Read more!

IAS నోటిఫికేషన్లు ఎవరిస్తారు? విపక్షాలకు కేటీఆర్ వార్నింగ్ 

ఉద్యోగ నియామకాలపై కొంత కాలంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేయవద్దని చెప్పారు. కొందరు నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేయూ స్టూడెంట్ సునీల్‌ను రెచ్చగొట్టడం వల్లే చనిపోయాడని చెప్పారు కేటీఆర్. సునీల్‌కు బ్రెయిన్ వాష్ చేయడం వల్లే కేసీఆర్‌పై మాట్లాడారన్నారు. ఐఏఎస్ కావాల్సిన వాడినని బోడ సునీల్ వీడియోలో చెప్పాడు. ఐఏఎస్ భర్తీ చేసే నోటిఫికేషన్లు ఎవరిస్తారు? అని ప్రశ్నించారు. ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకుంటున్నారు...  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారు? అని కేటీఆర్ నిలదీశారు. 

‘‘మోడీ ఇచ్చిన కొలువులెన్ని? అమ్మిన సంస్థలెన్ని? నిరుద్యోగి సునీల్‌ను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించారు. దయచేసి యువతను గందరగోళానికి గురిచేయొద్దు. తెలంగాణ యువకులు క్షణికావేశానికి గురికావొద్దు. త్వరలోనే 50వేల ఉద్యోగాలకు ప్రకటన ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ఉత్తమ్ ఎక్కడున్నారని కేటీఆర్‌  ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఆయన్ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇదే చివరి హెచ్చరికని కేటీఆర్ తేల్చి చెప్పారు. 

వరంగల్ లో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  వరంగల్‌ నగరాభివృద్ధికి ఎన్నికోట్లు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తామిచ్చిన డబ్బుకు రెట్టింపు కేంద్రం నుంచి తీసుకురాగలరా? అని బీజేపీనిప్రశ్నించారు. ఉగాదికి ఒకరోజు ముందే నగరానికి తాగునీరు అందించామని మంత్రి చెప్పారు. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని.. వరంగల్‌కు మెట్రో నియో రైలు తీసుకొచ్చేది తామేనని కేటీఆర్‌ అన్నారు.