ఏపీలో  స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న రాజకీయ ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం హాట్ టాపిక్ గా మారాయి.  ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు వంటి ప్రాంతాలలో  పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల బెదిరింపులు, భౌతిక దాడుల వంటి సంఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు వైసీపీ ఈ హింసాత్మక ఘటనలపై పరస్పర విమర్శలతో మాటల యుద్ధానికి దిగాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో, ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని దుయ్యబడుతోంది. అయితే అధికార  యంత్రాంగం మాత్రం శాంతిభద్రతలను కాపాడటానికే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.   వైసీపీ ఓటమి భయంతోనే  ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపిస్తున్నదనీ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నదనీ అధికార తెలుగుదేశం కూటమి విమర్శిస్తున్నది.   నామినేషన్ పత్రాలను చించివేయడం, ఎన్నికల అధికారులపై దాడులకు పాల్పడడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తుతోంది.  రాయలసీమ వంటి ప్రాంతాలలో ఎన్నికల హింసకు, అక్కడ వేళ్లూనుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. పార్టీలకతీతంగా కొన్ని ప్రాంతాలలో సాగే ఈ ఆధిపత్య పోరు, ఎన్నికల సమయానికి మరింత హింసాత్మకంగా మారడం కద్దు. ఇప్పుడూ అదే జరుగుతోంది. స్థానిక సంస్థల మీద పట్టు సాధించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వనరులు, కాంట్రాక్టులు, స్థానిక భూభాగాలపై ఆధిపత్యం దక్కుతుందన్న ఉద్దేశమే ఈ ఘర్షణలకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే నామినేషన్ల కేంద్రాల వద్ద పేపర్లు లాక్కోవడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలు పునరావృతమవుతున్నాయి. గ్రామాల్లో బలమైన పట్టున్న నాయకులు తమ వర్గాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నికలను ఒక యుద్ధ రంగంగా మారుస్తున్నారు. ఈ తరహా రాజకీయ సంస్కృతి స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని, సామాన్య ప్రజలు భయంతో ఓటు హక్కును వినియోగించుకోలేని దుస్థితికి దారితీస్తోందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు కేవలం ఒక పార్టీకి లేదా ప్రభుత్వానికి సంబంధించినవి కావు; ఇవి మొత్తం రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురవుతున్న పరీక్ష. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల నిష్పక్షపాత వైఖరి, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి వంటి అంశాలపై మరింత పకడ్బందీ విధానాలు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది. [Andhra Pradesh Local Elections, Political Clashes, Rayalaseema Factionalism, Election Related Unrest, Telugu One]
వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ పాలసీలను ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనబెట్టి అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత  హిట్ అండ్ రన్ తరహా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్  బాధ్యతారహితంగా, ఒక క్రిమినల్ లిటిగెంట్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..  గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.   ఈ సందర్భంగా వైసీపీ హయాంలో సాగిన దౌర్జన్యాలు, అబద్ధాలు, అరాచకాలను వివరిస్తూ.. అదే హింస... అవే అబద్ధాలు... అవే అరాచకాలు  అనే శీర్షికతో రూపొందించిన  బుక్‌లెట్  చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన, పవిత్రమైన ఎన్నికల నిర్వహణ ప్రాధాన్యతను   నొక్కిచెప్పిన ఆయన దేశంలో రాజ్యాంగబద్ధంగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ పనిచేస్తోందని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం,  సుపరిపాలన ద్వారా మాత్రమే నిజమైన పారదర్శక పాలన సాధ్యమవుతుందని, విపక్షాల అరాచక రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనిఅన్నారు.   గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా అపహాస్యం చేశారన్న చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్  హోదాలో ఉన్న అధికారి కూడా తనకు ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి అప్పట్లో దాపురించిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి అరాచకాలకు వైసీపీ శ్రేణులు పాల్పడిందని చెప్పారు.  జగన్ అరాచక పాలనను భరించలేక జనం 2024 ఎన్నికల్లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చరిత్రాత్మక మద్దతు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.   తమపై ప్రజలు ఉంచిన అపారమైన నమ్మకానికి ఆ విజయం ప్రతీక అన్న ఆయన.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తోందని వివరించారు. ప్రజల మద్దతు కోల్పోయిన వైసీపీ ఇంకా   పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తోందన్న చందరబాబు,  అభివృద్ధిని అడ్డుకోవడం, రాష్ట్రాన్ని అస్థిరపరచడం, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం వంటి పద్ధతులనే వారు ఇప్పటికీ నమ్ముకున్నారన్నారు.   స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలనైనా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు.    [CBN Say Jagan Criminal Litigant,   YCP Violence, Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]
బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె వివాహం నిర్వహించడంపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో  విభేదాలు, వైరుద్ధ్యాలు, వైషమ్యాలను మరోసారి రచ్చకెక్కించాయి. సెక్యూరిటీ, వ్యక్తిగత భద్రత, ప్రాణహాని నెపంతో బెంగళూరు నివాసాన్ని వివాహానికి ఇవ్వలేనంటూ జగన్ రాసిన లేఖపై షర్మిల కుటుంబ సభ్యులు, వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహుతులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జగన్ లేఖకు బదులుగా ఆయనకు పలు ప్రశ్నలు, సవాళ్లతో కూడిన లేఖ రాశారు.    గత కొంత కాలంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఆస్తుల పంపిణీ, రాజకీయ విభేదాల చుట్టూ వివాదాలు నడుస్తున్నసంగతి విదితమే ఈ క్రమంలోనే షర్మిల కుమార్తె అంజలి వివాహాన్ని బెంగళూరులోని వైఎస్ కుటుంబ నివాసంలో జరిపేందుకు సిద్ధమవ్వగా, భద్రతా కారణాలను ఉటంకిస్తూ,   జగన్  యలహంక ప్యాలెస్ ను షర్మిల కుమార్తె వివాహ వేడుకకు వేదిక కావడానికి నిరాకరించారు. ఇదు కుటుంబ పరంగా విభేదాలు మరింత పెచ్చరిల్లేందుకు దోహదం చేయడమే కాకుండా, రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.  వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.  