిగుతుగా లేదా స్వల్ప దురదతో అనిపిస్తుంది. డ్రై స్కాల్ప్ ఉన్నవారికి శరీరంలోని ఇతర భాగాల చర్మంపై కూడా పొడిబారడం కనిపించవచ్చు. మరోవైపు, సాధారణ చుండ్రు అనేది చర్మంపై సహజంగా ఉండే మలాసెజియా (Malassezia) అనే ఈస్ట్ అధికంగా పెరగడం లేదా దాని పనితీరు మారడంతో ముడిపడి ఉంటుంది. ఈ ఈస్ట్ చర్మంలోని నూనెలో ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. కొందరిలో ఈ ఈస్ట్, చర్మపు నూనెలు మరియు శరీరంలోని వాపు ప్రతిస్పందన కలిసినప్పుడు చర్మ కణాలు వేగంగా రాలిపోయి స్పష్టమైన పొట్టు, దురద ఏర్పడతాయి. ఈ సమస్య మరింత వాపుతో, దీర్ఘకాలం పాటు కొనసాగితే దానిని సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌గా నిర్ధారిస్తారు. సాధారణ పొడి తల చర్మానికి భిన్నంగా, సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌లో ఎరుపు రంగు, చికాకు మరియు కొంచెం జిడ్డుగా ఉండే తెలుపు లేదా లేత పసుపు రంగు పొట్టు కనిపించవచ్చు. ఇది తల చర్మం దాటి కనుబొమలు, ముక్కు పక్క భాగాలు, చెవుల వెనుక మరియు కొన్నిసార్లు ఛాతీపై కూడా ప్రభావం చూపవచ్చు. చలికాలంలో తక్కువ తేమ మరియు చల్లని ఉష్ణోగ్రతలు పొడిబారడాన్ని పెంచుతాయి, అలాగే హెయిర్ కేర్ అలవాట్లలో మార్పులు, ఒత్తిడి, అనారోగ్యం మరియు హార్మోన్ల ప్రభావాలు సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌ను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇది కూడా చదవండి:వింటర్ డైట్: చలికాలంలో బరువు తగ్గడానికి, పాటించాల్సిన సులువైన మార్గాలు! చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి ప్రతి రకమైన పొట్టుకు మందపాటి హెయిర్ ఆయిల్స్ రాయడం. నూనె రాయడం వల్ల పొడి జుట్టు కొంత మృదువుగా అనిపించవచ్చు కానీ, సెబోర్రెయిక్ డెర్మటైటిస్ ఉన్న తల చర్మంపై ఎక్కువ నూనె నేరుగా రాస్తే కొందరిలో లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్ పాసి స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ సమస్యకు తల చర్మంలోని నూనె మరియు మలాసెజియా ఈస్ట్‌తో దగ్గరి సంబంధం ఉంటుంది. అందువల్ల పొట్టు స్వభావాన్ని, దురద తీవ్రతను మరియు వాపు లక్షణాలను గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ డ్రై స్కాల్ప్ కోసం మైల్డ్ షాంపూ వాడటం, మరీ వేడి నీటిని నివారించడం, ఘాటైన ఉత్పత్తులను తగ్గించడం మరియు తల చర్మ అవసరానికి తగ్గట్టుగా తలస్నానాల వ్యవధిని సర్దుబాటు చేయడం మేలు చేస్తుంది. చుండ్రు మరియు సెబోర్రెయిక్ డెర్మటైటిస్ కోసం కెటోకొనజోల్ (Ketoconazole), సెలీనియం సల్ఫైడ్ (Selenium Sulphide) లేదా జింక్ పైరిథియోన్ (Zinc Pyrithione) వంటి యాంటీ ఫంగల్ మరియు మెడికేటెడ్ షాంపూలను సూచించవచ్చు. వీటిని తలకు పట్టించిన వెంటనే కడిగేయకుండా నిర్దేశించిన సమయం పాటు ఉంచి కడగాలి, లేదంటే వాటి ప్రభావం తగ్గుతుంది. దురద భరించలేనంతగా ఉన్నా తలను పదేపదే గట్టిగా గోకడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది, అలాగే తీవ్రమైన ఎరుపు, వాపు, మందపాటి ప్యాచెస్, నొప్పి లేదా జుట్టు రాలడం గమనిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం అత్యవసరం. మీకు నచ్చవచ్చు:మాయిశ్చరైజర్‌లో, SPF ఉంటే సరిపోతుందా? అసలు నిజాలు ఇవే!                                   ఉడికించిన అలసందలు తింటే, శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!       Winter Dandruff, Hair Oil And Dandruff, Winter Hair Care Mistakes, Scalp Flakes Treatment, Dermatologist Hair Advice, Dandruff Tips In Winter, Health Tips In Telugu.
