మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ (57) కన్నుమూశారు. మోహన్‌లాల్ నటించిన ‘పులిమురుగన్’, ‘నరన్’, ‘ఒడియన్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు తన కెమెరాతో అద్భుతమైన దృశ్యాలను అందించిన ఆయన ఇక లేరనే వార్త సినీ ప్రముఖులను, అభిమానులను కలచివేస్తోంది. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 10) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
షాజీ కుమార్ ఇటీవల అలప్పుళలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. నటుడు దిలీప్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సమయంలో ఆయనకు అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మొదట్లో ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత మళ్లీ అస్వస్థతకు గురై పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
తిరువనంతపురానికి చెందిన షాజీ కుమార్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ వద్ద శిష్యరికం చేశారు. మొదట అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన.. 2001లో వచ్చిన ‘ఉత్తమన్’ సినిమాతో స్వతంత్ర సినిమాటోగ్రాఫర్‌గా ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను, భారీ విజువల్స్‌ను తెరపై అద్భుతంగా చూపించడంలో ఆయనకు మంచి పేరుంది.
మోహన్‌లాల్ నటించిన ‘పులిమురుగన్’, ‘నరన్’, ‘ఒడియన్’ సినిమాలతో పాటు మమ్ముట్టి నటించిన ‘మధుర రాజా’, ‘నస్రాణి’, ‘బాబా కళ్యాణి’, ‘పోకిరి రాజా’, ‘రామలీల’, ‘రింగ్ మాస్టర్’, ‘పత్తొన్పతాం నూట్టాండు’, ‘బాంద్రా’, ‘తుడరుం’ వంటి 50కి పైగా చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మలయాళంతో పాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. తమిళంలో ప్రశాంత్ నటించిన ‘పొన్నర్ శంకర్’ సినిమాకు ఆయన అందించిన సినిమాటోగ్రఫీకి ప్రశంసలు దక్కాయి.
ఇక షాజీ కుమార్ మృతితో ఆయన పనిచేసిన దర్శకులు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన చివరిగా పనిచేసిన చిత్రాల్లో మోహన్‌లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’, సురేష్ గోపీ నటిస్తున్న ‘ఒట్టకొంబన్’ ఉన్నాయి. ముఖ్యంగా ‘తుడరుం’ తర్వాత మోహన్‌లాల్, దర్శకుడు తరుణ్ మూర్తి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అతిమనోహరం’ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఆయన మరణించడం బాధాకరం. భార్య స్మిత, కుమారులు ఆర్యన్, సూర్యన్లను ఆయన వదిలి వెళ్లారు. ఎన్నో విజయవంతమైన సినిమాల వెనుక తన కెమెరా ప్రతిభను చూపించిన షాజీ కుమార్ మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
[Shaji Kumar Cinematographer, Shaji Kumar Passes Away, Malayalam Cinematographer Shaji Kumar, Shaji Kumar Death News, Mohanlal Movies Cinematographer, Pulimurugan Cinematographer, Odiyan Cinematographer, Thudarum Cinematographer, Dileep Upcoming Movie, Malayalam Film Industry, Shaji Kumar Movies]