LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత తన పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2029 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడమనే ఏకైక లక్ష్యంతో ఆయన చేపట్టబోతున్న పాదయాత్ర వచ్చే ఏడాది జులైలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ప్రారంభించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాదయాత్ర కోసం ఇప్పటి నుంచే గ్రౌడ్ వర్క్ మొదలు పెట్టనున్నారు.  2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనంతో మమేకమై అధికార పగ్గాలు చేపట్టిన జగన్ అధికారం చేజిక్కిన తరువాత జనానికి ముఖం చాటేశారు. రోడ్లకు ఇరు వైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు సాగించారు. అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల అమలు అటుంచి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూడా పట్టించుకోవడం మానేశారు.   ఈ నేపథ్యంలో  ఈసారి జగన్ పాదాయత్రకు రాజకీయ సమీకరణాలు  భిన్నంగా ఉన్నాయి. గతంలో 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కొన్ని ఆ నమ్మకాన్ని   నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వైసీపీయులే చెబుతున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం.. 2017లో పాదయాత్రకు లభించిన ప్రాజాదరణ ఈ సారి అనుమానమేనని విశ్లేషిస్తున్నారు.   అది పక్కన పెడితే.. సెంటిమెంట్ ప్రకారం వైయస్ఆర్ జయంతి నాడే యాత్రను ప్రారంభించడం ప్రజలకు దగ్గర కావడానికి, వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి దోహదపడుతుందని జగన్ విశ్వసిన్తున్నారు. వచ్చే ఏడాదిజులై నుంచి జగన్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడకపోయినా.. పార్టీ వర్గాలు మాత్రం పాదయాత్రకు అదే ముహూర్తం ఖారరైందని గట్టిగా చెబుతున్నాయి.  2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్ల కాలంలో పెద్దగా జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు. జగన్ కూడా చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వినా.. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో  పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. ఇక ఒకరిద్దరు వినా పార్టీ నేతలు కూడా పొలిటికల్గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే.. పాదయాత్ర వినా మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నారు.  ఈ కారణంతోనే ఎన్నికలకు రెండేళ్లు ముందే పాదయాత్ర చేపట్టడం ద్వారా నిరంతరం జనంలో ఉండేలా పాదయాత్రను ఎంచుకున్నారు.    [Jagan Padayatra From July 2027, jagan padayatra 2.0, ys jagan mohan reddy, ap politics, ysr jayanthi,, andhra pradesh News, Telugu One]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలుదేశం పార్టీ తెలంగాణలో ఉనికి మాత్రంగానే మిగిలిందన్నది వాస్తవం. అయితే..  తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం పాత్ర  ఆ పార్టీపై  ప్రత్యర్థులు   కొనసాగిస్తున్న  విమర్శల దాడి  మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.  దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించిన ఒక ప్రధాన రాజకీయ శక్తిగా టీడీపీకి తిరుగులేని  చరిత్ర ఉంది. అయితే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.  రాష్ట్ర విభజన అనంతర  కాలంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయినప్పటికీ.. ఇప్పటికీ  ప్రత్యర్థి పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటం రివాజుగా మారిపోయింది. తెలంగాణ గడ్డపై పార్టీకి ఉన్న బలమైన పునాదులను, చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యర్థులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు పరిశీలకులు చెబుతుంటారు.   గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే..  టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం లేదా ఆ పార్టీ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం రాజకీయ ప్రత్యర్థులకు మామూలైపోయింది. ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో పార్టీకి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న క్యాడర్.  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నాటి పరిస్థితులు,  ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు నేటికీ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తుండటమే ఇందుకు నిదర్శనం.  అయితే..  తెలుగుదేశంపై విమర్శలను ప్రత్యర్థి పార్టీలు కేవలం   ఎన్నికల సమయాలకే పరిమితం చేయడంలేదు.. తమకు అవసరమైన ప్రతిసంర్భంలోనూ రాజకీయ వేడిని రగల్చడానికి ఒక సాధనంగా మార్చుకుంటున్నారు.  రాష్ట్రంలో అధికార,  ప్రతిపక్ష పార్టీలక మధ్య   మాటల యుద్ధంలో తెలుగుదేశం ప్రస్తావన అన్నది అనివార్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం ప్రస్తావనే తమ రాజకీయ ఉనికిని బలోపేతం చేస్తుందన్న భావన తెలంగాణ రాజకీయ పార్టీలలో బలంగా పేరుకుపోయిందనడానికి ఇది నిదర్శనమని చెప్పుకోవాల్సి ఉంటుంది.   తాజాగా కొండా సురేఖ ఎపిసోడ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలకు ఆమె తెలుగుదేశం పార్టీనే ఆశ్రయించారు. రేవంత్ లో ఉన్నది తెలుగుదేశం రక్తం కనుకనే కక్ష పూరితంగా తనపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇలా బీఆర్ఎస్, అలాగే కొత్తగా సొంత కుంపటి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న కల్వకుంట్ల కవిత, అధికార కాంగ్రెస్ తెలుగుదేశం జపం లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే తెలంగాణలో తెలుగుదేశం బలానికీ, ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఉన్న పట్టుకూ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [TDP in Telangana Politics, Telugu Desam Party, Telangana PoliticsNews, TDP Rivals Target, TeluguOne]
  తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుండి సడన్ గా బర్తరఫ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పేరు మీద ఒక భారీ ప్రకటన లేదా "బిగ్ అప్‌డేట్" త్వరలోనే రాబోతోందంటూ విపరీతంగా ప్రచారం సాగింది. దీంతో రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు సామాన్య ప్రజలు కొండా సురేఖ తదుపరి అడుగు ఎటువైపోనని ఉత్కంఠగా గమనించారు. అయితే, ఈ వైరల్ ప్రచారాలపై మాజీ మంత్రి కొండా సురేఖ స్వయంగా స్పందిస్తూ ఒక కీలక వివరణ ఇచ్చారు. తన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలని స్పష్టం చేశారు. కేవలం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలు, మీడియా నమ్మాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ వివాదానికి ప్రధాన బీజం కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యల నుంచే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీనివల్ల దాదాపు 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  కొందరు మంత్రులు సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.  అయితే, తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ పార్టీకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వేరొకరి అభిప్రాయాలకు తండ్రికి లేదా తల్లికి రాజకీయ బాధ్యత అప్పగించడం సరికాదని సమర్థించుకున్నారు. అయినప్పటికీ, పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్లు ఏఐసీసీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం సెప్టెంబర్ 3న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై సురేఖ తీవ్రంగా స్పందిస్తూ, తనకు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే బర్తరఫ్ చేశారని వాపోయారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి నిమిషంలో మాట్లాడే అవకాశం ఇస్తారని, కానీ తన పట్ల కనీస ప్రజాస్వామ్య సూత్రాలను కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, మంత్రి పదవి తనకు కేవలం ఒక అలంకారం మాత్రమేనని పేర్కొన్నారు.    తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని తేల్చిచెప్పారు. మరోవైపు, కొండా సురేఖ బర్తరఫ్‌తో పాటు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి జి. చిన్నారెడ్డిని కూడా తప్పించి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా సుధారాణిలను నియమిస్తూ ప్రభుత్వం కొన్ని కీలక ప్రక్షాళనలు చేపట్టింది. ప్రస్తుతం కొండా సురేఖ ఇచ్చిన వివరణతో ఆమె పార్టీ మారే ఆలోచనలో లేరని స్పష్టమైనప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలు ఇంకా సమసిపోలేదని స్పష్టమవుతోంది.     (Konda Surekha sacked, Telangana Cabinet churn, CM Revanth Reddy, Konda Surekha, Konda Sushmitha Patel comments, Telangana Congress news, Konda Surekha social media clarification, Telugu One, Telugu news)
రేవంత్ రెడ్డి తన కేబినెట్ నుంచి కొండా సురేఖను  బర్త్ రఫ్ తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయవర్గాలలో నెలకొంది. బీజేపీవైపు ఆమె అడుగులు పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలకు కూడా చేశారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ శైలిని ఆమె కొనియాడతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.  గతంలో బీఆర్ఎస్ పార్టీ  కొనసాగిన కాలంలో   కేసీఆర్‌తో  తమ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి తాజాగా వివరించిన  కొండా సురేఖ.. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. తాను ఆయనతో ఎప్పుడు భేటీ అయినా ఎంతో ఆప్యాయంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని  గుర్తుచేసుకున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసినప్పటికీ, కేసీఆర్ వ్యవహారశైలి తమకు ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి కలిగించలేదన్న కొండా సురేఖ.. బీఆర్ఎస్ అధినాయత్వంతో  తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పడమే కాకుండా.. కేసీఆర్ నాయకత్వంలో తనకు ఎటువంటి ఇబ్బందులూ ఎన్నడూ ఎదురు కాలేదన్నారు.  ఈ సందర్భంగా కొండా సురేఖ తన భర్త కొండా మురళికి గతంలో దక్కిన ఎమ్మెల్సీ పదవికి  కేసీఆర్ హయాంలోనే  దక్కిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కొండా మురళికి శాసనమండలికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు..  పార్టీలోని కొందరు సీనియర్ నేతలు  అడ్డుకునేందుకు  ప్రయత్నించారనీ, ముఖ్యంగా  కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు మురళికి ఆ పదవిని దక్కకుండా చేసేందుకు తెరవెనుక పావులు కదిపారని తాజాగా ఆరోపించారు. అయితే  కేసీఆర్ మాత్రం వాటన్నిటినీ తోసి రాజని,  కొండా మురళి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకారం అందించారని కొండా సురేఖ గుర్తు చేసారు.   ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా ఆమె అడుగులు ఎటుపడుతున్నాయన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చేయడమేనన్నారు. గతంలో  బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొండా సురేఖ.. ఇప్పుడు అదే పార్టీ అధినేతపై ప్రశంసల వర్షం గుప్పించడం వెనుక ఆమె గులాబీ గూటికి చేరే వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.    [Strategy Behind Konda Surekha Praises KCR, Konda, Brs, Konda Murali, MLC, Telangana Politics, Telugu One]
