తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హక్కును కాలరాసేవిధంగా రాష్ట్ర‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు..10 నిమిషాల్లో రిపోర్టులు వచ్చే పరీక్షలు చేయాలని ఆదేశించింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్నిపరీక్షలు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారు? జూన్ 26న హైదరాబాద్‌లో పరీక్షలు ఎందుకు నిలిపివేశారో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. సెంట్రల్  టీం ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశాలను ఈ నెల 17న తెలపాలని హైకోర్టు పేర్కొంది. జులై 17న పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, దానిపై సంతృప్తి చెందకపోతే… జూన్ 26న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.