గతంలో లేని భయం ఇప్పుడేందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటు బాంబులు, కత్తుల సంస్కృతితో తీవ్ర ప్రాణాభయం ఉన్నప్పటికీ, కుటుంబంలోని పిల్లల పెళ్లిళ్లను ఎప్పుడూ ఆపలేదనీ, ఘనంగా నిర్వహించారనీ గుర్తు చేశారు. అంతే కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులను కూడా వివాహాది శుభకార్యాలకు ఆహ్వానించారని ఆ లేఖలో జగన్ కు  గుర్తు చేశారు.   వైఎస్ సోదరుల పిల్లలు, తోడబుట్టిన చెల్లెలు విమలమ్మ పిల్లల పెళ్లిళ్లు వైఎస్ ఇళ్లలోనే జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జార్జ్ రెడ్డి, అనిల్ రెడ్డి పెళ్లి, విమలమ్మ కొడుకు యువరాజ్, కుమార్తె దివ్య పెళ్లిళ్లు, రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రఘుదీప్ పెళ్లి, అలాగే సుధీకర్ రెడ్డి కుమార్తె విరోనికా రెడ్డి వివాహాలు వైఎస్ నివాసాల్లోనే ఘనంగా జరిగాయని  ఉదాహరించారు. వైఎస్ ఎన్నడూ జగన్ లా పెళ్లిళ్లను, కుటుంబ వేడుకలను అడ్డుపెట్టుకుని ప్రాణహాని ఉందంటూ   దాక్కోలేదని పేర్కొంటూ.. మేనకోడలి పెళ్లి వల్ల  ప్రాణహాని ఉందన్న భయం ఉంటే జగన్ ఆ పది రోజులూ బెంగళూరు ప్యాలెస్ వైపు రాకుండా వేరే  దేశానికో లేదా   ప్రాంతానికో వెళ్లిపోవచ్చునంటూ హితవు పలికారు.  యలహంక ప్యాలెస్‌లోని ఇరు భవనాలు, వాటి చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడలు వేరని గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసినా ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందని, అలాంటప్పుడు భద్రతా సమస్య ఎక్కడి నుంచి వస్తుందని ఆ లేఖలో షర్మిల కుటుంబం నిలదీసింది. షర్మిలకు కాబోయే వియ్యంకులు ఇప్పటికేబెంగళూరులోని షర్మిల రెసిడెన్సీ వేదిక అంటూ ఆహ్వానపత్రాలు ముద్రించి బంధువులకు పంచిన విషయం తెలిసి కూడా జగన్ ఇలా వివాహ వేదికను వద్దనడం తమ పరువు తీయాలన్న ఉద్దేశంతోనేనని దుయ్యబట్టారు.  రెండు వైపులా కేవలం అత్యంత ముఖ్యమైన వందలాది మంది బంధువుల సమక్షంలో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఇలాంటి కుట్రలతో అడ్డుకోవడం ఏంటంటూ నిలదీశారు. మేనకోడలి పెళ్లికి రావడం, శుభకార్యంలో పాల్గొనడం ఇష్టం లేక సెక్యూరిటీ సాకు చూపిస్తూ, ప్యాలెస్ షర్మిలది కాదు, అదేమీ ఫంక్షన్ హాలు కాదు అంటూ  అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.   పక్కనే ఉండి కూడా మేనకోడలి పెళ్లికి హాజరు కాలేదనే చెడు ముద్ర సమాజంలో పడకుండా ఉండేందుకే, ముందుగానే ఇలాంటి వివాదాలు సృష్టించి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తులు, రాజకీయాల పరంగా వస్తున్న విభేదాలు ఇప్పుడు నివాసాలు, శుభకార్యాల వేదికల వరకు పాకడం తెలుగు రాష్ట్రాల్లో  చర్చనీయాంశమైంది. మేనకోడలి పెళ్లి విషయంలోనూ అన్నా చెల్లెళ్ల  మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం నడవడం పట్ల  వైఎస్సార్ అభిమానులు , కుటుంబ శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  [Jagan, YS Sharmila Strong Counter, Jagan, Yelahanka Palace, Life Thret, Letter, Sharmila Daughter Marriage,  YS Rajasekhara Reddy Family, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
హర్రర్.. హర్రర్ .. ఎక్కడ హర్రర్ సినిమాలు, మమ్మల్ని ప్రేమగా భయపెట్టే హర్రర్  జోనర్ సినిమాలు రావా అని ఆ జోనర్ ప్రేమికులు నిత్యం గొణుక్కుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆలాంటి వాళ్లందరికీ సవాలు విసురుతూ ప్యూర్ హర్రర్ మూవీ వచ్చేసింది. పైగా ఓటిటిలో. ఏంటి ఓటిటిలోనా?  ఎక్కడ? ఎప్పుడు? త్వరగా చెప్పేయ్ అంటున్నారా? ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది ఉంది.. మరి పుష్ప లో అల్లు అర్జున్ అన్నట్టుగా దమ్ముంటే పట్టుకోరా షెకావత్ వదిలేస్తా సిండికేట్ అన్నట్టుగా, దమ్ముంటే చూసేయండి  అసలైన హర్రర్ అంటే ఏంటో చూస్తారు.  'దహాన్: ది ఈవిల్ వితిన్' (Dahaan: The Evil Within). ఒరిజినల్‌గా ఒడియా భాషలో రూపొందిన ఈ సంచలన చిత్రం, ఈ నెల 16 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' (Aha) లో తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఒంటరిగా చూసే ధైర్యం ఉందా అనే సవాల్ విసిరేలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతోంది. రొటీన్ దెయ్యం సినిమాలకు పూర్తిగా భిన్నంగా, సరికొత్త డైరెక్ట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం హారర్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  సాధారణంగా కుటుంబంతో కలిసి ఉండాలని, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునే మన్యత అనే యువతి, కొన్ని అనూహ్య పరిస్థితుల కారణంగా తన అక్క అనిందిత, తమ్ముడు సమరేంద్రలతో కలిసి ఓ పాతకాలపు రాజభవనంలోకి నివాసానికి అడుగుపెడుతుంది. ఆ భవనం పైకి చూడటానికి సాధారణంగా కనిపించినప్పటికీ, దాని గోడల వెనుక తరతరాలుగా దాగివున్న భయానక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లడానికే స్థానికులు హడలిపోతుంటారు.   అయితే, ఆ ఇంట్లో ఉన్న కొన్ని పురాతన వస్తువుల మధ్య ఒక రహస్యమైన డిబ్బుక్ పెట్టె ఉంటుంది. ఆ పెట్టెను ఎందుకు తాళం వేసి ఉంచారో తెలియక, విపరీతమైన కుతూహలంతో మన్యత దాన్ని తెరుస్తుంది. ఆ క్షణమే ఆ కుటుంబం జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. ఆ పెట్టె తెరిచిన తక్షణం అందులో నుంచి బయటపడిన ఒక ప్రాచీన దుష్టశక్తి మన్యతను పూర్తిగా ఆవహిస్తుంది. అప్పటివరకు ఎంతో సాధువుగా, అందరితో ఆప్యాయంగా ఉండే మన్యత ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. విచిత్రంగా ప్రవర్తించడం, మనుషులను పీక్కుతినేలా వింత చేష్టలు చేయడం వంటి  భయానక, జుగుప్సాకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇది కూడా చదవండి: ఏఆర్ రెహ్మాన్ పై రామభక్తులు, నెటిజెన్స్ ఫైర్!    తన చెల్లెలిలో వస్తున్న ఈ ప్రమాదకరమైన మార్పులను గమనించిన అక్క అనిందిత, తమ్ముడు సమరేంద్ర ఆమెని కాపాడుకోవడానికి పడే ఆవేదన ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తుంది. మన్యతను ఆవహించిన ఆ భయంకరమైన శక్తిని ఎదుర్కోవడానికి వారు చివరికి ఫాదర్ థామస్ సహాయాన్ని కోరతారు. ఫాదర్ థామస్ నిర్వహించే ఎక్సార్సిజమ్ అనగా దెయ్యాన్ని వదిలించే ప్రక్రియ సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది.  దర్శకుడు అనుపమ్ పట్నాయక్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. ఇందులో వాడిన డార్క్ థీమ్, పకడ్బందీ స్క్రీన్‌ప్లే, జంప్ స్కేర్స్ మరియు సరికొత్త దెయ్యం కాన్సెప్ట్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో మన్యత పాత్రలో నటించిన నటి ఔరోశిఖా మిశ్రా నటన సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలిచింది. దెయ్యం పట్టిన యువతిగా ఆమె ఇచ్చిన భయానక హావభావాలు, అభినయం సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు నిజంగానే నిద్రలేకుండా చేస్తాయి. అలాగే అనిందిత పాత్రలో బర్షా పట్నాయక్, సమరేంద్ర పాత్రలో సమ్రాట్ మహాపాత్ర, ఫాదర్ థామస్ పాత్రలో పార్థ సారథి రే తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. బలమైన కుటుంబ భావోద్వేగాలు, అతీంద్రియ శక్తుల రహస్యాలు మరియు భయానక వాతావరణం కలగలిపిన ఈ సినిమా వీకెండ్‌లో చూడదగ్గ అద్భుతమైన థ్రిల్లర్ అనుభూతిని ఇస్తుంది.  'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది.     [Dahaan The Evil With in Ott Review, Dahaan The Evil Within, Aha OTT review, horror thriller movies Telugu, Dahaan movie streaming Aha, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]    
ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ చుట్టూ వివాదం మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను చూపించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా నేతాజీ కుటుంబానికి చెందిన చంద్ర కుమార్ బోస్ రంగంలోకి దిగి, చిత్ర దర్శకుడు హను రాఘవపూడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న విడుదలైన ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బెర్లిన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు కనిపించాయి. 1942 మే 29న నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను కలిసిన సందర్భాన్ని కూడా ఇందులో చూపించారు. అయితే ఆ సన్నివేశంలో నేతాజీ.. ప్రభాస్ పోషిస్తున్న కల్పిత పాత్రను ప్రశంసిస్తున్నట్టుగా కనిపించడం కొందరికి అభ్యంతరకరంగా అనిపించింది. దేశమంతా ప్రేమించే బోస్ లాంటి గొప్ప వ్యక్తి చేత ఓ కల్పిత పాత్రకు ఎలివేషన్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్ర కుమార్ బోస్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. స్వాతంత్ర్య పోరాటం, దేశ నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు తీసే స్వేచ్ఛ దర్శకులకు ఉందని.. అయితే ఆ స్వేచ్ఛ పేరుతో చారిత్రక వాస్తవాలను వక్రీకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ నాయకుల విషయంలో వాస్తవాలను వక్రీకరించి, కల్పిత అంశాలను జోడించడం నేరంతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. నేతాజీ హోదాను తగ్గించేలా సన్నివేశాలను రూపొందించారని ఆరోపించారు. ఈ విషయంలో దర్శకుడు దేశ ప్రజలకు, స్వాతంత్ర్య పోరాటాన్ని గౌరవించే వారందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేతాజీ హిట్లర్‌ను కలవడం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని కూడా చంద్ర కుమార్ బోస్ వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో అంతర్జాతీయ మద్దతు పొందాలనే ఉద్దేశంతోనే నేతాజీ జర్మనీ నాయకుడు హిట్లర్‌ను, జపాన్ నాయకుడు హిడేకి టోజోను సంప్రదించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. నేతాజీ ఫాసిజాన్ని వ్యతిరేకించారని, ప్రజాస్వామ్య హక్కులను విశ్వసించారని గుర్తుచేశారు. హిట్లర్‌తో నేతాజీ ఒక అధీన వ్యక్తిగా కాకుండా, సమాన స్థాయిలో వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రక సందర్భాన్ని సరిగ్గా చూపించకుండా, వివాదం సృష్టించేలా సన్నివేశాలను రూపొందించారని చంద్ర కుమార్ బోస్ విమర్శించారు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’లో ప్రభాస్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే కల్పిత గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 19న థియేటర్లలోకి రానుంది. అయితే, గ్లింప్స్‌లోని సన్నివేశాలపై వస్తున్న విమర్శలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.  ఇది కూడా చదవండి: ‘ఫౌజీ’లో ప్రభాస్ విధ్వంసం.. ఆ 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌కి థియేటర్లు షేక్.!       [Prabhas Fauzi Controversy, Fauzi Netaji Controversy, Prabhas Fauzi Glimpse, Netaji Grandnephew, Chandra Kumar Bose, Bose Hitler Meeting, Prabhas, Fauzi Movie, Hanu Raghavapudi, Telugu Film News]  
వరల్డ్ వైడ్ గా 'రామాయణ' అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే సినీ ప్రియులు,ప్రేక్షకులు, రామ భక్తులు ఎంత ఎగైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారో అర్ధమవుతూ ఉంది. అదే టైంలో మేకర్స్ కూడా ప్రమోషన్స్ వేగం పెంచడంతో సినీ సర్కిల్స్ లో రామాయణ సందడి వాతావరణం చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏ ఆర్ రెహ్మాన్ సంగీత ప్రవాహం నుంచి  రీసెంట్ గా రిలీజైన సెకండ్ సింగిల్ 'మంగళ రంగ్' సాంగ్ సోషల్ మీడియాలో ఊహించని వివాదానికి, చర్చకి కేంద్రబిందువుగా మారింది.  శ్రీరాముడు మరియు సీతాదేవిల పవిత్ర వివాహ మహోత్సవాన్ని, వారి దివ్య ప్రేమ ప్రయాణాన్ని కీర్తిస్తూ సాంగ్ రూపొందింది. ఈ సాంగ్ లో సూఫీ ఖవ్వాలీ తరహా బీట్స్ మరియు ట్యూన్లు ఉండటంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణం లాంటి పవిత్రమైన హిందూ ఇతిహాసానికి ఇలాంటి సూఫీ శైలి సంగీతం ఏమాత్రం సరిపడదని, ఇది మన సాంస్కృతిక మూలాలకు మరియు సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని వారు విమర్శిస్తున్నారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్ల ప్రకారం, ఈ పాటలోని మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గతంలో చేసిన 'రాక్‌స్టార్' లేదా 'జోధా అక్బర్' సినిమాల్లోని 'కున్ ఫయా కున్' పాటను పోలి ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇది పూర్తిగా రీసైకిల్ చేసిన ట్యూన్ అని, పాటలోని కొన్ని భాగాలు ఇతర దక్షిణ భారత సినిమాల ట్యూన్లను గుర్తుకు తెస్తున్నాయని ఆరోపిస్తున్నారు.  వాల్మీకి రామాయణంలో ఇలాంటి సూఫీ స్టైల్ క్వవాలీ సంగీతాన్ని జొప్పించడం వల్ల అసలు సిసలైన భక్తి భావన దెబ్బతింటుందని, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ సరైన సాంస్కృతిక పరిశోధన చేయకుండా పాత ఫార్ములాలనే రిపీట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాముడి వంటి దైవిక పాత్రలకు, స్వచ్ఛమైన సంస్కృత శైలి లేదా శాస్త్రీయ సంగీతపు బాణీలను ఉపయోగిస్తే ఫలితం వంద రెట్లు మెరుగ్గా ఉండేదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి: స్టార్ హీరో సరసన కయదు: బిగ్ ఆఫర్ కొట్టేసింది భయ్యా!   అయితే మరోవైపు, ఈ పాటను మరియు ఏఆర్ రెహమాన్ పనితీరును ఇష్టపడే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే మద్దతుగా నిలుస్తున్నారు. అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ గాత్రం చాలా అద్భుతంగా ప్రాణం పోసిందని, సినిమాలోని విజువల్స్ ఈ వివాహ వేడుకను అత్యంత వైభవంగా కళ్లకు కట్టాయని సమర్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో 'మంగళ రంగ్' పాట మాత్రం నెట్టింట పెద్దయెత్తున రగడ సృష్టిస్తూ, ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రముఖ కవి కుమార్‌ విశ్వాస్ కలం నుంచి సదరు సాంగ్ పురుడు పోసుకుంది.     [Ramayana Mangal Rang Song Controversy, Ramayana Mangal Rang song, AR Rahman controversy, Ramayana movie music, Ranbir Kapoor Ramayana, Ramayana song backlash, Bollywood, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]    