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రేవంత్  మంత్రివర్గ ప్రక్షాళన వ్యవహారం.. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్త్ రఫ్ తో కొత్త వివాదానికి తెరలేచింది.  తనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన పరిణామాలపై కొండా సురేఖ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గతంగా నడుస్తున్న పరిణామాలు, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు , రాష్ట్ర కాంగ్రెస్ లో పాత, కొత్త విభేదాలను మరోసారి తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యల ద్వారా తెరపైకి తీసుకువచ్చారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని, ఆయనలొ  ప్రవహిస్తున్నది టీడీపీ రక్తమేనన్న కొండా సురేఖ..  కక్షసాధింపు రాజకీయాలు, వెన్నుపోటు కుట్రలు  తెలుగుదేం రక్తంలోనే ఉన్నాయన్నారు.  తనను టార్గెట్ చేసే క్రమంలో చిన్నారెడ్డిని కూడా రాజకీయంగా బలి చేశారని కొండా సురేఖ ఆరోపంచారు. రక్షా బంధన్ సందర్భంగా తాను స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టానని గుర్తు చేసిన కొండా సురేఖ ఆ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి   ఈ వివాదం గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని చెబుతూ సెంటిమెంట్ పండించడానికి ప్రయత్నించారు. తనను కేబినెట్ నుంచి తప్పించే ఆలోచన  కాంగ్రెస్ అధిష్టానానికి లేదనీ, అయితే  కొందరు నేతలు స్వార్థ రాజకీయాల కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.  కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు అంతర్గతంగా ఏకమై తనపై పెద్ద కుట్ర పన్నారని  ఆరోపించారు. ముఖ్యమంత్రితో వేం నరేందర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడిస్తూ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారన్నారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు గతంలో తాను రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.  పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు పంపిన ఆ లేఖల్లో ప్రభుత్వ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా తన ప్రమేయం లేకుండానే మంత్రులు, అధికారులు చక్కబెట్టేశారని ఆ లేఖల్లో ఆరోపించారు.    [Konda Surekha Sensational Comments, Revanth Reddy, Congress Government, Telangana Politics, TDP Blood Comments, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
    తెలుగు చిత్ర పరిశ్రమలోని డ్యాన్సర్స్ అసోసియేషన్ కేంద్రంగా గత కొన్ని రోజులుగా చెలరేగిన తీవ్ర వివాదం ఇప్పుడు పోలీస్ కేసులు, ఫిర్యాదుల వరకు వెళ్లింది. డాన్సర్స్ అసోసియేషన్  కొత్త అధ్యక్షుడు  రఘు మాస్టర్ కార్యవర్గం చెల్లదంటూ జానీ మాస్టర్ సతీమణి, ప్రముఖ డాన్సర్ సుమలత హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. దీంతో పోలీసులు రఘు మాస్టర్ ని పిలిచి విచారించినట్టుగా తెలుస్తుంది.  ఈ వివాదానికి ప్రధాన బీజం డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు కార్యవర్గ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. జానీ మాస్టర్ సస్పెన్షన్ అనంతరం, ఆయన సతీమణి సుమలత డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఏకపక్షంగా బై ఎలక్షన్స్ నిర్వహించారని మెజారిటీ సభ్యులు ఆరోపించారు. ఈ బై ఎలక్షన్లలో అసోసియేషన్‌కు చెందిన దాదాపు 600 మంది సభ్యులలో కేవలం 116 మంది మాత్రమే పాల్గొనడం, మిగిలిన 480 కంటే ఎక్కువ మంది దూరంగా ఉండడం సంచలనం సృష్టించింది.  ఈ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అసోసియేషన్‌లోని 350 మందికి పైగా సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియలో రఘు మాస్టర్‌ని  తమ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జానీ మాస్టర్ వర్గానికి పెద్ద షాక్‌గా మారింది.    Also read: రోమాంచకం ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. టాక్ పరిస్థితి అయితే ఇదే! శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, ప్రకాష్ మాస్టర్, విజయ్ పొలాకి, విజయ్ బిన్నీ, సృష్టి వర్మ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు  రఘు మాస్టర్ ప్యానెల్‌కే తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  తెలుగు ఫిలిం ఇంపాజిట్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా రఘు మాస్టర్ ప్యానెల్‌కే మద్దతు పలికింది. ఫెడరేషన్ నిబంధనలను ధిక్కరించి సుమలత కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తీవ్రంగా తప్పుపట్టారు. నిమిషాల పుస్తకం (Minutes Book) లో సంతకాలు లేకుండానే కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేశారని, ఫెడరేషన్ సహకారం లేనిదే 24 క్రాఫ్ట్‌లలో పనులు చేయడం కుదరదని స్పష్టం చేశారు. పైగా జానీ మాస్టర్ యొక్క సస్పెన్షన్‌ను కూడా పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఫెడరేషన్ గుర్తింపు ఉన్న డ్యాన్సర్‌లతోనే నిర్మాతలు పనిచేయడానికి మొగ్గు చూపుతారని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ స్పష్టం చేయడంతో సుమలత వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద వైఖరి వల్ల జానీ మాస్టర్ 'ది ప్యారడైజ్' చిత్రంలో ఓ సాంగ్ కొరియోగ్రఫీ అవకాశాన్ని కోల్పోయారని, ఫెడరేషన్ సహకారం లేకపోతే బాలీవుడ్ మరియు కోలీవుడ్ అవకాశాలకు కూడా గండి పడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.   ఈ వివాదం ఇక్కడితో ఆగక లీగల్ పోరాటానికి దారితీసింది.  మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి వంటి పెద్దలు రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ వివాదం సద్దుమణగకపోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.        [Jani Master, Sumalatha, Raghu Master, Police case, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ "రోమాంచకం" నిన్న థియేటర్స్ లో అడుగుపెట్టింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి ఒక నిర్మాతగా ఉండటంతో ప్రమోషన్స్ నుంచే ప్రేక్షకుల దృష్టి 'రొమాంచకం' పై పడింది. కంటెంట్ మంచిదే అయినా లో బడ్జెట్ తో తెరకెక్కడం మైనస్ అని, ఎంటర్ టైన్ మెంట్  ఒక మాదిరిగా వర్క్ అవుట్ అయ్యిందనే మాట ప్రేక్షకుల నుంచి వినపడుతుంది.   ఈ చిత్రం తొలి రోజున 1.75 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా తెలుస్తుంది.  నెట్ కలెక్షన్‌ దాదాపు 1.50 కోట్ల రూపాయలు. మొదటి రోజు థియేటర్లలో ఓవరాల్ ఆక్యుపెన్సీ 29.0 శాతంగా నమోదైంది. షోల వారీగా ఆక్యుపెన్సీ వివరాలను పరిశీలిస్తే, ఉదయం షోల నుంచి రాత్రి షోలకు వెళ్లేకొద్దీ ఆడియన్స్ కౌంట్ పెరగడం శుభసూచికం. మార్నింగ్ షోలు 19.69 శాతం ఆక్యుపెన్సీతో మొదలవ్వగా, ఆఫ్టర్‌నూన్ షోలు 26.31 శాతానికి పెరిగాయి. ఇక ఈవినింగ్ షోలు 21.31 శాతం నమోదు కాగా, నైట్ షోలలో అత్యధికంగా 37.38 శాతం ఆక్యుపెన్సీ చూపించింది. Also Read:  రొమాంచకం మూవీ రివ్యూ      తొలి రోజు గ్రాస్‌లో దాదాపు 1.65 కోట్ల రూపాయలు కేవలం ఎపి అండ్ తెలంగాణ నుంచే వసూలయ్యాయి.  సుమంత్ ప్రభాస్, అనంతికలతో పాటు ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ వంటి నటులు తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులని  నవ్వించడంలో కీ రోల్  పోషించారు.      [Romanchakam, Romanchakam Movie Review, Romanchakam Collections,  Ananthika Sanil Kumar, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood ]
