ఉద్యమంలోకి కొత్త రక్తం రావడం లేదు ఎందుకు?
2026 మార్చ్ 31 నాటికినక్సల్ విముక్త దేశంగా ఇండియా?
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న, వినయ్, విజయ్, కృష్ణ, నరసింహా.. ఇలా పలు పేర్లతో పిలిచే ఈ నక్సలైట్ నాయకుడి మరణం అతి పెద్ద విజయంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. హోం మంత్రి అమిత్ షా అయితే అమితానందం వ్యక్తం చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో హతమార్చడం ఇదే తొలిసారి అంటూ అమిత్ షా చేసి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రధాని మోడీ అయితే.. భారత దళాలు సాధించిన గొప్ప విజయంగా దీనిని అభివర్ణించారు.
ఇక నెక్స్ట్ ఎవరు? అంత భారీ స్థాయిలో ఉద్యమాన్ని నడిపేవారెవరు? అలాంటి అవకాశమే లేదా? గణపతి రాజీనామా చేశాక.. కేశవరావు చేతుల్లోకి వచ్చింది మావోయిస్టు పార్టీ. పదేళ్ల పాటు తనదైన మిలటరీ ఆపరేషన్ బలంతో ఎన్నో విధ్వంసాలు సృష్టించాడు కేశవరావు. చంద్రబాబు అలిపిరి బ్లాస్టింగ్ లోనూ కీలక పాత్ర. సల్వాజుడం సృష్టికర్త మహేంద్రకర్మ మరణంలోనూ సూత్రధారి కేశవరావే. ఇంకా ఎన్నో ఆపరేషన్స్ లో భద్రతాదళాలను హతమర్చిన వాడు. ఒక్కసారి కేశవరావు స్కెచ్ వేస్తే ఎంతటి సాయుధ దళాలైనా ఆ ఉచ్చులో చిక్కాల్సిందే. అంత పకడ్బందీగా ఆపరేషన్ ఫిక్స్ చేయడంలో సిద్ధహస్తుడు కేశవరావు. సిక్కోలు జిల్లాలో 1955లో పుట్టిన కేశవరావు, ప్రాధమిక విద్యాభ్యాసమంతా స్వస్థలంలోనే జరిగింది. ఇక ఇంటర్, డిగ్రీ ఆ పరిసర ప్రాంతాల్లోనే జరిగినా.. ఆయన నక్సల్ బరీ ఉద్యమాల పట్ల ఆకర్షితులైంది మాత్రం ఆర్ఈసీ వరంగల్ లో బీటెక్ చదువుతుండగా. ఎంటెక్ మధ్యలోనే ఆపేసి.. అడవి బాట పట్టారు కేశవ్ రావు.
తర్వాతి కాలంలో ఆయన చేసిన విధ్వంసాలకు ఒక అంతు లేదు. ఇటు నిధుల సేకరణ, అటు నియామకాలు, ఆపై ఆయుధ వ్యాపారులతో సత్సంబంధాలు.. ఇలా పలు కోణాల్లో పార్టీకి తన సేవలందించారు. దీంతో నక్సలైట్ అగ్రనాయకుడి స్థాయికి ఎదిగారు. ఒక సమయంలో పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన కేశవరావు మృతితో దాదాపు ఒక శకం, ఒక తరం అంతరించి పోయినట్లే. ప్రస్తుతం ఆపరేషన్ కగార్, బ్లాక్ ఫారెస్ట్, కర్రెగుట్టలు అంటూ జరుగుతోన్న వీటి ద్వారా.. పెద్ద సంఖ్యలో నక్సలైట్లు హతమవుతున్నారు. లొంగుబాటు కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. 2014 నాటికీ ఇప్పటికీ చూస్తే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, జిల్లాల సంఖ్య బాగా తగ్గింది. ఒకప్పట్లో నక్సలైట్ ఘటనల ద్వారా భద్రతా దళాలకు భారీ ఎత్తున నష్టం సంభవించేది. అదే ఇప్పుడు భద్రతా దళాల కారణంగా నక్సలైట్లకు పెద్ద ఎత్తున నష్టం సంభవిస్తోంది.
మొన్న 20 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ కర్రెగుట్టల్లో 31 మంది, ఇప్పుడు అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో 27 మంది చనిపోగా.. వారిలో నంబాల కేశవరావు వంటి అగ్ర నేతల మరణం ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి అంటూ ఒక అగ్రనేత అంటూ లేకుండా పోయాడు.
ఒకప్పుడు అంటే 2004లో వైయస్ హయాంలో హైదరాబాద్ లో జరిగిన నక్సల్స్ చర్చల సమయంలో అన్ని నక్సల్ పార్టీ లు విలీనమై సీపీఐ- మావోయిస్టు పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీలో ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 12 మందితో అత్యంత బలంగా కనిపించింది మావోయిస్టు పార్టీ. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో తెలుగువారి ప్రభ క్రమేణా తగ్గుతూ వస్తోంది. దీనంతటికీ కారణం.. వయోభారం, కొత్త రక్తం రాకపోవడం.. కొందరు ఎన్ కౌంటర్లలో హతమవ్వడం అంటున్నారు. నంబాల కేశవరావు వయసు 70, గణపతి వయసు 76, మరి కొందరి నేతలు సైతం అరవై- డెబ్భై ఏళ్ల మధ్య వారే. వీరందరూ హతమవుతున్న వేళ, కనుమరుగవుతున్న కారణాన.. కొత్త రక్తం పుట్టుకు రావడమే లేదు.