కయదు లోహర్.. అందానికే అసూయ పుట్టేంత అందంతో పాటు అంతకంటే అందమైన పెర్ ఫార్మెన్స్ తో దూసుకుపోతూ ఉంది. ప్రీవియస్ చిత్రం ప్యారడైజ్ నే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఈ అమ్మడి చేతులోకి ఒక బడా హీరో ప్రాజెక్ట్ వచ్చింది చేరినట్టుగా వార్తలు  వినిపిస్తున్నాయి. బడా అంటే మాములు బడా కాదు. ఇది కనుక నిజమైతే తన హవాని ఇక ఎవరు ఆపకపోవచ్చు.    థలా 'అజిత్ కుమార్'. తమిళ చిత్ర పరిశ్రమని సుదీర్ఘ కాలంగా ఏలుతున్న స్టార్ కట్ అవుట్. కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న  చిత్రం ‘డేర్‌డెవిల్’ (Dare Devil) ఇప్పుడు సినిమా వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. అదిక్ రవిచంద్రన్ దర్శకుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాతో అజిత్ సతీమణి, ప్రముఖ నటి షాలిని అజిత్ కుమార్ ‘బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్’ (Bravehearts Production) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారడం విశేషం.      హీరోయిన్‌కి సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలెంటెడ్ బ్యూటీ కయ దు లోహర్ (Kayadu Lohar)  అజిత్ సరసన నాయికగా ఖరారైనట్లు తెలుస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్‌లో శ్రీలీల పేరు వినిపించినా, చివరికి కయదు పేరు తెరపైకి రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇదే నిజమైతే కయదు సినీ కెరీర్ మరింత ప్రజ్వలిస్తుందనే విషయంలో ఎలాంటి డౌట్ ఉండక్కర్లేదు.     kayadu Lohar In Ajith Dare Devil, kayadu Lohar Latest News, Ajith Kumar, Dare Devil movie, Kayadu Lohar, Shalini Ajith, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News
సినిమా నచ్చితే ప్రశంసించడం.. నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం మామూలే. కానీ స్టార్‌ కుటుంబాలకు చెందినవారు తమ అభిప్రాయాలను బయటపెడితే మాత్రం ఆ చర్చ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్‌ ఘట్టమనేని విషయంలోనూ ఇదే జరుగుతోంది. నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ సినిమాకు ఆయన ఇచ్చిన రేటింగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. గౌతమ్‌ తన లెటర్‌బాక్స్‌ (Letterboxd) ఖాతాలో ‘ది ప్యారడైజ్‌’ సినిమాను రివ్యూ చేస్తూ ఐదింటికి ఒక స్టార్‌ మాత్రమే ఇచ్చాడు. సినిమాలో సినిమాటోగ్రఫీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటీనటుల నటన నచ్చాయని పేర్కొన్నాడు. అయితే మిగతా అంశాలేవీ తనను ఆకట్టుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. “సినిమాటోగ్రఫీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటీనటుల నటన నచ్చాయి. మిగతా ఏదీ నచ్చలేదు. చాలా నిరాశపరిచింది. ఎడిటింగ్‌ కూడా చాలా దారుణంగా ఉంది” అంటూ గౌతమ్‌ తన రివ్యూలో పేర్కొన్నాడు. గౌతమ్‌ సినిమాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినిమాకు కూడా ఆయన కేవలం అర స్టార్‌ రేటింగ్‌ ఇచ్చాడు. తన తండ్రి మహేశ్‌బాబు సినిమాలకు సైతం తక్కువ రేటింగ్స్‌ ఇచ్చిన సందర్భాలు ఉండటంతో.. గౌతమ్‌ రివ్యూలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ‘ది ప్యారడైజ్‌’ థియేటర్లలో విడుదలైనప్పటి నుంచే భిన్నమైన స్పందనను అందుకుంది. కథాంశం, నాని నటన, సినిమాటోగ్రఫీ వంటి అంశాలపై ప్రశంసలు వచ్చినప్పటికీ.. కథనంలో వేగం, ఎడిటింగ్‌, కొన్ని సన్నివేశాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా చర్చ కొనసాగుతోంది. ఓటీటీ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేయడం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ ఇచ్చిన వన్‌ స్టార్‌ రేటింగ్‌ సినిమాపై మరోసారి చర్చకు కారణమైంది. ఇది కూడా చదవండి: ‘ఫౌజీ’లో ప్రభాస్ విధ్వంసం.. ఆ 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌కి థియేటర్లు షేక్ అవుతాయి.!       [The Paradise One Star Rating, Gautam Ghattamaneni, Letterboxd Review, Mahesh Babu Son Gautam, The Paradise Movie, The Paradise OTT, Nani Paradise OTT, Telugu Film News]  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా ప్రభాస్ చేతిలో భారీ రైఫిల్‌తో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ గ్లింప్స్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గ్లింప్స్‌లో చూపించిన ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ సినిమాలో సుమారు 15 నిమిషాల పాటు సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేసేలా ఈ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో రూపొందించారని, దాని అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వచ్చిందని టాక్‌. రెండో ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ‘ఫౌజీ’ కథ సాగనుంది. గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పాటు, బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరే రహస్య సైనికుడిగా ప్రభాస్ పాత్రను పరిచయం చేశారు. దేశం కోసం పోరాడే తిరుగుబాటు సైనికుడిగా ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ప్రభాస్ లుక్‌, యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో స్పై థ్రిల్లర్ అంశాలను జోడించడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘సీతారామం’తో గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, సుబోధ్ భావే, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, టీ-సిరీస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ముందుగా 2026 డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి, 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది కూడా చదవండి: మెగా అప్డేట్.. చిరంజీవి ‘కాకా’లో మరో బాలీవుడ్ స్టార్.!       [Prabhas Fauzi 15 Minute Action Sequence, Prabhas Fauzi Movie, Fauzi Action Sequence, Fauzi Glimpse, Rebel Star Prabhas, Fauzi Release Date, Hanu Raghavapudi, Imanvi, Telugu Film News]  