    కామెడీ కింగ్ 'అల్లరి నరేష్' మరోసారి తనదైన కామెడీ మార్కు తో నిన్న' రంభ ఊర్వశి మేనక' తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. అల్లరి నరేష్ తో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ తమ పెర్ఫార్మ్ తో మెప్పించారు. కానీ అవుట్ డేటెడ్ సబ్జెక్టు, సీన్స్, డైరెక్షన్ తో మెప్పించలేకపోయిందనే  అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుంది. రివర్స్ స్క్రీన్ ప్లే, తో పాటు ఇదే సబ్జెక్టు ని సిటీ నేపథ్యంలో, డిఫరెంట్ మోడ్ ఫొటోగ్రఫీ కనుక ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే మాటలు సినీ సర్కిల్స్ లో సైతం వినపడుతున్నాయి.    ట్రేడ్ వర్గాల అంచనా  వివరాల ప్రకారం తొలి రోజు 1.01 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ లెక్కన  నెట్ కలెక్షన్స్ దాదాపు 0.75 కోట్లు. దేశవ్యాప్తంగా 227 నగరాల్లో 452 థియేటర్లలో, దాదాపు 1,189 షోల ద్వారా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తొలిరోజు  మొత్తం 79,839 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. రోజువారీ సగటు ఆక్యుపెన్సీ 19.9 శాతంగా నమోదైంది. మొదటి రోజే 90 థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు పడగా, 2 షోలు పూర్తిగా హౌస్‌ఫుల్ అయ్యాయి.  ప్రాంతాల వారీగా వసూళ్లను పరిశీలిస్తే, తెలంగాణలో అత్యధికంగా 36.77 లక్షల గ్రాస్ రాబట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో హైదరాబాద్ నగరం నుంచే అత్యధికంగా 19.65 లక్షల గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఆంధ్రా రీజియన్‌లో విశాఖపట్నం (వైజాగ్) లో 7.04 లక్షలు, విజయవాడలో 3.43 లక్షల కలెక్షన్లు వచ్చాయి.    Also Read: Ramba Oorvasi Menaka: రంభ, ఊర్వశి, మేనక మూవీ రివ్యూ      షో టైమ్స్ ప్రకారం చూస్తే మధ్యాహ్నం, సాయంత్రం షోలకు అత్యధికంగా ప్రేక్షకులు వచ్చారు. మధ్యాహ్నం షోల ద్వారా 25.70 లక్షలు, సాయంత్రం షోల ద్వారా 25.88 లక్షలు కలెక్ట్ అయ్యాయి. మరి వీకెండ్ లో ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ,కామెడీ టైమింగ్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి.  చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించగా సీనియర్ నరేష్, సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ,  వెన్నెల కిషోర్, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్ కీ రోల్స్ పోషించారు.చైతన్ భరద్వాజ్ మ్యూజిక్. మాస్ సెంటర్లు, ఫ్యామిలీ ఆడియన్స్ గనుక థియేటర్లకు క్యూ కడితే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాల టాక్.   [Ramba Oorvasi Menaka, Allari Naresh, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
టాలీవుడ్ పాపులర్ యాంకర్ అండ్ వర్సటైల్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గ్లామరస్ బ్యూటీ పంచుకున్న ఒక ప్రత్యేకమైన డివోషనల్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తన భావప్రకటనతో వివాదాలకు దూరంగా ఉంటూనే, ఈసారి మరింత ప్రత్యేకమైన భక్తి రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కృష్ణాష్టమి సందర్బంగా అనసూయ సంప్రదాయబద్ధమైన రాధా దేవి అవతారంలో మెరిసిపోయారు. ఎరుపు రంగు పట్టు చీర ధరించి, డిజైనర్ జ్యువెలరీ మరియు ప్రత్యేకమైన ముస్తాబుతో అలరించారు. కన్నడ భక్తి గీతమైన 'తులసి కోమలవేణి' పాటకు ఆమె చేసిన అభినయం, ఎక్స్‌ప్రెషన్స్ మరియు నృత్య రీతులు అభిమానులను ఎంతగానో కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ వీడియో కంటే కూడా ఆమె జోడించిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "కృష్ణుడికి అంతా తెలుసు.. నాకు అది చాలు" అంటూ అనసూయ రాసుకొచ్చారు. అంతేకాకుండా శాంతం, నిగ్రహం, పవిత్రత, విశ్వాసం, జ్ఞానం వంటి ఆత్మపరిశీలన పదాలను సైతం ఆమె తన పోస్ట్‌లో ప్రస్తావించారు. గతంలో సనాతన ధర్మం మరియు కొన్ని ఆధ్యాత్మిక అంశాలపై అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆమె, తాజాగా శ్రీకృష్ణుడి పాటకు రాధగా మారి చేసిన నాట్యం ద్వారా తనపై వచ్చిన విమర్శలన్నింటికీ పరోక్షంగా ఎండ్ కార్డ్ వేసినట్లయిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీ రంగంలో స్టార్ యాంకర్‌గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, 'రంగస్థలం', 'పుష్ప' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటిగా సత్తా చాటారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆమె, ఎలాంటి విమర్శలు ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని వదులుకోనని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ రాధా-కృష్ణుల కాన్సెప్ట్ వీడియోకు నెటిజన్లు, అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కృష్ణాష్టమి రోజున ఇంత ఆధ్యాత్మికంగా, అందంగా కనిపించినందుకు నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తుండగా, వివాదాల జోలికి వెళ్లకుండా సైలెంట్‌గా ఇచ్చిన ఈ కౌంటర్ కామెంట్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.     [Anasuya Bharadwaj, Anasuya Krishna Dance Video, Janmashtami 2026 Special, Anasuya Instagram Viral Video, Tollywood Celebrities News]
మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్.రవీంద్ర) కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా' (KAAKA) చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వెలువడింది. ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ క్రేజీ కాంబోపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తదుపరి బిగ్ షెడ్యూల్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, భారీ యాక్షన్ బ్లాక్‌లను తెరకెక్కించేందుకు దర్శకుడు బాబీ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి 'సూపర్‌వైజర్ సత్యం'గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో చూపించిన మేకింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ముగింపులో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఈ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుందని చిత్రవర్గాల టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, కథకు తగ్గట్టుగా అద్భుతమైన నటీనటుల బృందం ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త మాస్ వైబ్‌తో రాబోతున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.     [Chiranjeevi Kaaka Movie, Director Bobby, KVN Productions, Kaaka Hyderabad Schedule, Sankranthi 2027 Release]
  సింగర్ గా, గేయరచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బల్జీత్ సింగ్  తన నివాసంలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని లుధియానా జిల్లా పరిధిలో గల సుధార్ పట్టి ధాలివాల్ ఏరియాలో బల్జీత్ సింగ్ నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన తల్లిదండ్రులు మరణించడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం, కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ అందుబాటులోకి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గురువారం ఉదయం ఆయన ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీస్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంటి తలుపులు తెరిచి చూడగా మంచంపై బల్జీత్ సింగ్ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. మరణించి దాదాపు 4 నుండి 5 రోజులు అయి ఉండవచ్చని నిరాదరించారు. మృతదేహం పూర్తిగా పాడవడంతో పాటు ఇంటి ప్రాంగణంలో కొన్ని రక్తపు మరకలు  కనిపించడంతో ఈ మృతి వెనుక ఏదైనా కుట్ర లేదా అనుమానాస్పద కోణం ఉందా అనే చర్చ నడిచింది. Also Read: వాళ్ళకోసమే ఓటిటిలు: శివాజీ సంచలన వ్యాఖ్యలు       దీంతో పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, సీఐఏ బృందాలను పిలిపించి క్లూస్ సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షల నివేదిక ఆధారంగా SHO కుల్విందర్ సింగ్ కీలక విషయాలను వెల్లడించారు. బల్జీత్ సింగ్ గుండెపోటు (హార్ట్ ఎటాక్) కారణంతోనే మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో  ఆయన మృతిలో ఎలాంటి కుట్ర గానీ, హత్య కోణం గానీ లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బల్జీత్ సింగ్ కి పెళ్లి కాలేదు. వయసు 35 ఏళ్ళు .     [Baljit Singh,  Punjabi singer Baljit Singh, Heart Attack, TeluguCinema, Tollywood, TeluguCinemaNews, Teluguone, TollywoodNews]   
భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు కథనం కంటే కూడా అవి ఎదుర్కొనే వివాదాల వల్లే వార్తల్లో నిలుస్తుంటాయి. కథలో ఉండే బోల్డ్ కంటెంట్ లేదా సమాజంలో చర్చనీయాంశంగా మారే సున్నితమైన అంశాల కారణంగా సెన్సార్ బోర్డ్ ఆంక్షలు ఎదుర్కొన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. అటువంటి జాబితాలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది బాలీవుడ్ వివాదాస్పద చిత్రం 'అన్‌ఫ్రీడమ్'. దర్శకుడు రాజ్ అమిత్ కుమార్ తెరకెక్కించిన ఈ డ్రామా మూవీలో స్వలింగ సంపర్కం, ఉగ్రవాదం, మత ఛాందసవాదం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అత్యంత సున్నితమైన విషయాలను సవాలుగా తీసుకుని ఆవిష్కరించారు. 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించగా, భారతదేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ థియేటర్లలో ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. సినిమాలోని కొన్ని శృంగార సన్నివేశాలు, బోల్డ్ సంభాషణలతో పాటు ఉగ్రవాద నేపథ్యానికి సంబంధించిన ఘట్టాలను తొలగిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే సన్నివేశాలను కట్ చేస్తే కథలోని ఆత్మ దెబ్బతింటుందని భావించిన దర్శకనిర్మాతలు, బోర్డ్ సూచించిన మార్పులను చేయడానికి నిరాకరించారు. అప్పీల్ చేసినప్పటికీ థియేట్రికల్ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. థియేటర్లలో విడుదల కాకపోయినప్పటికీ, ఈ చిత్రం అంతర్జాతీయంగా పలు చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భావప్రకటనా స్వేచ్ఛ, సెన్సార్‌షిప్‌పై పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ఈ మూవీలో విక్టర్ బెనర్జీ, ఆదిల్ హుస్సేన్, ప్రీతి గుప్తా ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈ సంచలన చిత్రం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు డిజిటల్ మాధ్యమంలో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో, ఓటీటీ వేదికగా 'అన్‌ఫ్రీడమ్' మరోసారి సినీ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది.       [Unfreedom Banned Movie, Unfreedom Netflix OTT, Raj Amit Kumar, Controversial Bollywood Movies, OTT Release Updates]
