వివేకా కేసులో నిందితుడికి సునీత భర్తే బెయిల్ ఇప్పించారా? 

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ సంచలనంగా మారగా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరిచింది. 

వివేకా కేసులో అరెస్టైన దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి సీబీఐకి సంచలన లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్యకేసులో కొన్ని కోణాలపై విచారణ జరపాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. వివేకా హత్యకు అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి హస్తం ఉందన్నారు శివశంకర్ రెడ్డి. దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీడియాలో చర్చలు నడుస్తున్నాయన్నారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను నిర్దోషినని శంకర్‌రెడ్డి చెప్పారు.

‘నన్ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత పదేపదే సీబీఐ అధికారులను ఎందుకు కలిశారు? సునీత సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా? సునీత భర్తే లాయర్‌ను పెట్టి దస్తగిరికి బెయిల్‌ ఇప్పించారు. తన తండ్రిని చంపిన వ్యక్తికి సునీత భర్త ఎందుకు సహాయపడుతున్నారు? అని తన లేఖలో దేవిరెడ్డి శివ శంకర్‌ రెడ్డి ప్రశ్నించారు.