కమల నాయకుడు ఎవరు?.. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్న కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గెలుపు గుర్రంగా ఎవరు నిలుస్తారనే ప్రశ్న సర్వత్రా ఉత్కంఠతను రేపుతోంది. బీజేపీ ధీమాతో ముందుకు వెళుతున్నా.. సర్వే రిపోర్టులు మాత్రం కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపుతున్నాయి. అదే విధంగా ఢిల్లీ ప్రజలకు తాను పెద్ద కొడుకు వంటి వాడినని తప్పకుండా తనకే మళ్లీ పట్టం కడతారని అంటున్నారు కేజ్రీవాల్. ప్రచారంలో మాత్రం ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకువెళుతోంది ఆప్. ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు ఆప్ నేతలు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8వ తేదీన జరగబోతున్నాయి. అయితే బీజేపీ మాత్రం సైలెంట్ గా పావులు కదుపుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపీ సీట్లను కైవసం చేసుకున్నట్టే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు బిజెపి ప్రచార వ్యూహాన్ని రచిస్తోంది. అయితే సీఎం అభ్యర్థి ఎవరనేది ఇప్పటికి కూడా తేలకపోవటం బీజేపీకి మైనస్ అని చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని అస్త్రంగా మార్చుకున్నారు ఆప్ నేతలు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షల్ని ఐదేళ్లలో నెరవేర్చినట్టుగా చెబుతున్నారు కేజ్రీవాల్. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లుగా ఆయన తెలిపారు. కరెంట్, మంచి నీటిని ఉచితంగా అందిస్తున్నట్టుగా తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం విషయంలో తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు కేజ్రీవాల్. ఇక గెలుపు ఢిల్లీ ప్రజల చేతిలోనే ఉంది.