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవిగా కనిపించినప్పటికీ ఎన్నో పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో సమృద్ధిగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids), డైటరీ ఫైబర్ (Dietary Fiber), ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా కీళ్ల ఆరోగ్యం, మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్థకు అవిసె గింజలు ఎలాంటి మేలు చేస్తాయి? వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి సమస్యలు ఉన్నవారికి అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉపయోగపడతాయి? శరీరంలో వాపు (Inflammation) తగ్గించడంలో వీటికి ఉన్న పాత్ర ఏమిటి? వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుకోవడానికి అవిసె గింజలు ఎలా తోడ్పడతాయి? వీటిలోని పోషకాలు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయి? అనే విషయాలను తెలుసుకుందాం. అంతేకాకుండా అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? కొలెస్ట్రాల్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి అవిసె గింజలు ఎలా సహాయపడతాయి? వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో వివరించారు. అయితే అవిసె గింజలను పచ్చిగా తినాలా? వేయించి తీసుకోవాలా? పొడి చేసుకుని తీసుకోవడం మంచిదా? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు అవిసె గింజలను తీసుకోవచ్చా? థైరాయిడ్ మందులు వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అందరూ వీటిని తీసుకోవచ్చా? ఎవరు ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి? అనే సందేహాలకు కూడా సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మగారు అవిసె గింజల్లోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు, తీసుకునే సరైన పద్ధతి, తగిన మోతాదు, తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేశారు. మరి గుప్పెడు అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి? కీళ్ల ఆరోగ్యం నుంచి మెదడు పనితీరు వరకు వీటి ప్రయోజనాలు ఏమిటి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని ఎలా తీసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి.
రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో తెలుసా? ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లకు ఆరోగ్యం గురించి, వాకింగ్ గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చే మాట  సమయం లేదని చెప్పడం. రోజు ఒక గంట వ్యాయామం చేయండి, కడుపునిండా నిద్ర పోండి, సమయానికి ఆహారం తినండి అని చెప్పడం సులువే కానీ, పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని ఒత్తిడిలో ఉన్న మనిషికి అది ఎంతవరకు సాధ్యం?  చాలామంది  ఇదే విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ సమయం లేకపోవడం లేదా చేయలేకపోతున్నామని సాకులు చెప్పుకోవడం మాని,  చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు. వ్యాయామం అంటే రోజుకు ఒక గంట తప్పనిసరిగా కేటాయిస్తేనే లాభం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టినా చాలు. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న విడతలుగా నడవడం, నెమ్మదిగా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం లాంటి వ్యాయామం అందేలా చూసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి కదలడం, తినే ఆహారం గురించి ముందే చిన్న ప్లానింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా వ్యాయామం కోసం ఉన్న కొద్దిపాటి నిద్రను మాత్రం తగ్గించుకోకూడదు.                                                                                                                                                 *రూపశ్రీ.
మన శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఎంతైనా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవడంతోపాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా డవలప్ అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. జామ.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే జామకాయ ద్వారా సుమారు ఐదు నుంచి ఆరు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కరిగే మరియు కరగని.. రెండు  రకాల పీచు పదార్థాలు  సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ సజావుగా సాగేలా సహాయపడటంతోపాటు కడుపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. రాస్స్ బెర్రీస్.. రాస్స్ బెర్రీస్ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక కప్పు రాస్స్ బెర్రీస్ లో దాదాపు ఎనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కరగని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!​ చియా గింజలు.. చియా గింజలలో పీచు పదార్థం చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం రెండు టీస్పూన్ల చియా గింజల ద్వారా సుమారు పది గ్రాముల పీచు లభిస్తుంది. ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి రూపంలో తయారవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. నల్ల మినప్పప్పు.. మన దేశంలో సులభంగా లభించే పొట్టుతో కూడిన మినుములు లేదా నల్ల మినపప్పు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన ఒక కప్పు మినపప్పులో దాదాపు పదహారు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కూడా కరిగే , కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి జీర్ణశక్తి మెరుగవుతుంది. వేయించిన శనగలు.. వేయించిన శనగలు పీచు పదార్థాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి వంద గ్రాముల వేయించిన శనగలలో సుమారు పదిహేడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో పీచుతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.                                                                                                                                            *రూపశ్రీ మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!