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ పేరు వినిపిస్తోంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అనిల్ కపూర్ ‘కాకా’లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్‌. ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథను మలుపు తిప్పే ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో, ఇప్పుడు అనిల్ కపూర్ పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కేవీఎన్ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు 85 శాతం పూర్తయిందని, డిసెంబర్ మొదటి వారంలోగా షూటింగ్ ను  ముగించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘కాకా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి, బాబీ కలయికలో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.  ఇది కూడా చదవండి: బిగ్గెస్ట్ డీల్‌.. ‘జనవరి 12 విడుదల’ బిజినెస్‌ క్రేజ్ మామూలుగా లేదుగా.!       [Anil Kapoor In Kaaka Movie, Chiranjeevi Kaaka, Megastar Chiranjeevi, Kaaka Movie Update, Anil Kapoor, Anurag Kashyap, Bobby Kolli, Anaswara Rajan, Telugu Film News]  
సంక్రాంతి బరిలోకి దిగుతోందంటే చాలు.. అనిల్‌ రావిపూడి సినిమాపై అంచనాలు పెరిగిపోతుంటాయి. అందులోనూ వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ లాంటి ఇద్దరు ప్రముఖ నటులు కలిసి నటిస్తుండటంతో ‘జనవరి 12 విడుదల’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌ గురించి వినిపిస్తున్న వార్తలు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తాజా ట్రేడ్‌ టాక్‌ ప్రకారం.. ‘జనవరి 12 విడుదల’ థియేట్రికల్‌ హక్కులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనే రూ.100 కోట్లకు పైగా బిజినెస్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే వెంకటేశ్‌ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రీ-రిలీజ్‌ డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా హక్కుల కోసం ఇతర ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించడం అనిల్‌ రావిపూడికి బాగా కలిసొచ్చింది. ‘ఎఫ్‌2’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలతో ఆయనకు ఈ పండగ సీజన్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. వెంకటేశ్‌తో ఆయనకు ఉన్న విజయవంతమైన అనుబంధం కూడా ఈ కొత్త సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక కారణం. ఇప్పుడు తొలిసారి వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ. కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌లోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన చిత్రబృందం.. 2027 జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి సీజన్‌లో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘ఇడుపు కాయితం’ సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ వేణు ఉడుగుల.!       [January 12 Vidudala Business, January 12 Vidudala Movie, Anil Ravipudi Sankranthi Movies, Victory Venkatesh, Nandamuri Kalyan Ram, Anil Ravipudi, Sankranthi 2027 Movies, Telugu Film News]  
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న రూరల్ ఎంటర్‌టైనర్‌ ‘ఇడుపు కాయితం’ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా టైటిల్‌ ప్రకటించినప్పుడే తెలంగాణ యాసలో ఉన్న పేరుపై కొందరు ట్రోల్స్ చేశారు. అసలు ఆ టైటిల్‌కు అర్థమేంటంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాట కూడా వివాదానికి దారితీయడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని పాటలో పెళ్లి వేడుకకు సంబంధించిన సన్నివేశాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పెళ్లిళ్లలో మందు పోసే సంప్రదాయాన్ని సినిమాలో చూపించిన తీరు వాస్తవానికి భిన్నంగా ఉందని విమర్శిస్తున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం తెలంగాణ సంస్కృతిని తప్పుగా చూపించొద్దంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు వేణు ఉడుగుల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి. తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలి. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను ఆదరిద్దాం.సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే  విమర్శించండి. కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని మీ అజ్ఞానంతో నిర్వచించకండి." అని వేణు ఉడుగుల తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మొత్తానికి, పాటలోని సన్నివేశాలపై వస్తున్న విమర్శలు ఒకవైపు.. తెలంగాణ సంస్కృతిని తెరపై చూపించే విధానంపై వేణు ఉడుగుల చేసిన వ్యాఖ్యలు మరోవైపు.. ‘ఇడుపు కాయితం’ చుట్టూ చర్చను మరింత పెంచాయి. సినిమా విడుదలయ్యాక ఈ సన్నివేశాలపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ సినిమాపై ఎన్టీఆర్ జెలసీ.. త్రివిక్రమ్‌కి ఫోన్ చేసి తిట్టేశాడు.! https://x.com/venuudugulafilm/status/2114227465283637420       [Venu Udugula On Idupu Kayitham Trolls, Idupu Kayitham Song, Idupu Kayitham Movie, Idupu Kayitham Trolls, Telangana Culture, Venu Udugula Twitter, Priyadarshi, Naga Durga, Telugu Film News]  
ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో త్రివిక్రమ్, తమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాలోని పాటలు, కథలోని భావోద్వేగాలు ఒక ప్రత్యేకమైన మూడ్‌లో సాగుతాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో తమన్ స్వరపరిచిన ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ వంటి పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ రెండు సినిమాల పాటలను పోల్చుతూ ఎన్టీఆర్ తమన్‌ను సరదాగా ఆటపట్టించారట. ‘అరవింద సమేత’లో తనకు విషాదభరితమైన పాటలు ఇచ్చి.. బన్నీకి మాత్రం ఇంత స్టైలిష్‌గా, హుషారుగా ఉండే పాటలు ఎలా ఇచ్చావంటూ ఫోన్‌లో తనదైన శైలిలో ప్రశ్నించారని తమన్ గుర్తుచేసుకున్నారు. "మాకేంట్రా ఏడపోయినావో, ఎప్పుడొస్తావో, ఎప్పుడు వెళ్లిపోతావో పాటలు ఇచ్చావు. వెంటనే బన్నీకి సామజవరగమన, బుట్టబొమ్మ, రాములో రాముల ఇచ్చావు" అంటూ ఎన్టీఆర్ ఫోన్ చేసి సరదాగా తిట్టాడని తమన్ వెల్లడించారు. https://x.com/ASVR_tarak/status/2113925818711994868 అలాగే ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రఫ్‌గా, మాస్ యాక్షన్‌తో సాగుతుంది. ‘అల వైకుంఠపురములో’ మూవీలో మాత్రం అల్లు అర్జున్‌ను చాలా స్టైలిష్‌గా చూపించారు త్రివిక్రమ్. ఈ విషయాన్ని కూడా ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారట. దీనిపై త్రివిక్రమ్ మాట్లాడుతూ.. తారక్ మా ఇద్దరికీ తలంటేశాడు. "నన్నేమో ఎండల్లో నిలబెట్టి, మీద దుమ్మేసేసి, చొక్కాలిప్పించేశారు" అంటూ తారక్ సరదాగా కోప్పడ్డాడని చెప్పారు. మొత్తానికి, ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర సినిమా విషయాలను ఎంత సరదాగా ప్రస్తావిస్తారో ఈ సంఘటన మరోసారి తెలియజేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి కలిసి ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్రివిక్రమ్ ఇప్పటికే వెల్లడించారు.  