ఒకవైపు అవినీతి నిరోధానికి కాల్ సెంటర్స్... మరోవైపు అక్రమార్కులకు కీలక పదవులు

 

ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట... అధికారంలోకి వచ్చాక మరో మాట... ఇది దాదాపు అన్ని పార్టీలకూ వర్తిస్తుంది... నీతి నిజాయితీ, విశ్వసనీయత, పారదర్శకతంటూ చెప్పుకునే వైసీపీకి ఇదేమీ మినహాయింపు కాదు. అనేక విషయాల్లో అన్ని పార్టీల్లాగే జగన్ పార్టీ కూడా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా... దేన్నయితే తప్పు అన్నారో... అవినీతి అన్నారో... అధికారంలోకి వచ్చాక... దాన్నే ఒప్పు అంటున్నారు... ఏ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారో... ఇప్పుడదే కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. పట్టిసీమలో వందల కోట్ల అవినీతి జరిగిందన్నారు... ఇఫ్పుడదే కంపెనీకి పోలవరం పనులు అప్పజెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రుజువులు ఉన్నాయి. ఇలాంటిదే మరొకటి ఇప్పుడు బయటికొచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా ...అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారో... ఇప్పుడదే కంపెనీకి లేదా వ్యక్తి చేతుల్లో మళ్లీ ప్రాజెక్టును పెడుతున్నారు.

ఏపీ మెడిటెక్ జోన్ (ఏఎంటీజెడ్)లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. వైసీపీ గతంలో ఆరోపించినవిధంగానే పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని తేలింది. అంతేకాదు పలువురు ఉన్నతాధికారులతోపాటు ఈ ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జితేంద్రశర్మ పాత్ర కూడా ఉందని నిగ్గుతేల్చారు. అంతేకాదు, విజిలెన్స్ విచారణకు సహకరించని జితేంద్రశర్మ.... మెడిటెక్ జోన్ ఫైళ్లను అధికారులకు ఇఛ్చేందుకు నిరాకరించారు. అయినప్పటికీ విచారణాధికారులు అక్రమాలను నిగ్గుతేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో మెడిటెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మను ఈ ప్రాజెక్టు నుంచి తొలగిస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

ఇంతవరకూ బాగానే ఉంది, అయితే ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ, ఎవరినైతే మెడిటెక్ జోన్ ప్రాజెక్టు నుంచి తప్పించిందో...  మళ్లీ ఆ వ్యక్తి(జితేంద్ర శర్మ)నే ఏఎంటీజెడ్ ఎండీ అండ్ సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో, అప్పటివరకు జితేంద్ర శర్మ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికిచ్చి, అతని బ్యాంకు ఖాతాలు సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు కంగుతిన్నారు. జితేంద్రశర్మకు మళ్లీ అదే సంస్థకి ఎండీ అండ్ సీఈవోగా పోస్టింగ్ ఇవ్వడంతో సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలు కూడా తెరుచుకోనున్నాయని అంటున్నారు. అయితే, ఒకవైపు అవినీతి నిరోధానికి టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతూ... మరోవైపు అవినీతిపరుడంటూ విజిలెన్స్ పక్కా రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తికి... మళ్లీ కీలక పోస్టింగ్ ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేమీ మతలబు... చోద్యమంటూ చర్చించుకుంటున్నారు.