కొత్తగా కొన్న వస్తువుల మీద స్టిక్కర్లు తీయడం కష్టంగా ఉందా? ఈ టిప్స్ ట్రై చేయండి..!
posted on: Feb 21, 2026 3:09PM

కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు. ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు. కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి. స్టిక్కర్లను అలాగే ఉంచడం ఇష్టం ఉండదు, పోనీ వాటిని తీసేద్దాం అనుకుంటే స్టిక్కర్ల తాలూకు గమ్ వాటి మీద కనిపిస్తూ వస్తువుల లుక్ పాడు చేస్తుంది. పైగా ఈ గమ్ మీద దుమ్ము దూళి చాలా తొందరగా పేరుకుపోతుంది. అయితే కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు సులువుగానే తొలగించవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల స్టిక్కర్లను వాటి మూలాలు కనిపించకుండా తొలగించవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
హెయిర్ డ్రైయర్ వేడి..
స్టిక్కర్‌ను వేడి చేయడం వల్ల దాని జిగట మృదువుగా మారుతుంది, దీని వలన స్టిక్కర్ తీయడం సులభం అవుతుంది. మీడియం వేడి మీద హెయిర్ డ్రైయర్‌ను ఆన్ చేయాలి. స్టిక్కర్ కు 2-3 అంగుళాల దూరంలో 30-40 సెకన్ల పాటు హెయిర్ డ్రైయర్ ను పట్టుకోండి. తర్వాత ఒక మూల నుండి స్టిక్కర్‌ను పట్టుకుని మెల్లిగా లాగితే స్టిక్కర్ సులువుగా వచ్చేస్తుంది. ఒకవేళ స్టిక్కర్ సరిగా రాకపోతే మరికొంతసేపు డ్రైయర్ తో స్టిక్కర్ ఉన్న ప్రాంతాన్ని వేడి చేయాలి.
బేకింగ్ సోడా, నూనె పేస్ట్..
ఈ ఇంట్లో తయారుచేసిన బేకింగ్ సోడా, నూనె పేస్ట్ స్టిక్కర్ల జిగటను తొలగిస్తుంది. బేకింగ్ సోడా, వంట నూనె లేదా కొబ్బరి నూనె సమాన భాగాలుగా కలిపి పేస్ట్ లా చేయాలి. దానిని స్టిక్కర్ లేదా జిగురు మరక ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఒక గుడ్డతో రుద్దాలి. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా స్టిక్కర్ కానీ దాని తాలూకు జిగురు కానీ తొలగిపోతుంది.
వెనిగర్ వాటర్..
వెనిగర్ స్టిక్కర్ మీద ఉన్న జిగురును వదిలిస్తుంది. ఒక కాటన్ బాల్ లేదా క్లాత్ ను వెనిగర్ లో ముంచి స్టిక్కర్ మీద ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత స్టిక్కర్ సులభంగా ఊడిపోతుంది. తర్వాత మృదువైన గుడ్డతో ఆ ప్రాంతాన్ని తుడవాలి.
నెయిల్ పాలిష్ రిమూవర్..
గట్టి స్టిక్కర్లకు నెయిల్ పాలిష్ రిమూవర్ ఒక గొప్ప ఛాయిస్. దీన్ని ఉపయోగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఒక కాటన్ బాల్‌పై అద్ది, స్టిక్కర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత సున్నితంగా గీకాలి. జిగురు గుర్తులు పూర్తిగా మాయమవుతాయి.
వేడినీరు..
వాటర్ ప్రూఫ్ ఉన్న ప్రాంతాలలో స్టిక్కర్లు ఉంటే వేడి నీరు చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం గోరువెచ్చని నీటితో కొద్దిగా డిష్ సోప్ కలపాలి. ద్రావణంలో స్పాంజ్ ముంచి స్టిక్కర్ మీద సున్నితంగా రుద్దాలి. స్టిక్కర్ లేదా జిగురు పదార్థం సులభంగా తొలగిపోతాయి.
*రూపశ్రీ.






