
సోషల్ మీడియా.. సెలబ్రిటీలకు అభిమానులను దగ్గర చేసే వేదిక మాత్రమే కాదు.. ఒక్కోసారి అదే వేదిక వాళ్లకు తలనొప్పిగా కూడా మారుతోంది. ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా వెంటనే ట్రోలింగ్ మొదలవుతోంది. ఇక యువత పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. లైక్స్, కామెంట్స్, ఫాలోవర్స్ అంటూ సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
“మా తరం చాలా అదృష్టవంతులం. మా రోజుల్లో సోషల్ మీడియా లేదు. కానీ ఈ తరానికి సోషల్ మీడియా ఉంది. అది అత్యంత క్రూరమైనది. దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా లేదు” అని నాగార్జున అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిందని, ముఖ్యంగా యువత దాని ప్రభావానికి ఎక్కువగా లోనవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
నాగార్జున సమర్పణలో మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన ‘ఇట్లు అర్జున’ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాగార్జున, అనీష్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు సోషల్ మీడియా ప్రభావంపై నాగార్జున మాట్లాడారు. తాము హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సోషల్ మీడియా లేకపోవడం తమ అదృష్టమని, కానీ ఇప్పటి కొత్త హీరోలు ఈ క్రూరమైన సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేకపోతున్నారని అన్నారు.
సోషల్ మీడియా విషయంలో తన తరం అదృష్టవంతులమని నాగార్జున చెప్పడం వెనుక సెలబ్రిటీల అనుభవం కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి బయటకు వచ్చే సమాచారం పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు, ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇక ‘ఇట్లు అర్జున’ సినిమా గురించి కూడా నాగార్జున ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ చిత్రం నేటి యువత ఆలోచనలు, వారి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులకు దగ్గరగా ఉంటుందని.. యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
[Nagarjuna Social Media Comments, Akkineni Nagarjuna, Social Media, Itllu Arjuna, Aniesh, Anaswara Rajan, Telugu Film News]