    శివాజీ సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్  చేస్తుంటే మనకి కూడా అర్జెంటుగా నటుడు కావాలని అనిపిస్తుంది. అంతలా మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ శివాజీ సొంతం.  సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్ తో దూసుకుపోతున్న శివాజీ ఈ నెల 11 న  ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన 'ఎపిక్' తో మరో సారి సెల్యులాయిడ్ పై సందడి చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఓటిటి లపై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.   శివాజీ మాట్లాడుతు  ఓటీటీలు కేవలం సోమరిపోతుల కోసమేనని, అవి థియేటర్లలో లభించే అసలైన సినిమాటిక్ అనుభవాన్ని హరించివేస్తున్నాయి. సినిమా అంటే కేవలం ఒక కథని చూడటం మాత్రమే కాదు. పెద్ద స్క్రీన్, శక్తివంతమైన సౌండ్ సిస్టమ్, పక్కనున్న వందలాది మంది ప్రేక్షకుల రెస్పాన్స్, థియేటర్ వాతావరణం అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఎనర్జీని ఇస్తాయి.ఇంట్లో టీవీలు లేదా మొబైల్ ఫోన్లలో పాజ్ చేసుకుంటూ సినిమాలు చూస్తే ఆ అసలైన అనుభూతి దక్కదని చెప్పుకొచ్చాడు. Also read: హఠాత్తుగా విజయ్ లండన్ ప్రయాణం.. ఆమెతో రాజీ కోసమా, లేక!       శివాజీ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని కాపాడుకోవాలనే ఆవేదనతోనే ఆయన అలా మాట్లాడారని అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెరిగిన టికెట్ ధరలు, పాప్‌కార్న్ రేట్లు మరియు కుటుంబంతో థియేటర్‌కు వెళ్తే అయ్యే ఖర్చుల వల్ల సామాన్యులు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారిని సోమరిపోతులు అనడం సరికాదని నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.       [Sivaji, Epic movie promotions, ott, TeluguCinema, Tollywood, TeluguCinemaNews, Teluguone, TollywoodNews]
జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ న‌టుడు బ్రహ్మాజీ  మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ  'కృష్ణంభ‌జే' ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు. పోస్ట‌ర్‌లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో యోగ దండంతో ఆయన లుక్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. హీరోగా ప్రదీష్, హీరోయిన్‌గా వంగమయి పటేల్ నటిస్తున్నారు. రచ్చ రవి డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘కృష్ణంభజే’కు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.       [Krishnam Bhaje Movie, Actor Brahmaji, Markandeya Look, Krishna Janmashtami, Telugu Film News, Telugu News]  
    సినిమాకి ఉన్న కెపాసిటీ తెలియచేస్తూ ఇళయదళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంలో రాయల్టీగా కూర్చున్న విషయం తెలిసిందే. దీంతో స్వపక్షం, ప్రతిపక్షం వల్ల సోషల్ మీడియాలో నిత్యం విజయ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజా న్యూస్ విజయ్ ఓల్డ్ న్యూస్ అన్నింటిని పక్కకి నెట్టేసి మై హునా అంటుంది.  Also Read: Rambha Oorvasi Menaka Movie Review: రంభ, ఊర్వశి, మేనక మూవీ రివ్యూ  తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత విజయ్  ఫస్ట్ టైం ఈ నెల 10 న విదేశీ ప్రయాణం చేస్తున్నాడు.  బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో ల్యాండ్ అవ్వబోతున్నాడు. పెట్టుబడులు తెచ్చేందుకే మా సార్ వెళ్తున్నారు అంటూ అభిమానులు, పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినపడుతుంది. విజయ్ వైఫ్ సంగీత మొన్న ఆగస్టులో కోర్టుకెళ్లి సైలెంట్‌గా  విడాకుల పిటిషన్‌ వెనక్కి తీసుకుంది.  ఆ కేసు క్లోజ్ అయి నెల రోజులు కూడా గడవక ముందే  విజయ్  లండన్ వెళ్తున్నాడు. ప్రస్తుతం సంగీత లండన్‌లోనే సెటిల్ అయ్యింది. కాబట్టి ఈ టూర్ వెనుక అసలు స్క్రిప్ట్ ‘పెట్టుబడులు’ కాదని, భార్యామణిని కలవడానికి అనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.     [ Vijay, Sangeetha, Tollywood, TeluguCinema, TeluguCinema News, Tollywood News]          
మనలో చాలామంది నిద్ర తక్కువైతే ఆరోగ్యానికి హానికరం అని భావిస్తుంటారు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు అలసటగా అనిపించడం, పనిపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలిసిందే. కానీ, ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలకు మించి ఎక్కువసేపు నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేయకపోగా, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచికగా మారుతుందని మీకు తెలుసా? ఇటీవల దాదాపు 5 లక్షల మంది వ్యక్తుల సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన ఒక కీలక పరిశోధనలో నిద్ర వ్యవధికి, మానవ ఆరోగ్యానికి ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ రాత్రి సమయంలో సుమారు 6.4 గంటల నుండి 7.8 గంటల మధ్య సరైన రీతిలో నిద్రపోయే వారిలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, దీని అర్థం ప్రతి ఒక్కరూ కచ్చితంగా 7 గంటలే నిద్రపోవాలని కాదు. ఒక వ్యక్తికి అవసరమయ్యే నిద్ర సమయం అనేది వారి వయసు, జన్యుపరమైన అంశాలు, అనుసరించే జీవనశైలి, చేసే శారీరక శ్రమ మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం నిద్రపోయే గంటల సంఖ్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నిద్ర సరిపోతుందో లేదో నిర్ణయించలేము. అయితే రోజువారీగా అతిగా నిద్రపోవడం అనేది మీ శరీరంలో లేదా మానసిక స్థితిలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉన్నాయనడానికి ఒక స్పష్టమైన హెచ్చరిక కావచ్చు. డిప్రెషన్, స్లీప్ అప్నియా, శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపులు వంటి ప్రమాదకర పరిస్థితులతో అతి నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధులు, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఒక వ్యక్తిలో నిద్రపోవాల్సిన వ్యవధిని అసాధారణంగా పెంచుతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎక్కువసేపు నిద్రపోవడం వల్లనే ఈ వ్యాధులు వస్తున్నాయని పరిశోధన చెప్పడం లేదు; ఇప్పటికే శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే వ్యక్తి ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.       oversleeping health risks telugu guide,healthy sleep duration research details.
