టీబీజేపీకి అతి పెద్ద విలన్ అతనేనా?...రాజాసింగ్ మాట ఇదేనా!
posted on: Feb 22, 2026 12:06PM
.webp)
తెలంగాణలో మా బలం పెరిగిందన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. నిజమే గత 2018, 19 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే బీజేపీ బలం ఇటు తెలంగాణ అటు ఏపీలో గణనీయంగా తన బలాన్ని పెంచుకుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో పాటు.. ముగ్గురు ఎమ్మెల్సీలతో బలంగానే ఉంది బీజేపీ. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో 15 శాతం పెరిగిన ఓట్ పర్శంటేజీతో .. 204 నుంచి 336 వార్డులకు తన సంఖ్యా బలం పెంచుకుంది.
ఇక ఏపీలో 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో గతంకన్నా మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం ఇక్కడ కూటమితో కలసి రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోనూ పాల్పంచుకుంది బీజేపీ. తెలంగాణలో బీజేపీ ఎప్పటి నుంచి పుంజుకుంది? ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటి? అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో కీలక పాత్ర ఎవరిది? ఈ కారణంగా బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశమెంత? అన్నదొక చర్చ.
తెలంగాణలో బీజేపీ దూకుడు ఎప్పుడు పెంచిందంటే అప్పటి వరకూ ఇక్కడ కిషన్ రెడ్డి నాయకత్వంలోని బీజేపీ నీరుగారి నిరుత్సాహంగా మాత్రమే ఉండేది. రాజాసింగ్ ఒక్కడే ఎమ్మెల్యేగా ఉండేవాడు. కిషన్ ఆడింది ఆట పాడింది పాటగా ఇక్కడ ఉండేది. అయితే కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కి ఎప్పుడైతే అధ్యక్ష పదవి ఇచ్చారో అప్పటి నుంచి బీజేపీ గ్రేటర్ నుంచి తన బలం పుంజుకోవడం మొదలు పెట్టింది. ఏకంగా 4 సీట్ల నుంచి 48 సీట్ల వరకూ గ్రేటర్ హైదరాబాద్‌లో ఎగబాకింది కమలం పార్టీ.
ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ తర్వాత బీజేపీ పేరు ఎక్కువగా వినిపించేది. అనూహ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ హవా ఇక్కడి కాంగ్రెస్‌కి ఒక బూస్టింగ్‌లా మారింది. ఎలా పుంజుకుందో ఏమో ఇక్కడ కాంగ్రెస్ మూడు నుంచి ఎకబికిన 1వ స్థానంలో వచ్చి నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల విజేతగా గెలిచి అధికారం చెపట్టింది.
ఈ విషయంలో బీజేపీ వెనకంజ వేయడానికి గల ప్రధాన కారణం కిషన్ రెడ్డిగా చెబుతారు. తిరిగి అధిష్టానం ఆయన నాయకత్వంలోకి రాష్ట్ర పార్టీని పంపడంతో.. మొత్తం ఉల్టా- పల్టా అయిపోయిందని అంటారు. అప్పటికీ 2023 ఎన్నికల్లో గతం కన్నా మెరుగైన ఫలితాలనే సాధించింది కమలం పార్టీ. ఒకప్పుడు ఒన్ అండ్ ఓన్లీ విన్నర్ గా ఉన్న రాజాసింగ్ చెప్పే థియరీ ఏంటంటే.. ఇక్కడ కిషన్ అనే కింగ్ పిన్ మొత్తం పార్టీని కొలాప్స్ చేస్తున్నారని. ఆయన అధికారంలోకి రావాలని ఎప్పుడూ అనుకోరనీ.. ఎవరు అధికారంలో ఉంటే వారి మోచేతి నీళ్లు తాగుతూ లబ్ధి పొందుతూ ఉంటారని ఆరోపిస్తారు రాజాసింగ్.
ఈ మాటలు నిజం కాకుంటే రాజాసింగ్ ప్రస్తుతం పార్టీలోనే ఉండేవారేమో తెలీదు గానీ.. మొత్తంగా అయితే ఇక్కడ పార్టీ ఎంత బలం పుంజుకున్నా.. అది అధికారంలోకి రానివ్వకుండే అడ్డుకునే అడ్డుగోడ కిషన్ రూపంలో ఉందని అంటారు పలువురు కాషాయవాదులు సైతం. మరి ఈ అడ్డంకి తొలగించుకోకుండా ఇక్కడ పార్టీ ఎలా అధికారం చేపడుతుంది? అన్న మీమాంశ ఎదురవుతోంది ప్రతి ఒక్కరికీ.
ఊపు తెచ్చిన బండిని పక్కన పెట్టి, నీరస నాయకుడైన కిషన్‌కి పగ్గాలిచ్చినపుడే బీజేపీ పనైపోయిందని అంటారు రాజాసింగ్. ఇక బీఆర్ఎస్ తో ఆ పార్టీ కుమ్మక్కయ్యిందన్న మాట కూడా చేటు తెచ్చేదిగానే తెలుస్తోంది.. గత ఎన్నికల సమయంలో కవితను అరెస్టు చేయకుంటే అందరూ ఇదే అనుకుంటారని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆ మాటే నిజమైంది. జనం కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందేమో అనని నమ్మడం మొదలు పెట్టారు.
సీఎం రేవంత్ కూడా ఈ విషయాన్ని పదే పదే మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపుడు నొక్కి చెప్పగా.. ఈ ఎలక్షన్లో.. కమలనాథుల ఓట్ల శాతం మరింత క్షీణించింది. ఇప్పుడు మున్సిపాల్టీల్లో పెరిగిన ఓట్ల శాతాన్ని బట్టీ ఉత్తర తెలంగాణలోని కీలకమైన కరీంనగర్, నిజామాబాద్ లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం వంటి గణాంకాలను చూసి రామచంద్రరావు ఈ తరహా కామెంట్లు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే కిషన్ రెడ్డి మ్యాచ్ ఫినిషర్ కాదు.. ఉన్న మ్యాచ్ తీస్కెళ్లి ఇతరుల చేతుల్లో పెట్టేవాడని అంటారు రాజాసింగ్ తదితరులు. అందుకే ఇక్కడ పార్టీ అధికారంలోకి రావాలంటే అతి పెద్ద విలన్ కిషన్ అంటారు వీరు.



.webp)