ఇది కూడా చదవండి: టాయిలెట్‌లో గ్యాంగ్‌స్టర్.. అసలు స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!       [Jr NTR, Aravinda Sametha Movie, Allu Arjun, Ala Vaikunthapurramuloo, NTR Trivikram Movie, Trivikram Srinivas, God Of War, Thaman s, Telugu Film News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రస్తుత కాలంలో రసాయనాలతో కూడిన ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ముఖానికి ఉపయోగించడం కంటే, పూర్తిగా సహజమైన పద్ధతులతో చర్మాన్ని సంరక్షించుకోవడానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ కోవలోకి వచ్చే అత్యంత ఆకర్షణీయమైన, పోషకాలు నిండిన ఉష్ణమండల పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ముందుంటుంది. కేవలం ఆరోగ్యానికే కాకుండా, మీ చర్మానికి సహజమైన కాంతిని, నిగనిగలాడే మెరుపును అందించడంలో డ్రాగన్ ఫ్రూట్ ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. విటమిన్ సి, విటమిన్ బి3, విటమిన్ ఇ, పాలీఫెనాల్స్, బీటాలైన్స్ వంటి శక్తివంతమైన పోషకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, ఆక్సీకరణ ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం ఎప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను నివారించడంలో, చర్మంపై ఏర్పడే ఎరుపుదనాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ముడతలు, నల్లటి మచ్చలు తగ్గి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి. చర్మానికి హాని చేసే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడి మొటిమలు, చర్మపు చికాకును ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల చర్మం యొక్క స్థితిస్థాపకత మెరుగై, చర్మం మృదువుగా మారుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ అద్భుతమైన పండు చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. విటమిన్ బి3 మరియు విటమిన్ ఇ కణాల పునరుద్ధరణకు ఎంతగానో తోడ్పడి, సూర్యరశ్మి వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఇంట్లోనే సహజసిద్ధంగా ఫేస్ మాస్క్‌లు తయారు చేసుకోవడానికి ఇది సరైన ఎంపిక. ఉదాహరణకు, 2 టేబుల్ స్పూన్ల డ్రాగన్ ఫ్రూట్ గుజ్జులో 1 టీస్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత కడిగితే చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. లేదంటే, ఈ పండు గుజ్జుకు కొద్దిగా తాజా పెరుగు కలిపి ముఖానికి రాస్తే చర్మం మరింత కాంతివంతంగా ప్రకాశిస్తుంది. అలాగే ఎండ వల్ల కాలిపోయిన లేదా మంటగా ఉన్న చర్మానికి అలోవెరా జెల్, డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు మిశ్రమం ఎంతో మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. సహజసిద్ధమైన ఈ పద్ధతులను మీ దైనందిన సౌందర్య దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి నిగనిగలాడే చర్మాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు.     Dragon Fruit For Skin, DIY Face Masks For Glowing Skin, Pitaya Skincare Benefits, Natural Anti Aging Remedies, Homemade Fruit Packs, Clear Skin Tips, Healthy Skin Routine.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే అపోహ చాలా కాలంగా సమాజంలో వేళ్లూనుకుపోయింది. ముఖ్యంగా చల్లటి నీటితో స్నానం చేయడం, తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండటం వల్ల నేరుగా జలుబు వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే వైద్య శాస్త్రం మరియు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల నేరుగా జలుబు వస్తుందనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జలుబు అనేది ప్రధానంగా రైనోవైరస్ వంటి వైరస్‌ల వల్ల మాత్రమే వ్యాపిస్తుంది తప్ప, తలస్నానం చేసే విధానం వల్ల రాదు. చలికాలంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల కొంతమందికి వణుకు లేదా అసౌకర్యం కలగవచ్చు, కానీ దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకదు. మీ శరీరానికి అనుకూలమైన ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని ఉపయోగించడం ఎప్పుడూ మంచిది. తలస్నానం చేసిన తర్వాత జుట్టును వీలైనంతవరకు ఆరబెట్టుకోవడం ఆరోగ్యరీత్యా మంచి అలవాటు. తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండటం వల్ల ముఖ్యంగా చల్లని వాతావరణంలో చలిగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల నేరుగా జలుబు వస్తుందని నిరూపించబడలేదు. అవసరమైతే టవల్‌తో జుట్టును మెల్లగా తుడిచి, సహజంగా ఆరబెట్టుకోవచ్చు. ఇకపోతే, ప్రతిరోజూ షాంపూ ఉపయోగించడం గురించిన చర్చ కూడా జోరుగా సాగుతుంటుంది. ప్రతిరోజూ షాంపూ ఉపయోగించాలా వద్దా అనేది పూర్తిగా మీ జుట్టు స్వభావం, తల చర్మం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా చెమట పట్టేవారు, జిడ్డు తల చర్మం ఉన్నవారు లేదా దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పనిచేసేవారు తరచుగా షాంపూ ఉపయోగించాల్సి రావచ్చు. అయితే, కొన్ని రకాల జుట్టు ఉన్నవారిలో రోజూ షాంపూ చేయడం వల్ల జుట్టు పొడిబారడం, తల చర్మం చికాకు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ జుట్టు తత్వానికి సరిపోయే మైల్డ్ షాంపూను ఎంచుకుని, మీ అవసరాన్ని బట్టి ఉపయోగించడం ఉత్తమం. తలస్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ శుభ్రమైన నీటిని ఉపయోగించాలి మరియు మీకు అనుకూలమైన ఉష్ణోగ్రతలో ఉండే నీటిని ఎంచుకోవాలి. జుట్టును బలంగా రుద్దకుండా, మృదువుగా ఆరబెట్టుకోవాలి. అలాగే జలుబుకు కారణమయ్యే వైరస్‌ల వ్యాప్తిని తగ్గించడానికి చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండటం ముఖ్యం. ప్రతిరోజూ తలస్నానం చేయడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదు; మీ జుట్టు మరియు తల చర్మం యొక్క వ్యక్తిగత అవసరాలను బట్టి తలస్నానం చేసే విధానాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ జలుబుతో పాటు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా దీర్ఘకాలిక లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.     Daily Hair Wash Cold Myth, Does Wet Hair Cause Cold, Head Bath Every Day Side Effects, Hair Care Myths And Facts, Health Facts About Hair Washing, Sinus And Daily Hair Bath, Proper Hair Washing Routine.
