తారాగణం: సత్యదేవ్, దీపా థామస్, వికాస్ ముప్పాల, ఆనంద్ భారతి, బాలా పరాశర్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు
రచన, దర్శకత్వం: వెంకటేష్ మహా
డీఓపీ: కార్తీక్ పర్మార్
ఎడిటర్: వెంకటేష్ మహా
సంగీతం: స్మరణ్ సాయి
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి
బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్
సమర్పణ: GMB ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ: జులై 3, 2026
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన మూవీ రావు బహదూర్. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడు కావడంతో పాటు, మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా అని టీమ్ ప్రమోట్ చేయడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి రావు బహదూర్ సినిమాలో ఉన్న కొత్తదనం ఏంటి? ఈ కొత్తదనం ఏ మేరకు మెప్పించింది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Rao Bahadur Movie Review)
కథ:
రాజ కుటుంబానికి చెందిన రామప్ప(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ తో బాధపడుతుంటాడు. భ్రమలు, భయాలతో తన గదినే ప్రపంచంగా బ్రతుకుతున్న రామప్పకు వింతైన మానసిక సమస్య కూడా ఉంటుంది. లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న అతను.. మరెన్నో రోజులు బ్రతకడని డాక్టర్లు చెబుతారు. కానీ, సీనియర్ డాక్టర్ల అంచనాలను కూడా తలకిందులు చేస్తూ.. రామప్ప ఎక్కువరోజులు బతుకుతుంటాడు. దానికి కారణం అనుమానం అనే పెనుభూతం. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన రెండో కొడుకు తనకి పుట్టినవాడు కాదని అనుమాన పడుతుంటాడు. ఆ అనుమానం తీరే వరకు ప్రాణాలతోనే ఉంటానంటూ, చావుకే సవాల్ విసురుతాడు. అసలు రామప్పకు ఆ మానసిక సమస్య ఎలా వచ్చింది? కొడుకు పుట్టుకపై అనుమానం కలగడానికి కారణమేంటి? అసలు ఆ అనుమానం నిజామా కాదా? చివరికి రామప్పకు తెలిసిన నిజమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
అనుమానం అనే పురుగు మెదడులోకి ప్రవేశిస్తే.. అది మనిషిని ఎంత మూర్ఖంగా, ఎంత కఠినంగా మారుస్తుంది? దాని వల్ల ఎలాంటి అనర్ధాలు వస్తాయి? అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు.
కథగా చూసుకుంటే ఇందులో పెద్ద కథేమీ లేదు. తెలిసిన కథ, అందునా చిన్న కథ. తన కొడుకు నిజంగా తనకు పుట్టాడా లేదా? అని చనిపోయేలోపు హీరో తెలుసుకోవాలి అనుకుంటాడు. కథ అద్భుతం కాకపోయినా, ఆ కథను తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకటేష్ మహా. ప్రజెంటేషన్ కొత్తగా ఉంది. ఈ తరహా ప్రజెంటేషన్ తో మన దగ్గర సినిమాలు రావడం చాలా అరుదు. సైకలాజికల్ డ్రామాను ఒక చందమామ కథలా చెప్పే ప్రయత్నం చేశాడు. అదే ఈ సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది.
సినిమా ప్రారంభమే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మాయాలోకాన్ని తలపించే రాజకోట, ఒక పిల్లాడిని వేళ్ళతో మట్టిలోకి లాక్కెళ్ళే చెట్టు, ఆ తర్వాత వింత మానసిక సమస్యతో బాధపడే రామప్ప పాత్ర పరిచయం.. ఇలా పూర్తిగా ఒక కొత్త సినిమా చూస్తున్నామనే భావన ప్రారంభ సన్నివేశాల్లోనే కలుగుతుంది. అయితే కథ ముందుకెళ్తున్న కొద్దీ, కథనం నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే హీరోహీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్ తేలిపోయింది. కొన్ని సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగుతూ సహనానికి పరీక్ష పెడతాయి. అయితే ఇంటర్వెల్ కి ముందు మళ్ళీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తుంది.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. కథ ముందుకు జరుగుతున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. చిన్న కొడుకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక అసలు ఆ అబ్బాయి హీరో కొడుకా కాదా? అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో వచ్చే ట్విస్ట్ లు సర్ ప్రైజ్ చేశాయి.
తీసింది రెండు సినిమాలే అయినా రచయితగా వెంకటేష్ మహా ఇప్పటికే బలమైన ముద్ర వేశాడు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలు ఆయన రచనలో ఉట్టిపడతాయి. అయితే ఇందులో సిచువేషనల్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, ఎమోషన్స్ మాత్రం పూర్తి స్థాయిలో పండలేదు. హీరో పాత్రతో కానీ, ఆ పాత్రలోని సంఘర్షణతో కానీ ప్రేక్షకులు అంత ఎమోషనల్ గా కనెక్ట్ కాలేరు. దానికి కారణం.. ఓ రకంగా దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ అని చెప్పవచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నటీనటులంతా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సత్యదేవ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యువకుడు, మధ్య వయస్కుడు, వృద్ధుడిగా మూడు దశల్లో ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. ముఖ్యంగా వృద్ధ పాత్రలో ప్రాణం పెట్టి నటించాడు. ఇక రామప్ప భార్య రేణుక పాత్రలో దీపా థామస్ తన సహజ నటనతో మెప్పించింది. రామప్ప ఫ్రెండ్, డాక్టర్ ఆచారి రోల్ లో వికాస్ ముప్పాల సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక పనిమనిషి అచ్చమ్మ పాత్రలో బాలా పరాశర్ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. అక్కడక్కడా బాగానే నవ్వులు పూయించింది. ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
రచయితగా పరవాలేదు అనిపించుకున్న వెంకటేష్ మహా, దర్శకుడిగా మ్యాజిక్ చేశాడు. ఈ కథను ఆయన తెరపైకి కొత్తగా తీసుకొచ్చిన తీరు అద్భుతం. కొన్ని కొన్ని సీన్స్ ను ఆయన డిజైన్ చేసిన తీరు కానీ, ఏ మాత్రం తడబాటు లేకుండా వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తీరు కానీ కట్టిపడేసింది. ఈ సినిమాకు ఎడిటర్ కూడా మహానే. అందుకే కొన్ని సీన్స్ ట్రిమ్ చేయడానికి మనసు రాలేదనుకుంటాను. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసినా, లేదా హీరోహీరోయిన్ల ట్రాక్ ను ఇంకా బాగా రాసుకున్నా అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది. కార్తీక్ పర్మార్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. వెంకటేష్ మహా ఆలోచనను తెరపైకి తీసుకువడంలో ఆయన పనితనం అడుగడుగునా కనిపించింది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. పాటలతో ఓకే అనిపించుకున్న స్మరణ్ సాయి, నేపథ్య సంగీతంతో మాత్రం మ్యాజిక్ చేశాడు. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
సత్యదేవ్ సహా ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్
డిఫరెంట్ ప్రజెంటేషన్
టెక్నికల్ వాల్యూస్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
కథాంశం అందరికీ కనెక్ట్ అయ్యేది కాకపోవడం
అక్కడక్కడా నెమ్మదించిన కథనం
ఫైనల్ గా..
ప్రయత్నం బాగుంది. కానీ, దర్శకుడు ఎంచుకున్న కథాంశం అందరికీ కనెక్ట్ అవ్వడం అనుమానమే.
రేటింగ్: 2.5/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
Rao Bahadur Review, Rao Bahadur, Satyadev, Venkatesh Maha, Mahesh Babu