చేనేత చాలా గొప్ప కళ.. ఒక దారం కలుస్తుంది, ఆకారం తీసుకుంటుంది, మలుపులు తిరుగుతుంది, కొన్నిసార్లు విప్పుతుంది, విరిగిపోతుంది, తరువాత మళ్ళీ కలుస్తుంది. అంతా అయ్యాక ఒక అద్బుతం ఆవిష్కారం అవుతుంది. అదే చేనేత అందం. జాతీయ చేనేత దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా కనిపించే విభిన్న స్వదేశీ వస్త్రాల గురించి, చేనేత నైుణ్యం గురించి, భారతదేశానికి చేనేత తెచ్చిపెట్టిన ప్రత్యేక గుర్తింపు గురించి తెలుసుకుంటే..
పెళ్లి, పండుగ, శుభకార్యం.. ప్రత్యేక సందర్భం ఏదైనా పట్టు వస్త్రాలు కట్టుకోవాలి అనుకుంటారు. అయితే మిషన్ వస్త్ర పనితనానికంటే.. చేత పనితనం చాలా అద్బుతాలను ఆవిష్కరిస్తుంది. ఇది వ్యక్తిలో సృజనాత్మకతను, కళను, పనితనాన్ని వెలికితీస్తుంది. నిజానికి చేనేత అనేది ఒక అద్బుతమైన కళ. కేవలం దారాలతో వస్త్రాలు నేయడం కాదు.. రంగులు, డిజైన్లు ఇందులో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. చేనేత అనేది దేశం యావత్తు ఆవరించి ఉంది.
పశ్చిమ భారతదేశంలో గుజరాత్‌లోని దంగాసియా, భార్వాడ్ కమ్యూనిటీలు తంగాలియా నేతను ఆచరిస్తారు. ఇది వార్ప్ దారాల చుట్టూ చుట్టబడిన అదనపు దారాలను ఉపయోగించి సృష్టించబడిన చుక్కల నమూనాలకు ప్రసిద్ధి చెందింది.
మహారాష్ట్రలో విదర్భ.. క్లిష్టమైన కార్వతి కినార్ నేత చాలా ప్రత్యేక కలిగి ఉంది. నేత కళాకారిణి శ్రుతి సాంచెటికి ఈ కళను కాపాడుకుంటూ వస్తోంది. తాను ఈ చేనేత పనిని సంరక్షించడం తన బాధ్యత అనుకుంటోంది. "ఈ కళారూపం నాకు చాలా విలువైనది" అని ఆమె చెబుతుంది.
దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి వచ్చిన ఇకత్-రంగు వేసిన, నూనెతో చేయబడిన టెలియా రుమల్ ఫాబ్రిక్ ఎరుపు, నలుపు, తెలుపు రేఖాగణిత, పూల నమూనాలను కలిగి ఉంటుంది. ఇక ధర్మవరం పట్టు, బనారస్, కంచి, ఉప్పాడ వంటివి వస్త్రాలలో చీరల స్థానాన్ని ఎప్పుడూ ఒక మెట్టు కాదు.. వంద మెట్లు పైన ఉంచుతున్నాయి. నిజానికి చీర అనే వస్త్రం కూడా తరతరాలుగా ఇట్లా నిలబడటానికి కారణం పట్టు వస్త్రాలు.. అందులోనూ సాంప్రదాయత, భారతీయతనం ఈ చీరలలో ఉట్టిపడటమే.. ఈ కారణంగానే ఎన్ని రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినా చీరకు ఒక స్పెషల్ స్టేటస్ ఉండనే ఉంది. కేవలం చీరలు అనే కాదు.. పురుషుల వస్త్రాలు, పిల్లల వస్త్రాలను సాంప్రదాయంగా ఉంచడంలో చేనేత వస్త్రాలు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే చేనేతలను ఎప్పుడూ గౌరవించాలి. ఆదరించాలి, ప్రోత్సహించాలి.
*రూపశ్రీ.