Read more!

సోనియా ఢిల్లీ విడిచి వెళ్లనున్నారా?

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొంతకాలం పాటు దేశ రాజధానిని విడిచి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మకాం మార్చినా ఆమె విదేశాలకు వెళ్లరని, ఇండియాలోనే మరో ప్రాంతంలో ఉంటారని సమాచారం. సోనియా గాంధీ ఢిల్లీ విడిచి వెళ్లడానికి అక్కడి కాలుష్యమే కారణమని తెలుస్తోంది. సోనియా గాంధీ కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటం ఆమెకు ఇబ్బందిగా మారుతుందంట. అంతేకాదు ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా ప్రమాదకర స్థాయిలో ఉండటంతో సోనియా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు రాజధానిని విడిచి ఆమె చెన్నయ్ లేదా గోవాకు వెళ్ళనున్నట్లు సమాచారం.

 

సోనియా గాంధీ అనారోగ్య సమస్య ఇటీవల కొంచెం పెరిగిందని చెబుతున్నారు. ఢిల్లీ నగరంలో తీవ్రమైన చలి, వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతోంది. కాలుష్యం బాగా పెరిగిన కారణంగా శ్వాస సమస్యలు ఉన్నవారికి ఢిల్లీ వాతావరణం ప్రమాదకరంగా మారింది. దీంతో డాక్టర్ల సూచన మేరకు కొంతకాలం సమ శీతోష్ణ పరిస్థితులు ఉండే ప్రాంతంలో ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కొడుకు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీలతో కలిసి చెన్నయ్ నగర శివారు ప్రాంతం లేదా గోవాకు సమీపంలో కొంతకాలం ఉండేలా ప్లాన్ జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

 

అనారోగ్యం కారణంగానే సెప్టెంబరు నెలలో వైద్యులను కలవడానికి విదేశాలకు వెళ్ళింది సోనియాగాంధీ, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సైతం ఆమెహాజరుకాలేదు. గత జూలై నెలలోనూ అనారోగ్యం కారణంగా సోనియా గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సోనియాగాంధీకి ఢిల్లీ వాతావరణ సరిపడదని డాక్టర్లు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చలి, కాలుష్యం తదితర సమస్యలు ఢిల్లీ నగరంలో తీవ్ర స్థాయిలో ఉన్నందున పరిస్థితి అనుకూలంగా మారేంత వరకు ఢిల్లీకి బైట ఉండడమే శ్రేయస్కరమని సూచించారట. దీంతో కొన్ని వారాల పాటు దక్షిణాదినే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సోనియా గాంధీ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.