మనలో చాలామంది ఫిట్‌నెస్ కోసం రోజూ ఉదయం పూట బయట వ్యాయామాలు, జాగింగ్ లేదా సైక్లింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే, శీతాకాలం వచ్చే కొద్దీ మరియు నగరాల్లో వాతావరణ కాలుష్యం, దట్టమైన స్మోగ్ విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. కాలుష్య పూరిత గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందా అనే ఆందోళన తీవ్రమవుతోంది. గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ తుషార్ తాయాల్ ప్రకారం, ఈ ప్రభావం కాలుష్య స్థాయిలు, వ్యాయామం తీవ్రత, ఎంతసేపు శ్రమించారు మరియు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒకే ఒక్క రోజు గంటపాటు వ్యాయామం చేసినంత మాత్రాన శాశ్వత నష్టం జరగకపోయినా, పదేపదే ఈ విషపూరిత గాలిలో వ్యాయామాలు చేయడం వల్ల అనారోగ్య ముప్పు గణనీయంగా పెరుగుతుంది. వ్యాయామం చేసే సమయంలో మన శ్వాస వేగం మరియు లోతు పెరుగుతాయి, దీనివల్ల కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అందడంతో పాటు, గాలిలో ఉన్న పీఎం 2.5 (PM2.5) వంటి ప్రమాదకరమైన సూక్ష్మ కాలుష్య కణాలు మరియు ఓజోన్, నైట్రోజన్ డైయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు నేరుగా లోపలికి పీల్చబడతాయి. ఈ కాలుష్య కణాలు ఊపిరితిత్తుల్లోని లోతైన భాగాలకు చేరుకుని తీవ్రమైన మంట, ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల దగ్గు, గొంతులో మంట, పీపీపీ లేదా ఛాతీ బిగుతుగా అనిపించడం, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఊపిరితిత్తులతో పాటు గుండెపై కూడా ఈ కాలుష్య గాలి అదనపు భారాన్ని మోపుతుంది. వ్యాయామం సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం సహజమే అయినప్పటికీ, కాలుష్య కణాలు రక్తనాళాల పనితీరును దెబ్బతీసి, శరీరంలో మంటను ప్రేరేపిస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు లేదా గుండెజబ్బులు ఉన్నవారిలో స్ట్రోక్స్ మరియు గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కేవలం శ్వాసకోశాలు, గుండె మాత్రమే కాకుండా, మెదడు నాడీ వ్యవస్థపై కూడా ఈ కాలుష్య ప్రభావం పడుతుంది. కాలుష్యం కారణంగా వర్కౌట్ ముగిసిన తర్వాత కొందరిలో తలనొప్పి, మైకం లేదా ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 'జమా నెరాలజీ' (JAMA Neurology) జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, దీర్ఘకాలికంగా కాలుష్యానికి గురికావడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం మరియు నాడీ సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుంది. అందువల్ల, కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆరుబయట కఠినమైన వ్యాయామాలు చేయడం మానుకోవడం చాలా ముఖ్యం. ఏక్యూఐ (AQI) స్థాయిలను తనిఖీ చేసి, కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు ఇండోర్ జిమ్‌లలో లేదా హెపా (HEPA) ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉన్న శుభ్రమైన గదులలో వ్యాయామాలు చేయడం మంచిది. రద్దీగా ఉండే రోడ్లకు దూరంగా నడవాలని, వ్యాయామం సమయంలో శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామాన్ని ఆపివేయాలని వైద్యులు సూచిస్తున్నారు.     Exercising In Polluted Air, Workout In Smog Effects, Air Pollution And Health, Cardio In Polluted Air Dangers, Lungs And Heart Pollution Risks, Outdoor Exercise Air Quality, Health Effects Of Smog.
శాకాహారం మంచిదా లేక మాంసాహారం మంచిదా అనే చర్చ చాలా సందర్భాలలో వస్తుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని ఇష్టపడేవారు, శాకాహారాన్ని ఇష్టపడేవారు ఒకే దగ్గర చేరినప్పుడు ఈ రెండింటి మధ్య గల తేడా గురించి చాలా వాదించుకుంటూ ఉంటారు. దీర్ఘాయువుకు శాకాహారమే కీలకం అని కొందరు నమ్మితే..  మాంసంలో లభించే ప్రోటీన్ మరియు పోషకాలు మరింత ప్రయోజనకరమని మరికొందరు వాదిస్తారు. అయితే ఆరోగ్యం , దీర్ఘాయువు కోసం ఏ ఆహారం నిజంగా మంచిది? ఆరోగ్య నిపుణులు,  పరిశోధకులు దీని గురించి ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే..   శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. శాకాహారులకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం , క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.  శాకాహారుల ఆహారంలో పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా , వల్ల, వారు సాధారణంగా తక్కువ బరువు మరియు తక్కువ బాడీ మాస్ ఇండెక్స్‌ను కలిగి ఉంటారు. కూరగాయలు , పండ్ల నుండి లభించే విటమిన్లు E, C , కెరోటిన్ శరీరాన్ని అంతర్గతంగా బలోపేతం చేయడానికి సహాయపడతాయి,  తక్కువ సంతృప్త కొవ్వులు గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. మాంసాహారం.. శాకాహారులు ఎక్కువ కాలం జీవిస్తారని చాలా కాలంగా నమ్మేవారు, కానీ చైనాలోని వృద్ధులపై ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ఈ భావనను సవాలు చేసింది. ఈ పరిశోధన ప్రకారం, మాంసాహారం తినేవారితో పోలిస్తే, కఠినమైన శాకాహారాన్ని పాటించేవారికి 100 ఏళ్ల వయస్సును చేరుకునే అవకాశం తక్కువగా ఉన్నట్లు కనుగొనబడిందట. దీని అర్థం, వృద్ధాప్యంలో శరీరానికి అవసరమైన పోషకాలను కేవలం మొక్కల ఆధారిత ఆహారంతో మాత్రమే పొందలేము. మధ్యేమార్గం.. మాంసాహారం తినేవారితో పోలిస్తే, చేపలు , పాల ఉత్పత్తులను తినేవారు లేదా చేపలు, పాల ఉత్పత్తులతో కూడిన శాకాహారాన్ని  తీసుకునేవారికి ఆరోగ్యపరంగా బాగుంటుందట. దీనిని బట్టి దీర్ఘకాలం  ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో, పూర్తిగా శాకాహారిగా లేదా పూర్తిగా మాంసాహారిగా ఉండటం కంటే, సమతుల్య ఆహారం తీసుకోవడమే ఎక్కువ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఇతర కారకాలు.. దీర్ఘాయువు కేవలం ఆహారపు అలవాట్లపై మాత్రమే ఆధారపడి ఉండదని పరిశోధకులు అంటున్నారు. జన్యుపరంగా, జీవనశైలి, శారీరక శ్రమ, మొత్తం ఆరోగ్యం వంటి అనేక అంశాలు కూడా సమాన పాత్ర పోషిస్తాయి. అందువల్ల, కేవలం శాకాహారిగా లేదా మాంసాహారిగా ఉండటం అనేది దీర్ఘాయువు నిర్ణయించబడదు అంటున్నారు.                                  *రూపశ్రీ
