టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ గేర్

తెరాస పార్టీకి ఇప్పుడు సొంత గడ్డ తెలంగాణలోనే ఎదురుగాలి వీస్తున్నదా అన్న ప్రశ్నకు పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం ఇవ్వాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు, ఆ తరువాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట రాష్ట్రంలో విపక్షాలను ఖాళీ చేయడానికి అనుసరించిన వ్యూహమే ఇప్పుడు బూమరాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నదంటున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నేతలు ఒక్కరొక్కరుగా తిరిగి సొంతగూటికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఒక మేయర్ ఏకంగా అధికార టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారంటే అధికార పార్టీకి ఇది నిజంగా ఎదురు దెబ్బే. మేయర్ ఒటరిగా కాక ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వారిని పార్టీలోనే కొనసాగేలా చేయడానికి సాక్షాత్తూ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత రంగంలోనికి దిగి శతధా ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు.  

బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఇప్పటికే  తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. బడంగ్ పేట్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం చేశానని పేర్కొన్న  పారిజాత నరసింహారెడ్డి.. ఆ సేవలకు గుర్తింపు లేకపోగా  టీఆర్ఎస్ లో తనకు, తన వర్గం వారికి అడుగడుగునా అవమానాలూ, పరాభవాలే ఎదురౌతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇక   తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.  కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగ సొంత గూటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సీనియర్ నేతల నుంచి అడ్డంకులు ఎదురౌతున్నా, వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ ను వీడి తెరాస గూటికి చేరిన మాజీలతో టచ్ లోకి  వెళ్లి వారిని సొంత గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికి ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయనీ అందుకే నాటి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ నిర్మాణంలోని లోపాల కారణంగానే కాంగ్రెస్ మాజీలు సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారిని వెనక్కు రప్పించే విషయంలో రేవంత్ కృషిని తక్కువ చేసి చూపడం సాధ్యం కాదని కాంగ్రెస్ శ్రేణులే అంటున్నారు. టీఆర్ఎస్ చీఫ్ గా గతంలో ఎవరూ చేయని విధంగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ మాజీలను ఒప్పించి తిరిగి పార్టీలోనికి తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అవుతుండటంతో అధిష్థానం కూడా ఆయనను రాష్ట్రంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినా ఎవరికీ కూడా కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర వ్యవహారాలలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదనీ, ఇన్నాళ్లకు మళ్లీ అటువంటి స్వేచ్ఛ రేవంత్ కు ఇచ్చారనీ పరిశీలకులు కూడా ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.

 ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే ముందు ముందు  టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు సైతం హోం కమింగ్ అంటూ కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్య పోవలసిన పని లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.