పెప్పర్‌ స్ప్రే కథ వింటారా!

 

 

నిర్భయ హత్యకేసు గురించి కొత్తగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదు. రాజధాని నడిబొడ్డున సాగిన ఆ దౌర్జన్యకాండ దేశాన్ని తలదించుకునేలా చేసింది. నేరం జరిగిన తర్వాత న్యాయం చేసేందుకు ఎన్ని చట్టాలు ఉంటే మాత్రం ఏం ప్రయోజం? ముందు ఆ నేరాన్ని అడ్డుకునేలా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రచారం మొదలైంది. అందులో భాగంగా పెప్పర్‌ స్ప్రే గురించి తరచూ వినపడుతోంది.

 

ఇంతకీ ఈ పెప్పర్‌ స్ప్రే కథ ఏంటి?
ఇదీ చరిత్ర!


శత్రువుని కాసేపు షాక్‌కు గురి చేయడానికి కారాన్ని వాడే అలవాటు, వేల సంవత్సరాల నుంచే ఉంది. కానీ అది పెప్పర్‌ స్ప్రే రూపంలోకి వచ్చి నలభై ఏళ్లు కూడా కావడం లేదు. అప్పట్లో క్రూరజంతులు ఏవన్నా వెంటపడుతుంటే వాటి నుంచి తప్పించుకోవడానికి దీన్ని వాడేవారు. కానీ జంతువులకంటే మదమెక్కిన మనుషుల నుంచి తప్పించుకోవడం మరింత ప్రమాదకరం అని తేలడంతో... దాన్ని సాటి మనుషుల నుంచి ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగించసాగారు.


ఇదీ ఫలితం!


నిజానికి పెప్పర్‌ స్ప్రే అంటే కారం కలిపిన నీరు కాదు. కానీ మిర్చికి ఇది దగ్గరి చుట్టమే! Capsicumగా పిల్చుకునే మిర్చిజాతి మొక్కల నుంచి తీసే Capsaicin అనే రసాయనంతో ఈ స్ప్రేను తయారుచేస్తారు. ఇది మొహం మీద పడిన వెంటనే... దాడి చేస్తున్నవారు అసంకల్పితంగా కళ్లు మూసుకోక తప్పదు. వాళ్లు కళ్లు నులుముకునేకొద్దీ ఇది మరింతగా శరీరంలోకి చొచ్చుకుపోతుంది. ఊపిరి పీల్చుకునేకొద్దీ మరింతగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాంతో మనిషి ముందుకి వంగిపోయి తీవ్రంగా దగ్గడం మొదలుపెడతాడు. దాదాపు పావుగంట పాటు అసలు మాట్లాడటం కూడా సాధ్యం కాదు. పెప్పర్‌ స్ప్రేకి వాపు కలిగించే గుణం (inflammation) ఉంటుంది. కాబట్టి కనురెప్పలు వాచిపోయి తాత్కాలికంగా దృష్టి కనిపించదు. ఊపిరితిత్తులు వాచిపోయి ఊపిరి కూడా కష్టమైపోతుంది.


ప్రాణాంతకం కాదు!


పెప్పర్‌ స్ప్రే చల్లాక అవతలి మనిషి కాస్త కోలుకోవడానికి ఓ గంట పడుతుంది. ఈలోగా అవతలి మనిషి నుంచి తప్పించుకుని పారిపోవడానికో అతన్ని అదుపులో తీసుకోవడానికో కావల్సినంత సమయం చిక్కుతుంది. గంటలు గడిచేకొద్దీ అతను నిదానంగా సాధారణ స్థితికి వచ్చేస్తాడు. అయితే ఆస్తమా, గుండెజబ్బులు వంటి సమస్యలలో మాత్రం ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. మరీ కళ్ల మీదే పెట్టి స్ప్రే చేయడం వల్ల కంటిచూపు దెబ్బతినవచ్చు.


జాగ్రత్తలు:


పెప్పర్‌ స్ప్రే నీటిలో కరగదు. కాబట్టి అది ఒంటి మీద పడ్డాక నీటితో కడుక్కొని ప్రయోజనమే లేదు. బేబీ షాంపూతో కడుక్కోవడం వల్లే కాస్త ఉపశమనం లభిస్తుందట. కళ్లని మాటిమాటికీ ఆర్పే ప్రయత్నం చేయడం వల్ల, కంట్ల పడ్డ స్ప్రే కూడా నీరులా కారిపోయే అవకాశం ఉంది. నిదానంగా, గాఢంగా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేయడం వల్ల ఊపిరితిత్తులూ కోలుకుంటాయి. రక్షణ కోసం దాచుకున్న పెప్పర్‌ స్ప్రే పొరపాటున మన కంట్లోనే పడే ప్రమాదం ఉంది కాబట్టి, కంపెనీలు చాలా జాగ్రత్తగా దాన్ని రూపొందిస్తాయి. కీచెయిన్‌ లాగితేనో, మూత పూర్తిగా తిప్పితేనో అందులో స్ప్రే బయటకి వచ్చేలా చర్యలు తీసుకుంటాయి.


మన దగ్గర చట్టబద్ధమే!


ఇదీ పెప్పర్‌ స్ప్రే కథ. చాలా దేశాలలో కేవలం పోలీసులు మాత్రమే ఈ పెప్పర్‌ స్ప్రేని ఉపయోగించే అవకాశం ఉంది. అదృష్టవశాత్తూ మన దేశంలో దీన్ని ఎవరైనా ఆత్మరక్షణ కోసం వాడవచ్చు. పిచ్చిపట్టిన జంతువులు దగ్గర్నుంచీ, జంతుస్వభావం ఉన్న మనుషుల వరకూ ఎవరి నుంచైనా రక్షణ పొందేందుకు దీన్ని ఉపయోగించవచ్చు. వీటి ఖరీదు కూడా ఏమంత ఎక్కువ కాదు. పైగా ఆన్‌లైన్ ద్వారా చాలా తేలికగా దొరుకుతాయి కూడా!


పెప్పర్‌ స్ప్రే ఒక ఆయుధం లాంటిది. కాబట్టి అత్యవసరమైన సందర్భాలలో మాత్రమే దీన్ని ప్రయోగించాలన్న విచక్షణ చాలా అవసరం. ఎలా ఉంటుందో చూద్దామని మన మీదే ప్రయోగించుకోవడమో, పిల్లలకు దగ్గరగా ఉంచడమో, క్షణికోద్రేకానికే దాన్ని ప్రయోగించడమో చేస్తే మాత్రం చిక్కులు తప్పవు.


- నిర్జర