కేసీఆర్ కు చుక్కలు చూపిస్తోన్న నేషనల్ మీడియా

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కైనా... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికైనా... తెలుగు మీడియా అంటే చులక భావం... మీడియా సమావేశాల్లో తెలుగు జర్నలిస్టులు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారు... నీకేం తెలుసంటూ గద్దిస్తారు... తెలంగాణ కేసీఆర్ అయితే కొట్టడం ఒక్కటే తక్కువన్నట్లుగా మాట్లాడతారు... కేసీఆర్ గద్దింపు, బెదిరింపులతో జర్నలిస్టులంతా మౌనవ్రతం పాటిస్తారు... ఏ ప్రెస్ మీట్ లో చూసినా ఇదే ధోరణి కనిపిస్తుంది... అదే నేషనల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నిస్తే మాత్రం గమ్మున సమాధానమిస్తారు... ఎంత ఇబ్బంది కలిగించే ప్రశ్న అడిగినా సార్ సార్ అంటూ గౌరవిస్తూ మాట్లాడతారు. అదే, తెలుగు జర్నలిస్టుల మీద అయితే అమాంతం విరుచుకుపడతారు. బెదిరిస్తారు... గద్దిస్తారు. దాంతో, కేసీఆర్ ను ప్రశ్నించడానికి తెలుగు జర్నలిస్టులు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక, తెలుగు మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, తప్పు జరిగినా, కేసీఆర్ ను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. అయితే, నేషనల్ మీడియా అలా కాదు. ఇష్యూ ఏదైనా ఏకిపారేస్తాయి. 

ఇక, దిశ రేప్ అండ్ మర్డర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎంపీల తీరును జాతీయ మీడియా ఎండగట్టింది. కేసీఆర్ ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించింది. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని వివాదాస్పద వ్యాఖ్యలను ఎండగట్టింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ తీరును కూడా ప్రశ్నించింది. ఇలా, తెలంగాణ ప్రభుత్వ తీరును, సీఎంను, మంత్రులను ఏకిపారేసిన నేషనల్ మీడియా... ఢిల్లీ వచ్చిన కేసీఆర్ ను చుట్టుముట్టింది. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ ప్రశ్నించి నిలదీసింది. అయితే, మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే కేసీఆర్ వెళ్లిపోయారు. అలా, సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడాన్ని కూడా జాతీయ మీడియా ఏకిపారేసింది. దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే... ఆ కుటుంబాన్ని పరామర్శించని కేసీఆర్.... ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం మాత్రం ఢిల్లీ వచ్చారంటూ ఘాటుగా కథనాలు ప్రసారం చేశాయి. దాంతో, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురు కావడంతో సీఎంతోపాటున్న టీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు.