నిన్నటివరకు కలిసి ఉన్నవారు ఇప్పుడు తలో దారిన పడుతున్నారా..?

 

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉద్యోగ సంఘాల జేఏసీ లో చిచ్చుపెట్టినట్లు కన్పిస్తోంది. నిన్న మొన్నటి వరకు కలిసి అడుగులు వేసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఇప్పుడు తలో దారిన నడిచేందుకు సిద్ధమవుతున్నారట. టీఎన్జీవో కార్యవర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తీర్మానం చేసిన తర్వాత జేఏసీ లోని కొన్ని సంఘాలు మద్దతుపై పునరాలోచనలో పడ్డాయని సమాచారం. 

నిజానికి ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడంతో సమ్మెకు మద్దతు తెలపాలంటూ ఇతర ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర సంఘాల నాయకత్వం మీద ఆయా సంఘాల కింది స్థాయి ఉద్యోగులు ఒత్తిడి పెంచారు. ఈ నేపధ్యంలో టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతివ్వాలని నేతలంతా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని టీఎన్జీవోలు తప్పు పట్టారు. టీ.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. తాము సైతం ఉద్యమించడానికి ఇదే సరైన సమయమని ఆర్టీసీ సమ్మెను అవసరమైతే సకల ఉద్యోగుల సమ్మెగా మార్చాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇదే విషయాన్ని సమావేశానంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. 

ఇంత వరకు బాగానే ఉంది.. అయితే గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం వాయిదా పడుతోంది. ఎవరికి వారుగా ఉద్యోగ సంఘాలు సమావేశాలు పెట్టుకొని తీర్మానాలు చేసుకున్నారు కానీ, జెఎసి సమావేశం మాత్రం పదేపదే వాయిదా పడటంతో అందులో నేతల మధ్య అంతర్గత విభేదాలు బయట పడుతున్నాయి. ఆర్టీసి ఉద్యోగులకు మద్దతు తెలపడం సకల ఉద్యోగుల సమ్మెకు సిద్ధమంటూ రవీందర్ రెడ్డి ప్రకటించడంతో జేఏసీ లోని మరో సంఘం టీజీవోలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఆ సంఘానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌరవాధ్యక్షుడిగా ఉండటం వల్లే వారు ఆలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆ సంఘానికి చెందిన ఓ ముఖ్య నేత గచ్చిబౌలిలో నిబంధలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేస్తున్నారని అది కూడా ఓ కారణమని చెప్తున్నారు. ఈ పరిస్థితుల వల్లే టీజీవోలు గత రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు టీజీవోల వ్యవహారంపై టీఎన్జీవోలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె తరువాత వ్యవహరించిన తీరుతో ఇప్పటికే కొంత అప్రతిష్ట పాలయ్యామని, ఉద్యోగుల్లో సైతం సంఘం పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే వారికి మద్దతు ఇవ్వాల్సిందేనని టీఎన్జీఓలు నిర్ణయించారు. ఇక తమ సమస్యల మీద పోరాటానికి కూడా ఇదే సరైన సమయమని టీఎన్జీవోలు భావిస్తున్నారు. అందుకే మొదట సీఎస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత ఫలితం లేకపోతే సమ్మెకు వెళ్లడానికి సిద్ధం కావాలని కార్యవర్గ సమావేశంలో నేతలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యం లోనే ఆ సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సకల ఉద్యోగుల సమ్మెకు సమాయత్తం అవుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు.

అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విషయంలో టీజీవో లు గ్రూప్-1 అధికార సంఘం కొంత గందరగోళంలో ఉన్నట్టు ఉద్యోగ జేఏసీలో చర్చ జరుగుతోంది. ఇక టీఎన్జీఓలు మాత్రం ఈ పరిణామాన్ని ముందే అంచనా వేశారట, టీజీవోలు కలిసి రాకపోయినా సమ్మెకు సిధ్ధం కావాలని తమ కేంద్ర నాయకత్వాన్ని టీఎన్జీఓలు గట్టిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒక లక్షా ఎనభై వేల సభ్యత్వంతో రాష్ట్రంలో తమదే అతిపెద్ద ఉద్యోగ సంఘంగా ఉందని కేవలం ఐదు వేల మంది ఉన్న టీజీవోల మాట విని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవద్దని టీఎన్జీఓ జిల్లాల బాధ్యులు డిమాండ్ చేస్తున్నారట. ఆ సంఘాలు జేఏసీ నుంచి బయటకు వెళ్లినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారట. ఉపాధ్యాయులు నాలుగో తరగతి ఉద్యోగులు సహా కలిసి వచ్చే అన్ని సంఘాలతో సమ్మెకు వెళ్లాలని గట్టిగా కోరుతున్నారట. అన్ని జిల్లాల నాయకుల నుంచి ఒకే అభిప్రాయం వ్యక్తమవడంతో టీఎన్జీఓ కేంద్ర నాయకత్వం కూడా అందుకు సన్నద్ధం అయినట్లు ఆ సంఘం నాయకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఉద్యోగ జేఏసీ సమావేశానికి అడ్డంకులు సృష్టించిన టీజీఓలు సీఎస్ తో సమావేశానికి హాజరయ్యారు. వివిధ ఉద్యోగ సంఘాలు తమ కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాలతో వినతి పత్రాన్ని తయారు చేసి నేతలంతా కలిసి సిఎస్ కు అందజేశారు. తర్వాత మీడియా సమావేశంలో ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ టీఎన్జీఓ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్దమని ప్రకటించారు. ఇక టీజీఓ అధ్యక్షురాలు మమత మాత్రం ఆ స్థాయిలో మాట్లాడక పోవడం వారి వైఖరిని తెలియజేస్తోందన్న వాదనలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత సీఎం మాట ఇచ్చినట్టుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే టీజీఓలు కలిసొచ్చినా, రాకపోయినా తాము మాత్రం సమ్మెకు వెళ్లాలని టీఎన్జీఓలు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.