భద్రతా దళాలు విస్తృతంగా చేస్తున్న కూంబింగ్ ఆపరేషన్ల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి పోవడానికే సరిపోవడమే పార్టీ కొత్త రిక్రూట్ మెంట్లపై దృష్టి సారించలేకపోవడానికి కారణంగా చెబుతున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకోడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇక సానుభూతి పరులను ఆకర్షించేలాంటి శిక్షణా తరగతుల నిర్వహణకు అవకాశం ఎక్కడ? అన్నట్లుగా పరిస్థితి మారింది. కాలేజీ స్థాయిలో ఆనాటి రాడికల్ మూమెంట్స్ ఇప్పుడు లేవు. కేశవరావు హయాం కాలం నాటి చదువుకున్న యువత ఇప్పుడు మచ్చుకైనా ఉద్యమంలో కనిపించడం లేదు.
మారిన కాలమాన పరిస్థితుల రీత్యా.. ఉద్యమంలోకి వస్తున్న వారే లేకుండా పోయారు. కారణం గ్లోబలైజేషన్- స్టార్టప్ కల్చర్- ల్యాప్ టాపే ఆపీసుగా డాలర్ల సంపాదన వంటి వాటితో యువత ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది.
అప్పట్లో వందకు పది మంది యువకులలో విప్లవ భావజాలాలుండేవి. వాటి పట్ల ప్రాణాలిచ్చేంతగా ప్యాషనుండేది. అదే ఇప్పుడు.. సాఫ్ట్ వేర్ వచ్చాక, ఈ దేశంలో కూర్చుని మరో దేశానికి చాకిరీ చేసి నాలుగు డాలర్లు పోగు చేయడం అలవాటు పడ్డాక.. అడవుల బాట పట్టడం మానేసింది మన యువత.
బీటెక్ చేశాక.. అమీర్ పేట్ లో ఒక ఐటీ కోర్సు చేసి.. తల్లిదండ్రుల చేత ఎడ్యుకేషన్ లోన్లు చేయించి.. తద్వారా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా అంటూ ఉన్నత చదువులకు వెళ్లి అక్కడ పార్ట్ టైమ్ జాబులు చేసి ఆపై అక్కడే చదువు ముగించి.. ఒక జాబ్ చూసుకుని గ్రీన్ కార్డు సంపాదించడం వరకూ ఒక రకం.
ఆ తర్వాత.. అక్కడే నానా గడ్డీ కరచి.. నాలుగు డాలర్లు తాము ఖర్చు పెట్టుకుని ఓ పది డాలర్లు ఇంటికి పంపే ఒకానొక లైఫ్ లైన్ ఏర్పడ్డంతో.. నక్సల్ బరీ ఉద్యమాల పట్ల ఆకర్షితులవడమే తగ్గిపోయింది.
అప్పట్లో ఇలాంటి ఉద్యమాలకు ప్రధాన కారణం చదువుకు తగ్గ ఉద్యోగం లేక పోవడం. అదే ఇప్పుడలా కాదు కదా? నక్సలైటు నాయకులకన్నా ముందే కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ లకు క్యూ కడుతున్నాయ్. దీంతో అడవి బాట పట్టాల్సిన కాలేజీ కుర్రవాడు కులాసాల బాట పట్టడానికంటూ కంపెనీల్లో చేరేస్తున్నాడు. థర్డ్ ఇయర్ లోనే ఏదో ఒక జాబ్ కొట్టేస్తున్నాడు. దీంతో వెంటనే ఎర్నింగ్ మొదలై పోయింది. కంపెనీలో వారానికి ఐదు రోజుల హార్డ్ వర్క్, తర్వాత వీకెండ్ లో.. బార్లు, బీర్లు, పబ్బులు, క్లబ్బులంటూ యువత తన రూటు సపరేటు అంటోంది.
ఎటు నుంచి ఎటు చూసినా మేలిమి నాయకత్వం, తద్వారా వచ్చే మేథో సంపత్తి అడవుల్లోని ఉద్యమాలకు వెళ్లడమే మానేశాయి. ఉన్న వాళ్లు వయసు మళ్లి.. కొందరు రిటైర్మెంట్ తీసుకోవడం.. మరి కొందరు లొంగిపోవడం. ఇంకొందరు విదేశాలకు చెక్కేయడం ఇలా రకరకాలుగా మారింది పరిస్థితి.
మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండిన మావోయిస్టు నాయకుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో నియమించిన వ్యక్తి ఎక్కడున్నాడని వెతికితే నేపాల్ నుంచి ఫిలిప్పీన్స్ కి పారిపోయాడని అంటున్నారు.
ఇక హిడ్మా ఎక్కడున్నాడని చూస్తే అనారోగ్యా కారణాల తో ఆయన కూడా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇక ఎటు నుంచి ఎటు చూసినా కొత్త నాయకత్వానికి దారి కనిపించడం లేదు. ఆ దిశగా యువత తయారు కావడం లేదు. ఒకప్పడు అడవులను ఏలిన తెలుగు అన్నల స్థానే ఇప్పుడు ఛత్తీస్ గఢ్, ఒడిశాకు చెందిన స్థానికులే జంపన్న చెప్పినట్టు.. నాయకులుగా తయారయ్యే పరిస్థితి.. దీంతో మావోయిస్టు పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. పెద్ద దిక్కు లేక- కొత్త రక్తం ఎక్కించే దారి లేక.. చిక్కి శల్యమయ్యి.. కేంద్రం ఆశించినట్టు అది 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ కనుమరుగైనా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.