వీడని అనుమానాలు.. రాజధానిపై పూర్తి క్లారిటీ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

 

రాజధానిలో గత ఆరు నెలలుగా ఆగిన గవర్నమెంట్ హౌసింగ్ టవర్ ను పూర్తి చేయడంతో పాటు ల్యాండ్ పూలింగ్ స్కీం జోన్ లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాజధాని రైతులతో పాటు అమరావతి శ్రేయోభిలాషులకు ఈ వార్త ఊరట నిచ్చింది. జగన్ ప్రభుత్వ వైఖరితో రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేదా మరెక్కడికైనా తరలిపోనుందా అనే సందేహం ఆరుమాసాలుగా పైగా పలువురిని కలిచి వేస్తుంది. 

సీఎం ప్రకటనతో రాజధాని రియల్టీ ఒక్క సారిగా ఊపందుకోవాలి కానీ ఒక పక్క సానుకూల ప్రకటన చేస్తూనే మరో పక్క రాజధానికి అత్యంత కీలకమైన అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల నిర్ణయాన్ని నిపుణుల కమిటీ నివేదిక మేరకే తీసుకుంటామని పేర్కొనడంతో అమరావతి పై స్పష్టత రాలేదు. హౌసింగ్ టవర్లు, ఎల్పీఎస్ జోన్ ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం హర్షణీయమే.. రాజధాని అనే పదానికి సార్థకత చేకూర్చే ముఖ్యమైన శాసన సభ సచివాలయం హై కోర్టులపై నిర్ణయం తర్వాత తీసుకుంటామనడంతో వాటి సంగతి ఏమవుతుందోనన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కొందరు అనుమానిస్తున్నట్టుగా వీటన్నింటిని లేదా కొన్నింటిని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని నిపుణుల కమిటీ సూచిస్తే అమరావతికి కష్టకాలమేననని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే హౌసింగ్ టవర్ల పూర్తితో పాటు ఎల్పీఎస్ జోన్ లను అభివృద్ధి చేసిన అమరావతి రియల్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదనే వాదన ఉంది. 

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిలో నిర్మాణాలు నిలిచిపోయాయి.ప్లాట్ ల ధరలు భారీగా పతనమై దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజధాని రియల్టీకి సీఎం ఇటీవల చేసిన ప్రకటన కొంత మేలు చేకూర్చిన మాట వాస్తవం. దీంతో నెలలుగా నీరసించిన ఈ ప్రాంత రియల్టర్లు, ప్లాట్ ల యజమానులు తిరిగి తమకు మంచి రోజులు వచ్చినట్లేనని ఆశపడ్డారు. ప్లాట్ల కోసం పలువురు ఎంక్వయిరీ చేయటం మొదలెడతారని క్రమేపీ వాటి క్రయ విక్రయాలు ఊపందుకుంటాయని భావించారు. కానీ వారు అనుకున్నట్టుగా జరగడం లేదని క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఇందుకు కారణం అసెంబ్లీ హై కోర్టు సచివాలయం హెచ్ వోడీ కార్యాలయాలు ఎక్కడ వస్తాయో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసే వరకు ఆగడమే మేలని పలువురు భావిస్తున్నారు. 

ఇప్పటికిప్పుడు హడావిడి పడి రాజధానులు ప్లాట్ లను కొని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని నిరీక్షించే బదులు రాజధాని పై పూర్తి స్పష్టత వచ్చాకే అడుగు ముందుకేయడం శ్రేయస్కరమన్నది అభిప్రాయంగా చెబుతున్నారు.రాజధాని లోని తమ ప్లాట్ లను తక్కువ ధరకైనా విక్రయిద్దామనికుంటున్న వారు సైతం ఆ ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల సమయంతో పోల్చితే దాదాపు 40-50% శాతం పడిపోయిన ధరలు కూడా విక్రయించేందుకు సిద్ధమైన వారు, సీఎం ప్రకటనతో ధరలు గణనీయంగా పుంజుకుంటాయేమోనన్న ఆశతో ఉన్నారు. అసెంబ్లీ, హై కోర్టు, సెక్రటేరియట్ అమరావతిలోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే రేట్లకు రెక్కలు వస్తాయి అనుకుంటున్నవారు ఇంకొన్ని రోజులు ఆగడమే లాభమని భావిస్తున్నారు.