చిన్న పిల్లలు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏది తింటే అనారోగ్యం పాలవుతారు అనే విషయంలో ప్రతి తల్లిదండ్రులూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత వారికి ఇచ్చే ఆహారంలో చక్కెర, తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన స్వీట్లు ఎంతవరకు సురక్షితం అనే చర్చ చాలాకాలంగా నడుస్తోంది. చిన్నతనంలోనే పిల్లలకు విపరీతంగా తీపి అలవాటు చేయడం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఒక సంచలనాత్మక పరిశోధన ఈ అంశంపై మరింత స్పష్టతనిచ్చింది. జీవిత ప్రారంభ దశలో, ముఖ్యంగా రెండేళ్ల వయసు లోపు పిల్లలకు చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల వారు పెద్దయిన తర్వాత తీవ్రమైన క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఆసక్తికరమైన అంశాన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తలు బ్రిటన్‌లో 1953 నాటి చారిత్రక పరిణామాలను నిశితంగా పరిశీలించారు. ఆ కాలంలో రేషనింగ్ వ్యవస్థ కారణంగా బ్రిటన్‌లో చక్కెర అందుబాటుపై కఠినమైన నియంత్రణలు ఉండేవి. దీనివల్ల ఆ సమయంలో పుట్టిన పిల్లలకు చిన్నతనంలో చాలా తక్కువ మొత్తంలో చక్కెర లభించింది. ఈ పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని, పరిశోధకులు ఏకంగా 64,000 మందికి పైగా వ్యక్తుల దశాబ్దాల కాలపు ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. చిన్నతనంలో తక్కువ చక్కెర తిని పెరిగిన వారి ఆరోగ్య ఫలితాలను, సాధారణంగా చక్కెర తిన్నవారితో పోల్చి చూసినప్పుడు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నతనంలో పంచదార వినియోగాన్ని పరిమితంగా ఉంచిన వారిలో, దశాబ్దాల తర్వాత కొన్ని రకాల ప్రాణాంతక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సుమారు 36 శాతం నుండి 69 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ విషయంలో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా మరియు ఎక్కువగా కనిపించింది. దీనితో పాటు రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు కూడా వారిలో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న వయసులో చక్కెర పరిమితి వల్ల శరీరంలో కలిగే మార్పులు దీర్ఘకాలికంగా రక్షణ కవచంలా పనిచేస్తాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.         kids sugar restriction health benefits,childhood sugar intake cancer study.
మన తాతయ్యలు, అమ్మమ్మలు 60 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఎంతో ఆరోగ్యంగా, ఉక్కులాంటి శరీరంతో, దృఢమైన రోగనిరోధక శక్తితో ఎలా ఉండగలుగుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ప్రధాన కారణం మన సాంప్రదాయ పల్లెటూరి ఆహారపు అలవాట్లే. పల్లెటూర్లలో రైతులు, కూలీలు రోజంతా పొలాల్లో కష్టపడి పనిచేసి తీవ్ర అలసటకు గురైనప్పుడు వారికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు ఇమ్యూనిటీని రెట్టింపు చేసే అద్భుతమైన ఆహారమే ఈ "పొలం పచ్చడి". ఈ పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే దీనిని తయారుచేయడానికి గ్యాస్ స్టవ్ వెలిగించాల్సిన పనిలేదు, అలాగే ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదు. కేవలం పచ్చికాయలు, జీలకర్ర, ఉల్లిపాయల కలయికతో తయారుచేసే ఈ స్వచ్ఛమైన రోటి పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకుని తింటే ఎవరైనా రెండు ప్లేట్ల అన్నాన్ని నిమిషాల్లో లాగించేస్తారు. వంట రానివారు కూడా అత్యంత సులభంగా తయారుచేసుకోగలిగే ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ అద్భుతమైన ఇమ్యూనిటీ పొలం పచ్చడిని సరైన కొలతలతో రుచికరంగా తయారుచేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చాలా స్వల్పం. దీనికోసం సరిగ్గా 100 గ్రాముల చింతపండు, 5 పచ్చిమిర్చి, 2 కప్పుల సన్నటి ఉల్లిపాయ ముక్కలు, 5 వెల్లుల్లి రేకలు, అర టీస్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు మరియు 1 కట్ట కొత్తిమీర తరుగు సిద్ధం చేసుకోవాలి. తయారీ విధానం కూడా అత్యంత సహజమైన రీతిలో ఉంటుంది. మొదటగా 5 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల చింతపండును ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి. అదే సమయంలో ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇక అసలైన రుచిని ఇచ్చే దంచుకునే విధానంలోకి వస్తే, మొదటగా రోటిలో అర టీస్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. జీలకర్ర నలిగిన వెంటనే పచ్చడికి ప్రత్యేకమైన సువాసన, టేస్ట్ తోడవుతాయి. ఆ తర్వాత నానబెట్టుకున్న 100 గ్రాముల చింతపండు, 5 వెల్లుల్లి రేకలు, రుచికి సరిపడా ఉప్పు మరియు ముక్కలుగా కోసిన 5 పచ్చిమిర్చి వేసి రోటిలో బాగా రుబ్బుకోవాలి. చివరగా కట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు మరియు కొత్తిమీర తరుగు వేసి లైట్‌గా నూరుకోవాలి. ఉల్లిపాయలు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నలిగితేనే పచ్చడి తింటున్నప్పుడు ఆ క్రిస్పీ రుచి లభిస్తుంది.       immunity boosting traditional roti pachadi,oil free telugu village pachadi.
  అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం. అజీర్ణం గా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నప్పుడు, దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇక వంటింట్లో కూరల్లోనూ, మసాలా తయారీలోనూ అల్లాన్ని వాడుతుంటారు. ఇలా కాకుండా  ప్రతిరోజూ ఒక చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం అలవాటు చేసుకుంటే  ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంపై ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో తెలుసుకుంటే..  అల్లం ప్రభావం..  వరసగా రెండు నెలలు, అంటే అరవై రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా ఒక చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల మన శరీరంలో శ్వాసకోశ వ్యవస్థ నుండి జీర్ణవ్యవస్థ వరకు అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం , ఉపశమనం.. రోజు ఒక చిన్న అల్లం ముక్క నమలడం వల్ల గొంతులో ఏర్పడే అసౌకర్యం, మంట క్రమంగా తగ్గుతాయి. ఊపిరితిత్తులకు వెళ్లే గాలి మార్గాలను ఇది సడలించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. సుమారు ఆరు నుండి ఎనిమిది వారాల పాటు ఈ అలవాటును కొనసాగించడం వల్ల దగ్గు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.  గాలిలో దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల గొంతు , శ్వాసనాళాల్లో కలిగే మంటను అల్లం తగ్గిస్తుంది. అల్లంలోని సహజ సిద్ధమైన వేడి చేసే గుణం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని లేదా శ్లేష్మాన్ని పలచబడేలా చేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల నుండి కఫం సులువుగా బయటకు వచ్చేస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, రొంప, , చిన్న శ్వాస సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఆస్తమా లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అల్లాన్ని  కేవలం  ఒక సహాయక పదార్థంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప, వైద్యులు సూచించిన మందులకు ప్రత్యామ్నాయంగా తీసుకోకూడదు. జీర్ణవ్యవస్థ మెరుగుదల.. రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరికి మంచిది కాదు?  అల్లం నమలడం చాలా మంచిదే అయినప్పటికీ, కొందరి విషయంలో ఇది ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు. అల్లాన్ని పరిమితికి మించి ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే నోటిలో మంట లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణాశయం ఉన్నవారికి లేదా కడుపులో మంట, ఆసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్ ఉన్నవారికి రోజూ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో అసౌకర్యం పెరగవచ్చు. రక్త ప్రసరణను పలచబరిచే మందులు  వాడేవారు కూడా అల్లాన్ని అధికంగా తీసుకోకూడదు, ఎందుకంటే అల్లానికి కూడా రక్తాన్ని పలచబరిచే స్వభావం కొంతవరకు ఉంటుంది. తీసుకోవాల్సిన పరిమాణం , జాగ్రత్తలు..  అల్లం ఆరోగ్యానికి మంచిదే అయినా తీసుకోవలసిన పరిమాణం చాలా ముఖ్యం. మన బొటనవేలి పరిమాణంలో ఉన్న ఒక చిన్న అల్లం ముక్క లేదా రెండు చిన్న పలచటి ముక్కలు సరిపోతాయి. ఒకవేళ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో మంటగా అనిపిస్తే, దానిని నేరుగా నమలకుండా గోరువెచ్చని నీటిలో అల్లం రసం లేదా అల్లం ముక్కలు వేసి మరిగించి ఆ నీటిని తాగడం మంచిది. అల్లం అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేసే   ఒక మంచి ఆహార పదార్థం మాత్రమే గానీ, ఏ రోగానికీ పూర్తి స్థాయి చికిత్స లేదా నివారణ కాదు. తరచూ ఆయాసం రావడం, ఎడతెగని తీవ్రమైన దగ్గు ఉండటం, లేదా గుండెలో  నొప్పి వంటివి  ఉన్నట్లయితే, అల్లంపై మాత్రమే ఆధారపడకుండా వెంటనే  వైద్యులను కలిసి సరైన పరీక్షలు చేయించుకోవాలి.                             *రూపశ్రీ.  
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. ట్రికట చూర్ణం, ధనియాల పొడి, పసుపు పొడి వంటి మూడు పదార్థాలను సరైన మోతాదులో ఎలా కలపాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? రోజులో ఏ సమయంలో తీసుకుంటే మంచిది? వంటి విషయాలను ఈ వీడియోలో సులభంగా వివరించారు. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యల్లో ఇంటి చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఇప్పటికే థైరాయిడ్ మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన లేకుండా మందులను ఆపకండి లేదా మార్చకండి. థైరాయిడ్ ఆరోగ్యం, ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి. Disclaimer: ఈ వీడియోలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.  
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.