వైసీపీ తో అమీతుమీకి రఘురామకృష్ణంరాజు సిద్దమౌతున్నారా..!

నరసాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజుకు, వైసీపీ కి మ‌ధ్య ఏర్ప‌డిన గ్యాప్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల్లో లోపాల‌ను ఎత్తి చూపుతూ అయన కామెంట్ చేస్తే దానికి కౌంటర్ గా ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు రఘురామ రాజు ను టార్గెట్ చేయడం దానికి అయన అంతే ఘాటుగా జవాబివ్వడం తో వివాదం మరింత ముదిరింది. దీంతో సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజుకు వైసిపి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులకు అంతే ధీటుగా జవాబు చెపుతూ ఆ నోటీసులు అసలు న్యాయపరంగా చెల్ల‌వ‌ని, తనకు భీఫాం ఇచ్చిన పార్టీ వేరు, అలాగే షోకాజ్ నోటీసు ఇచ్చిన పార్టీ వేరు అంటూ రాజుగారు లా పాయింట్ లాగారు. అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ లెటర్ హెడ్ ను ఉపయోగించి ఎలా షోకాజ్ నోటీసు ఇస్తుందని అయన తన సమాధానంలో ప్రశ్నించారు.

త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో సొంత‌పార్టీ నేత‌లతోనే ప్రాణ‌హ‌ని ఉంద‌ని ఇప్ప‌టికే ఎస్పీ, లోక్ స‌భ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేసిన ఆయ‌న త్వరలో స్పీక‌ర్ ను, హోంశాఖ కార్య‌ద‌ర్శిని కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా త‌న ఎంపీ ప‌ద‌వికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుజాగ్ర‌త్త చర్యలో భాగంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కూడా క‌ల‌వ‌బోతున్నట్లు ప్ర‌చారం నడుస్తోంది.

ఇటు వైసిపి పార్టీ ఆయనతో అమితుమీ తేల్చుకోవ‌టానికి సిద్ధ‌ప‌డింద‌ని, త‌న ఎంపీ ప‌ద‌విని ర‌ద్దు చేయించే ఆలోచ‌న‌లో కూడా ఉంద‌ని భావిస్తున్న ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు దీనికి కౌంట‌ర్ గా కొన్ని అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్లు దేశ రాజధానిలో ప్ర‌చారం జోరుగా సాగుతుంది. అంతేకాకుండా త‌నకు బీజేపీ పెద్ద‌ల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని, ఆ ధీమా తోనే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారని, ఇదే అంశం జ‌గ‌న్ కు కూడా ఇబ్బందిక‌రంగా మారింద‌ని రాజకీయ విశ్లేష‌కుల అభిప్రాయం. మొత్తంగా ఈ వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాగా సమసి పోతుందో లేక చినికి చినికి గాలి వానగా మారుతుందో మరి వేచి చూడాలి.