నిరుద్యోగులకు శుభవార్త.. మడికొండలో ఐటీ పార్కుని ప్రారంభించనున్న కేటీఆర్

చారిత్రక ఓరుగల్లు మహానగరం ఐటీ రంగంలో చరిత్ర సృష్టించబోతోంది. హైదరాబాద్ తరవాత రాష్ట్రంలోనే రెండోవ అతిపెద్ద నగరంగా పేరున్న వరంగల్ సిటీ ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకోనుంది. సాంకేతిక రంగంలో జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలైన నిట్, కిట్స్ వంటి ఇంజనీరింగ్ విద్యాసంస్థలతో పాటు 100 కు పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న ఉద్యోగార్థులకు మంచి భవిష్యత్తు లభించనుంది. మడికొండలోని ఐటీ పార్క్ లో సైన్ టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలు తమ క్యాంపస్ లను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశాయి. ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఈ రెండు క్యాంపస్ లను ప్రారంభించనున్నట్లు ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో భాగంగా ఐటీ రంగ పురోగతికి ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యలో పరివర్తనపై ఏడవ అంతర్జాతీయ సదస్సు అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ క్యాంపస్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పరిశ్రమల అనుభవాన్నే విశ్వ విద్యాలయ బోధనతో అనుసంధానించడం ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టవుతుంది అన్నారు మంత్రి కేటీఆర్. 

తెలంగాణా సిద్ధించాక తాము అధికారం చేపట్టే నాటికి ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు క్షీణించాయని అయితే విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తమ ప్రభుత్వం తీసుకుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సంస్థను ఏర్పాటు చేశామని ప్రస్తుతం ఈ టాస్క్ గత ఐదేళ్లలో 680 కాలేజీలకు చేరుకుందన్నారు. నేడు వరంగల్ మడికొండలోని ఐటీ పార్క్ కూడా అందుకు వేదిక కానుందన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ విస్తరణకు మడికొండలోని ఐటీ పార్క్ ప్రారంభం కీలకం కానుంది. ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ కు సమీపంలో ఉండడం జాతీయ రహదారికి పక్కనే ఆనుకుని ఉండడంతో పాటు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వరంగల్ ను ఐటి హబ్ గా తీర్చిదిద్దడానికి దోహదపడతాయనే ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమను వరంగల్ నగర శివార్లలో దాదాపు 2000 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్నారు.