అంజనాదేవి


నైమిశారణ్యం - 17

 

 


తల్లిదండ్రులకు... మంచిపేరు వచ్చినా.. చెడ్డపేరు వచ్చినా., తమ సంతానంవల్లే. కులములో నొకడు గుణవంతుడుండెనా కులము వెలయు వాని గుణముచేత  అని అంటాడు ‘యోగి వేమన’. నిజమే మరి. శ్రీరాముని కారణంగా, మొత్తం సూర్యవంశ పేరుప్రతిష్ఠలు దశదిశా వ్యాప్తమయ్యాయి. దుర్యోధనుని కారణంగా మొత్తం కురువంశ వృక్షమే కూకటివేళ్ళతో కూలిపోయింది. అలాగే గరుత్మంతుని కారణంగా మొత్తం పక్షిజాతికే గౌరవస్థానం దక్కింది. ఇక., ఆంజనేయుని కారణంగా మొత్తం వానరజాతికే విశేషగౌరవం దక్కింది. అటువంటి మహనీయలను జాతికి అంకితం చేసిన మాతృమూర్తులను తలుచుకోవడం.,భరతజాతి బిడ్డలుగా మన కర్తవ్యం. నేడు ఆంజనేయుని జన్మదినం. తను పుడుతూనే తన తల్లికి ఆనందం  కలిగించాడు....మరోతల్లి సీతమ్మ శోకాన్ని దూరంచేసాడు. మరి అట్టి మహనీయునికి జన్మనిచ్చిన ‘అంజనాదేవి’ చరిత్రే నేటి ‘నైమిశారణ్య’ ఇతివృత్తం.

అంజనాదేవి...అహల్య, గౌతముల కుమార్తె అనే ఒక విచిత్రమైన కధ ప్రచారంలో ఉంది. ప్రజలు కూడా ఈ విచిత్ర కథనే విశ్వసిస్తున్నారు. అదే బాధాకరం. రామాయణంలోని పాత్రల సృష్టికర్త వాల్మీకిమహర్షి. ఆయన చెప్పినదే సత్యం. అది వదిలేసి చిత్ర విచిత్రములైన అసత్యాల వెంట పరుగులు తీయడం అవివేకం కాదా. కనుక వాల్మీకిమహర్షి చెప్పిన ‘అంజనాదేవి’ అసలు కధ ఏమిటో తెలుసుకుందాం. పుంజికస్థల అనే అప్సరస, శాపకారణంగా..అంజనాదేవిగా జన్మించిన  ఓ వానరస్త్రీ. కుంజరుడనే ఓ వానరుని కుమార్తె. సంతాన కాంక్షతో తపస్సు చేస్తే పుట్టిన వానరకాంత ఈ ‘అంజనాదేవి’. ఈమెకు యుక్తవయస్సు రాగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు కుంజరుడు. ఆ అన్వేషణలో తారసపడ్డవాడే ‘కేసరి’ అనే వానరవీరుడు.

ఈ కేసరి..ప్రభాసతీర్థారణ్య  ప్రాంతాలలో సంచరించే ఓ వానరవీరుడు. నిజానికి అతని పేరు ‘కేసరి’ కాదు. అతని అసలు పేరు ఎవరికీ తెలియదు కూడా. అతనికి ‘కేసరి’ అనే పేరు రావడానికి కారణం ఉంది. ప్రభాసతీర్థారణ్యాలలో ఎందరో మునులు తపస్సు చేసుకుంటూండేవారు. ఈ కేసరి, ఆ మునులకు సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. ఆ రోజులలో ‘శంఖము, శబలము’ అనే రెండు ఏనుగులు తరచు ఆ మునులను బాధిస్తూండేవి. కేసరి ఆ రెండు ఏనుగులను చంపి మునులకు ఆనందం కలిగించాడు. ఏనుగును చంపగలిగేది సింహం ఒక్కటే. కేసరి అంటే సింహం అనే అర్థం ఉంది. అందుకే...ఆ రెండు ఏనుగులను చంపిన కేసరి ప్రతాపానికి సంతసించిన భరద్వాజమహర్షి అతనికి ‘కేసరి’ అని పేరుపెట్టి.., ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. సకలసద్గుణవంతుడు, అమితబలవంతుడు, కామరూపుడు  అయిన కుమారుడు కావాలని వరం కోరుకున్నాడు కేసరి.

ఈ కేసరి ఘనత విన్న కుంజరుడు తన కుమార్తె అయిన అంజనాదేవిని, కేసరికి ఇచ్చి వివాహం జరిపించాడు. అంజన, కేసరుల సంసారయాత్ర సుఖంగా సాగుతోంది. అంజనాదేవి పుట్టుకతో వానరస్త్రీ అయినా..అపురూప సౌందర్యవతి. ఒకరోజు ఆమె అందంగా అలంకరించుకుని హిమాలయ ప్రాంతాలలో విహరిస్తూంటే.. ఆమె అందాన్ని చూసి మోహపరవశుడైన వాయువు ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. అది తెలిసి, అంజనాదేవి కోపంతో ‘ఎవరురా..నా పాతివ్రత్యాన్ని భగ్నం చేస్తున్నది’ అని గర్జించింది. అప్పుడు వాయువు ప్రత్యక్షమై..‘దేవీ...దేవకార్యార్థమై నిన్ను కౌగిలించుకునే సాహసం చేసాను. నా దగ్గర ఉన్న పరమేశ్వర తేజోబీజాన్ని ధరించగల శక్తి నీకు మాత్రమే ఉన్నదని  గ్రహించి., ఆ బీజాన్ని నీ గర్భక్షేత్రంలో నిక్షిప్తం చేయాలనే సదుద్దేశంతోనే, నిన్ను ఆలింగనం చేసుకున్నాను. ఈ కార్యంవల్ల నీ పాతివ్రత్యానికి ఏమాత్రం భంగం కలుగదు. నీకు మహాబలవంతుడు, కామరూపుడు, కారణజన్ముడు అయిన కుమారుడు కలుగుతాడు. అతని కారణంగా మీ దంపతుల జన్మలు చరితార్థమవుతాయి’ అని పలికి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది అంజనాదేవి. కారణజన్మడైన కుమారుడు కలుగబోతున్నందుకు కేసరికూడా సంతోషించాడు. అలా అంజనాదేవి, కేసరులకు జన్మించినవాడే ‘ఆంజనేయుడు’. ఈ కథను కిష్కింథాకాండ చివరిభాగంలో జాంబవంతునిచేత ., హనుమంతునికి చేప్పిస్తాడు వాల్మీకిమహర్షి. అంజనా గర్భసంభూతుడైన ఆంజనేయుడు ఎన్ని మహత్కార్యాలు చేసాడో మనందికీ తెలిసినదే. అట్టి మహనీయునకు జన్మనిచ్చిన ఆ అంజనామాతకు శిరసు వంచి నమస్కరిస్తూ...ఆమె పుత్రునకు జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం.

అంజనానంద వీరమ్ - జానకీ శోకనాశనమ్
కపీశమక్షహన్తారమ్ - వన్దే అనిలాత్మజమ్  
 

 

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం  


More Purana Patralu - Mythological Stories