హాలీవుడ్లో నటుడిగా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రస్సెల్ బ్రాండ్‌కు భారీ షాక్ తగిలింది. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆయనకు లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు పదేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది.
మొత్తం 10 ఏళ్ల 6 నెలల పాటు జైలులో ఉండాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒకప్పుడు హాలీవుడ్లో ప్రముఖ నటుడిగా వెలుగొందిన రస్సెల్ బ్రాండ్‌కు ఇలాంటి శిక్ష పడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2004 నుంచి 2009 మధ్యకాలంలో నలుగురు మహిళలపై ఆయన లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై విచారణ జరిపిన జ్యూరీ.. ఒక మహిళపై అత్యాచారం చేసినట్లు, మరో ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించింది.
దీంతో నాలుగు నేరాల్లో ఆయన దోషిగా తేలారు. అయితే మరో రెండు అత్యాచార అభియోగాలు, ఒక లైంగిక దాడికి ప్రయత్నించిన కేసులో మాత్రం ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. ఈ కేసులో బాధిత మహిళలు తమకు ఎదురైన అనుభవాలను, ఆ ఘటనల వల్ల జీవితంపై పడిన ప్రభావాన్ని కోర్టుకు వివరించారు.
రస్సెల్ బ్రాండ్‌కు ఉన్న పేరు, పలుకుబడి కారణంగా అప్పట్లో తాము ఫిర్యాదు చేయడానికి భయపడ్డామని కొందరు తెలిపారు. ఈ ఘటనలు తమపై తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడించారు. విచారణ సమయంలో రస్సెల్ బ్రాండ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మహిళలతో జరిగిన లైంగిక సంబంధాలన్నీ పరస్పర అంగీకారంతోనే జరిగాయని వాదించారు. తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి జోయెల్ బెన్నథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకున్న కీర్తి, పేరు కారణంగా ఏం చేసినా చెల్లుతుందనే భావనతో రస్సెల్ బ్రాండ్ వ్యవహరించారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: విడుదలకు సిద్ధమైన మోహన్‌లాల్ సినిమా.. ఇంతలోనే విషాదం.!
అత్యాచారం కేసులో తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించగా, మూడు లైంగిక వేధింపుల కేసులకు వేర్వేరు శిక్షలు ఖరారు చేశారు. వాటిని కలిపి మొత్తం పదేళ్ల ఆరు నెలల శిక్షగా నిర్ణయించారు. ఆయన తన శిక్షలో మూడింట రెండొంతుల కాలం జైలులో గడిపిన తర్వాత నిబంధనల ప్రకారం విడుదలకు అర్హత పొందవచ్చు. జీవితాంతం లైంగిక నేరస్థుల రిజిస్టర్లోనూ ఆయన పేరు ఉంటుంది.
ఇక రస్సెల్ బ్రాండ్‌పై ఆరోపణలు 2023లో మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తీర్పు వచ్చినప్పటికీ ఆయనపై మరో ఇద్దరు మహిళలు చేసిన అత్యాచార ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో ‘ఫర్గెట్టింగ్ సారా మార్షల్’, ‘గెట్ హిమ్ టు ది గ్రీక్’, ‘ఆర్థర్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన రస్సెల్ బ్రాండ్.. గాయని కేటీ పెర్రీ మాజీ భర్తగానూ గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు ఆయన సినీ కెరీర్ కంటే ఈ క్రిమినల్ కేసు, కోర్టు విధించిన శిక్షే అంతర్జాతీయ మీడియాలో ప్రధాన వార్తగా మారింది.
మీకు నచ్చవచ్చు: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బద్దలు: చరిత్ర సృష్టించిన ‘వారణాసి‘.. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని డీల్.!
[Russell Brand, Russell Brand Sentenced, Russell Brand Prison Sentence, Russell Brand 10 Years Jail, Russell Brand Rape Case, Russell Brand Sexual Assault Case, Katy Perry Ex Husband, Hollywood Actor News, Russell Brand Court Verdict, Russell Brand Latest News, Southwark Crown Court]





