తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత షురూ

నేలమట్టం కానున్న 132ఏండ్ల చరిత్ర చిహ్నం..
16మంది ముఖ్యమంత్రులు పరిపాలనాకేంద్రం..
భారీ భద్రత మధ్య బ్లాస్టింగ్..
పనులను పరిశీలిస్తున్న సిఎస్, డిజిపి..
జి బ్లాక్ కూల్చివేతపై  లేని స్పష్టత..
ఐదువందల కోట్ల వ్యయంతో కొత్త సచివాలయం..
మంత్రుల పేషీలతో పాటు శాఖల కార్యాలయాన్ని ఒకే చోట..
గత ఏడాదే శంకుస్థాపన చేసిన సిఎం..

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత ప్రారంభమైంది. ఉన్న ఆధునిక పరిపాలనకు అనుగుణంగా సచివాలయం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ  వాదన విన్న హైకోర్టు కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం అర్థరాత్రి నుంచి కుల్చివేత పనులు ప్రారంభించారు. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో  భారీ బందోబస్తు మధ్య జరుగుతున్న కూల్చివేత పనులను రాష్ట్ర సిఎస్, డిజిపి పర్యవేక్షిస్తున్నారు.  లిబర్టి నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే సి బ్లాకు(సమత)బ్లాక్ ను  భారీ యంత్రాలతో కూల్చి వేస్తున్నారు .కంట్రోల్ బ్లాస్టింగ్ పద్ధతిలో కూల్చివేత పనులు జరుగుతున్నాయి.

132 ఏండ్ల ఘన చరిత్ర
నిజాం నవాబు ల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి ెందిన సచివాలయానికి 132 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన నిజాం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు పరిపాలనా కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలువురి ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే పాలనా కొనసాగించారు.

132ఏండ్ల కాలంలో 10బ్లాకుల నిర్మాణం జరిగింది. ఎ బ్లాక్,  డి బ్లాక్, హెచ్ బ్లాక్ ల ను గతంలోనే కూల్చివేసి నూతనంగా నిర్మించారు. ఎల్, బి బ్లాక్‌ , సి బ్లాక్‌లను కొద్ది మార్పులతో వినియోగించారు. జె, కె బ్లాక్‌లు - వీటిలో ఏ మార్పులూ చేయలేదు. అయితే ఈ బ్లాక్ లన్నింటి మధ్యలో ఉన్న జి బ్లాక్ చారిత్రకమైన కట్టడం.సచివాలయ సముయదాంలోని  అతిపురాతన మైన జి బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మించారు. దీనిని సైఫాబాద్ ప్యాలెస్ గా పిలుస్తారు. 132 ఎండ్ల చరిత్ర ఉన్న ఈ భవనాన్నికూల్చివేయకుండామ్యూజియంగా మార్చాలని చరిత్రకారులు కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుందో ఇంకా స్పష్టం చేయలేదు.

ఐదు వందల కోట్ల అంచనావ్యయంతో...
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక ప్రజా పరిపాలన కు అవసరమైన అన్ని హంగులతో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం ప్రతిపాదన సిద్ధం చేసింది. కొత్త సచివాలయ నమూనాను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఈ ఆధునిక సచివాలయ నిర్మాణ వ్యయం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు. సూమారు ఆరు లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో అన్ని శాఖలకు కేటాయింపులు ఉండేలా డిజైన్ పూర్తి చేస్తున్నారు. మంత్రుల కార్యాలయాలతో పాటు ఆయా సంబంధిత శాఖల కార్యదర్శుల కార్యాలయాలు,  సెక్షన్లు, మీటింగ్ హాల్స్, వీడియో కాన్ఫరెన్సు హాల్స్ అన్ని కలిపి ఒకే చోట వచ్చేలా కొత్త సచివాలయం నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

గత ఏడాదే శంకుస్థాపన
కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ సముదాయం నిర్మించాలని గత ఏడాదేప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త సచివాలయం భవనానికి శంకుస్థాపన జరిగింది. సచివాలయలోని కొన్ని కార్యాలయాలను బిఆర్కె భవన్ లోని మార్చారు. మరికొన్ని కార్యాలయాలను సంబంధిత డైరెక్టరేట్ కార్యాలయాల్లోకి మార్చారు. అయితే ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత, ప్రతిపక్షాల పై కోర్టుకు వెళ్లడం ఇలాంటి అంతరాలతో సచివాలయం కూల్చివేత కొత్త నిర్మాణం పనులు ఆగాయి. తాజాగా హైకోర్టు ప్రభుత్వ వాదన విన్న తర్వాత పాత సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించింది. ఇందులో ఉన్న చారిత్రాత్మకమైన జి బ్లాక్ పై మాత్రం సందిగ్ధం అలాగే ఉంది.