కాఫీ, టీ తాగడానికి ముందు మంచి నీరు తాగడం మంచిదేనా ? ఈ నిజాలు తెలుసుకోండి..! ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వచ్చే ఉత్సాహమే వేరు. రోజువారి అలసటను పారద్రోలి, మనసును తేలికపరచడంలో కాఫీ, టీలు ఎంతగానో సహాయపడతాయి. అయితే, మనలో చాలామందికి కాఫీ లేదా టీ తాగడానికి కొద్ది నిమిషాల ముందు కాస్త మంచినీరు  తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటూ ఉంటుంది. కొందరైతే కాఫీ, టీ తాగడానికి ముందు నీరు తాగితే కడుపులో యాసిడ్లు పల్చబడిపోతాయని, దానివల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుందని చెబుతుంటారు. మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో, అసలు సైన్స్ ఏం చెబుతుందో  వివరంగా తెలుసుకుంటే.. ఎసిడిటీ పెరుగుతుందా? కాఫీ ,  టీ తాగడానికి ముందు మంచి నీరు తాగితే కడుపులో ఎసిడిటీ పెరుగుతుందని అనుకోవడం కేవలం ఒక పొరపాటు లేదా  అపోహ మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిజానికి, టీ లేదా కాఫీ తాగడానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరానికి , జీర్ణవ్యవస్థకు  అనేక రకాల ప్రయోజనాలను పొందుతాయి. కెఫీన్ ప్రభావం తగ్గిస్తుంది.. కాఫీ , తేయాకులలో సహజంగానే కెఫిన్ తో పాటు కొంతవరకు యాసిడ్ స్వభావం ఉంటుంది. పరగడుపున లేదా ఖాళీ కడుపుతో వీటిని నేరుగా తాగినప్పుడు, కడుపులోని పొరలు చికాకుకు గురై ఎసిడిటీ, గుండెల్లో మంట, లేదా కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అయితే, కాఫీ లేదా టీ తాగడానికి ఐదు నుండి పది నిమిషాల ముందు సాధారణ నీటిని తాగడం వల్ల, ఆ నీరు పొట్టలోని యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇది ఒక రక్షణ పొరలా పనిచేసి, కెఫిన్ పొట్ట గోడలపై నేరుగా చూపించే తీవ్ర ప్రభావాన్ని తగ్గిస్తుంది. నీరు తాగడం వల్ల కడుపులోని  రసాలు పల్చబడి జీర్ణక్రియ పాడవుతుందని అనుకుంటారు. మనం తాగే ఒక గ్లాసు నీరు పొట్టలో చాలా వేగంగా శోషించబడుతుంది. అంతేకాకుండా, నీరు పొట్టను జీర్ణక్రియకు సిద్ధం చేస్తుంది. టీ, కాఫీలలో ఉండే టానిన్లు, కెఫిన్ వల్ల కడుపులో కలిగే మంటను నివారించడంలో ఈ నీరు ఎంతగానో తోడ్పడుతుంది.  నోటి ఆరోగ్యం.. టీ, కాఫీలు తాగడం వల్ల వాటిలోని రసాయనాలు దంతాలపై పసుపు రంగు మరకలను ఏర్పరుస్తాయి. అంతేకాకుండా దంతాల ఎనామిల్ ను బలహీనపరుస్తాయి. కాఫీ లేదా టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల నోటిలోని పిహెచ్ స్థాయిలు సమతుల్యంగా మారి దంతాల ఎనామిల్ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే, కాఫీ, టీలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహేడ్రేషన్ కు  గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ముందుగానే నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చివరిగా.. కాఫీ లేదా టీ తాగడానికి ముందు కొద్దిగా  సాధారణ నీటిని తాగడం చాలా మంచి అలవాటు. ఇది ఎసిడిటీని పెంచకపోగా, మరింత తగ్గించి జీర్ణవ్యవస్థను సురక్షితంగా ఉంచుతుంది. కాబట్టి  టీ లేదా కాఫీకి కొద్ది నిమిషాల ముందు కొద్దిగా  నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే..                                                                                                                                              *రూపశ్రీ.
కడుపులో మంట, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారా? తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఛాతీలో మంటగా అనిపించడం, కడుపు నిండినట్లు ఉండటం వంటి లక్షణాలను చాలామంది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ఎలాంటి అలవాట్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి? ఏ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి? ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ వైద్యులు  డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు గారు గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించిన  ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. తరచుగా గ్యాస్ రావడానికి గల కారణాలు, కడుపులో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల వెనుక ఉండే కారణాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి? సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, అతిగా తినడం, నిద్రకు సంబంధించిన అలవాట్లు వంటి అనేక అంశాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. కొందరిలో తరచుగా కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, తేన్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలు పదేపదే ఎందుకు వస్తున్నాయి? మన రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అనే విషయాలను డాక్టర్ వివరణలో తెలుసుకోండి. GERD అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కడుపులోని ఆమ్లం తిరిగి ఆహారనాళంలోకి రావడాన్ని గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) అంటారు. దీనివల్ల ఛాతీలో మంట, నోటిలోకి పుల్లటి ద్రవం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలకు, GERD వంటి పరిస్థితులకు మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం ముఖ్యం. ఈ సమస్యలకు కారణాలు ఏమిటి? ఎప్పుడు వైద్య పరీక్షలు అవసరమవుతాయి? అనే అంశాలపై ఈ వీడియోలో అవగాహన పొందవచ్చు. గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష ఎప్పుడు అవసరం? గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష అవసరం ఉండదు. అయితే, లక్షణాలు, వాటి తీవ్రత, వైద్యుడి పరిశీలన ఆధారంగా ఈ పరీక్షను సూచించవచ్చు. కడుపులో మంట లేదా అజీర్ణం ఎక్కువకాలం కొనసాగితే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ఆహారపు అలవాట్లు, నిద్ర, గట్ హెల్త్ ప్రాధాన్యం జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో ముఖ్యం. మన పేగుల్లో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుంది? గట్ హెల్త్‌ను కాపాడుకోవడానికి ఎలాంటి అలవాట్లు ఉపయోగపడతాయి? తరచుగా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు తరచుగా వస్తున్నా, కడుపులో మంట తగ్గకపోయినా, అజీర్ణం లేదా కడుపు ఉబ్బరం ఎక్కువకాలం కొనసాగినా స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించండి. తీవ్రమైన కడుపునొప్పి, రక్తవాంతులు, నల్లటి మలం, మింగడంలో ఇబ్బంది లేదా కారణం తెలియని బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే తక్షణ వైద్య పరిశీలన అవసరం. గ్యాస్ట్రిక్ సమస్యలకు గల కారణాలు, GERD లక్షణాలు, గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష అవసరం, ఆహారపు అలవాట్లు, నిద్ర, గట్ హెల్త్ గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు గారి వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. మరింత ఆరోగ్య సమాచారం, వైద్య నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య విషయాల కోసం TeluguOne Health‌ను అనుసరించండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.