Read more!

రాజధాని నిర్మాణానికి అది మంచి ఆలోచనే

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 6వ తేదీన రాజధాని అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలని ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబరు 22వ తేదీన విజయదశమి పండుగ రోజు నుండి రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది. ఈలోగా రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న కొంత మంది రైతులను కలిసి మరో మారు ఒప్పించే ప్రయత్నాలు చేసిన తరువాత అప్పటికీ వారు నిరాకరించినట్లయితే, భూసేకరణ చట్టం ప్రయోగించి వారి నుండి భూములు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన రాజధాని నగరంలో కేవలం అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, వారికి నివాస సముదాయాల నిర్మాణానికి, రాజధానిలో మౌలికవసతుల కల్పనకి మాత్రమే అవసరమయిన నిధులు మంజూరు చేస్తుంది. విజయవాడ, గుంటూరు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ప్రకటించి ఉన్నందున ఆ పధకం క్రింద రాజధాని నగరానికి మరికొన్ని అధనపు నిధులు సమకూరవచ్చును. కానీ దాని చుట్టూ విస్తరించబోయే ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది.

 

ప్రధాన రాజధాని నగరమయిన అమరావతిని 3,705 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు సింగపూర్ సంస్థలు మాష్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నాయి. మొదటి దశ రాజధాని నిర్మాణానికి సుమారు రూ.6,000-9,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయబడింది. రాష్ట్ర ప్రభుత్వం ఊహిస్తున్న విధంగా అత్యాధునిక రాజధాని పూర్తయ్యేందుకు ఏడాదికి సుమారు రూ.6,000 కోట్ల చొప్పున 15ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని అంచనా వేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల కారణంగా అత్యాధునిక రాజధాని నిర్మించే విషయంలో ఏమాత్రం రాజీపడకూడదనే పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ప్రధాన రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు నిశ్చయించుకొన్నారు.

 

ఈ విధానంలో రాజధాని నిర్మించేందుకు అవసరమయిన ముందుకు వచ్చే నిర్మాణ సంస్థే అందుకు అవసరమయిన పెట్టుబడిని స్వయంగా సమకూర్చుకోవలసి ఉంటుంది. ఆ సంస్థ మాష్టర్ ప్లాన్ లో సూచించిన విధంగా అన్ని హంగులతో రాజధాని నిర్మాణం పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించవలసి ఉంటుంది. అందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పరిధిలో సేకరించిన 7,000 ఎకరాలలో తన అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన భూమిలో వ్యాపార సంస్థలకు, పరిశ్రమల ప్రధాన కార్యాలయాలు వగైరా సంస్థలకు లీజు మీద ఇచ్చి దాని నుండి వచ్చే ఆదాయాన్ని సదరు నిర్మాణ సంస్థకు ఫీజుగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆవిధంగా చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి అదనపు భారం పడకుండా ఉంటుంది. అంతే కాక తరచూ మారిపోయే రాజకీయ పరిస్థితుల వల్ల కానీ, ఆర్ధిక సమయాల వలన గానీ రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

రాజధానికి మాష్టర్ ప్లాన్ అందిస్తున్న సింగపూర్ ప్రభుత్వం ఇందుకోసం సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్,అసేండాన్ అనే మూడు సంస్థల పేర్లను సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం వీటిలో ఏదో ఒక సంస్థను లేదా వేరే ఇతర సంస్థను కానీ ఎంచుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇంత సుదీర్ఘకాలం పాటు అంత భారీ పెట్టుబడులు పెట్టడం కష్టం కనుక ఎవరి మీద భార వేయకుండా ఈ విధానం ద్వారా రాజధాని నిర్మించుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను మెచ్చుకోవలసిందే.