విజయవాడలో సామూహిక మత మార్పిడి.. సాక్ష్యం చూపించి మరీ పవన్ ఫైర్

 

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో క్రైస్తవ మత మార్పిడులు జరగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పున్నమి ఘాట్ వద్ద స్నానాలు చేయించిన పాస్టర్లు పెద్ద ఎత్తున మత మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి మత ప్రచారం చేసుకుంటూ 47 మందిని మతం మార్పించారు. అంతేకాదు, పున్నమి రిసార్ట్స్ గేట్ ఆర్చికి మేరీమాత విగ్రహాన్ని పెట్టారు. ఇంద్రకీలాద్రికి అత్యంత సమీపంలో ఇలా అన్యమత ప్రార్ధనలు, మత మార్పిడి జరగడం వివాదాస్పదమవుతోంది. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర మతాల వారు ప్రచారం చేసుకోవడం, మార్పిడులకు పాల్పడటం నిషేదం ఉన్నా పాస్టర్లు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అమ్మవారి ఆలయం వద్ద ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇటీవల తిరుమలలో కూడా అన్యమత ప్రచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుపతిలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని స్థానికులు వాపోతున్నారని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై కూడా తన వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించిందని, మాటలను వక్రీకరించడమనేది వైసీపీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అండతో ఏపీలో సామూహిక మత మార్పిడులు జరుగుతున్నాయని పవన్ నిలదీశారు. మత మార్పిడుల మీద వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలి. లేదంటే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. అత్యధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీది. పాలన సరిగ్గా ఉండాలి అని పవన్ అన్నారు. అంతేకాదు, సామూహిక మత మార్పిడి జరుపుతోన్న వీడియోను కూడా పవన్ మీడియా ద్వారా విడుదల చేసారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మత మార్పడిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.