గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ జటిలం అవుతోంది. పీట ముడులు పడుతోంది. దీనికి పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలను, రాజకీయనేతలను శరణుజొచ్చుతున్నారు నిర్మాతలు. ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫి మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మిలకు డిమాండ్ లు, ఆందోళనకు సంబంధించి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ను నిర్మాతలు కలిశారు.
కాగా నిర్మాతలతో భేటీపై ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేయడానికి కలుస్తామంటూ కొందరు నిర్మాతలు చెబితే రమ్మన్నాం.. అంతే తప్ప ఈ భేటీకి ప్రత్యేకమైన అజెండా ఏమీ లేదని తేల్చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమస్యలకు సంబం ధించి నిర్మాతలు, కార్మికులు చెప్పే అంశాలను విని, వాటిని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెడతాం. వారి స్థాయిలోనే ఏం చేయాలన్న నిర్ణయం ఉంటుందని కందుల చెప్పారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తాం, రాష్ట్రంలో స్టూడియోలు, రీరికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు.
కాగా కందుల దుర్గేష్ను నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కె.ఎల్.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్, నాగవంశీ, భరత్, విశ్వప్రసాద్, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్ వంశీ, బన్నీ వాసు, వివేక్ కూచిభొట్ల తదితరులు కలిశారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, సుప్రియ, జెమినీ కిరణ్ తదితరులు కలిశారు.