తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటాడు

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 29 ఏళ్ల పోలీసు హెడ్ కానిస్టేబుల్ మోదుకూరి తులసి చైతన్య నాన్ స్టాఫ్ గా ఎనిమిదిన్నర గంటల పాటు ఈది తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటాడు. భారత్, శ్రీలంకను వేరు చేసే పాక్ జలసంధిని అత్యంత వేగంగా అంటే కేవలం 8.25 గంటల్లో ఈది రికార్డు సృష్టించాడు. దీంతో, ఇంతకు మునుపు చెన్నై యువకుడు రాజేశ్వరప్రభుత్ నెలకొల్పిన జాతీయ రికార్డును మనోడు బ్రేక్ చేసినట్లైంది. ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది స్ఫూర్తితో తానీ సాహసం చేసినట్లు చైతన్య చెప్పాడు. ఇందుకు గానూ, ఆరు నెలలుగా ప్రత్యేకంగా సాధన చేసినట్లు చెప్పాడు. శ్రీలంకలోని తలైమన్నార్ హార్బర్ వద్ద ఆదివారం ఉదయం ఈత మొదలెట్టిన తులసి చైతన్య, 32 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.25 గంటల వ్యవధిలో ఈది ఉదయం 9.25 గంటలకు తమిళనాడులోని ధనుష్కోటి వద్దకు చేరుకున్నాడు. స్పోర్ట్స్ అంటే విపరీతమయిన ఆసక్తి ఉన్న చైతన్య, స్పోర్ట్స్ కోటాలోనే పోలీసు ఉద్యోగాన్ని పొందాడు. ఒక తెలుగు వాడు చేసిన ఈ సాహసం, మనందరికీ స్ఫూర్తి అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.