20 వేల జీవితాలను మార్చిన తులసి ఆపా!

 

ఒడిషాలోని మారుమూల గ్రామం. ఆ ఊరే కాదు... దాని చుట్టపక్కల వంద కిలోమీటర్ల వరకూ కటిక దారిద్ర్యం రాజ్యమేలుతూ ఉంటుంది. అక్కడి చిన్నాపెద్దా అందరూ కలిసి పనిచేసినా కూడా కుటుంబం ఆకలి తీరని పరిస్థితి. అలాంటి చోట చదువుకు చోటేది. మార్పుకు అవకాశం ఏది. కానీ చదువు సాధ్యమనీ, ఆ చదువుతోనే మార్పు కూడా వస్తుందని ఒకరు నమ్మారు. తన జీవితాన్ని సైతం పణంగా పెట్టి ఆ మార్పుని సాధించారు. ఆమే తులసీ ముండా!

తులసీ ఒడిషాలోని కైంషి అనే చిన్న ఊరిలో 1947లో పుట్టారు. అది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరమే. కానీ తులసీ పెరుగుతున్న కొద్దీ, దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం మన జీవితాల్లోకి ఇంకా ప్రవేశించలేదని అర్థం చేసుకుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రి లేని ఆ కుటుంబంలో తులసీతో సహా పిల్లలంతా పనికి వెళ్తే కానీ నాలుగు మెతుకులు రావు. దాంతో కొన్నాళ్లు మేకలని మేపుతూ మరికొన్నాళ్లు ఇనుప గనులలో పనిచేస్తూ గడిపేవారు తులసి.

ఏ పని చేస్తున్నా ఎందుకో తులసిలో చదువు పట్ల విపరీతమైన అభిమానం ఉండేది. నిరక్షరాస్యతని మించిన బానిసత్వం లేదని ఆమె నమ్మేది. తన చుట్టూ ఉన్న పేదరికానికీ, వ్యసనాలకీ, భయాలకీ, మూఢనమ్మకాలకీ, నైరాశ్యానికీ... చదువు లేకపోవడమే కారణం అనుకొనేది. కానీ ఈ పరిస్థితి మారేదేలా! తనకే చదువు రాదు, ఇక తను మరొకరికి ఎలా సాయపడగలదు? ఇలా తులసీ మనసు రకరకాల సందేహాలతో సతమతం అవ్వసాగింది. కానీ ఆమెలో ప్రజ్వలంగా ఉన్న ఆకాంక్ష మాత్రం ఏదో దారి కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో భూదాన్ ఉద్యమకర్త వినోబా భావే, 1963లో తులసి ఉండే ప్రాంతానికి వచ్చారు.

వినోబా భావే వ్యక్తిత్వానికి తులసి ముగ్ధురాలైపోయారు. ఎలాగైనా సరే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో తులసి తన అక్కగారి ఊరైన సెరెండా అనే పల్లెటూరిలో ఉంటున్నారు. వెంటనే తను ఉంటున్న ఆ ఊరిలో పిల్లలని చేరదీసి వారికి చదువు చెప్పాలని నిర్ణయించుకున్నారు. అలా తను ఉండే ఇంటి వరాండాలో ఒక రాత్రిపూట బడిని ఏర్పాటు చేశారు. ఒక పక్క తను చదువుకుంటూ మరో పక్క పిల్లలకు అక్షరాలు నేర్పసాగారు.

 

 

మొదట్లో సెరెండా గ్రామస్తులెవ్వరూ తులసి బడిని పట్టించుకోనేలేదు. కానీ ఇంటింటికీ తిరిగి మనిషి మనిషినీ ప్రాధేయపడటంతో ఓ 30 మంది పిల్లలు మాత్రం పోగయ్యారు. పగటివేళల్లో వాళ్లు ఎలాగూ గనుల్లోని పనికి వెళ్తారు కాబట్టి రాత్రివేళల్లో ఏదో నాలుగు ముక్కలు నేర్చుకుంటారులే అని సరిపెట్టుకున్నారు. కానీ ఆ పిల్లల్లో చదువు తీసుకువచ్చిన మార్పు చూసి గ్రామం ఆశ్చర్యపోయింది. పెద్దలంతా తాము పనికి వెళ్తూ, పిల్లల్ని తులసి దగ్గర వదిలిపెట్టి వెళ్లసాగారు.

క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆ విద్యార్థుల కోసం తగిన వసతులు కల్పించేందుకు తులసి కూరగాయలు, మరమరాలు అమ్మిమరీ, వారికి లోటు రాకుండా చూసుకునేవారు. తులసిలోని నిబద్ధతని గమనించిన గ్రామస్తులు స్వయంగా ఒక పాఠశాలను నిర్మించి అందించారు. ఊళ్లో చదువు రావడంతో... వారి జీవితాల్లో మార్పు కూడా వచ్చేసింది. గనుల్లో తమకి జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నించే ధైర్యం వచ్చింది. ఒకరి దగ్గర దేహీ అనకుండా తమకి తోచిన ఉపాధిని ఎంచుకునే స్వేచ్ఛ వచ్చింది. మొత్తంగా వారి జీవితాల్లో ఒక వెలుగు వచ్చింది!

ఇదంతా జరిగి 40 సంవత్సరాలకు పైనే గడుస్తోంది. ఇప్పటివరకూ ‘ఆదివాసి వికాస్ సమితి’ పేరుతో తులసి ఆరంభించిన పాఠశాల దాదాపు ఇరవై వేల మందికి చదువుని అందించి, వారి జీవితాలతో ఓనమాలు దిద్దించింది. దూరం నుంచి వచ్చే విద్యార్థులు కేవలం 200 రూపాయలు చెల్లిస్తే చాలు, వారు బడిలోనే ఉండి చదువుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.

ఒడిషాలోని మారుమూల గ్రామంలో తులసి సాగిస్తున్న ఈ ఉద్యమం క్రమేపీ ప్రపంచానికి తెలిసింది. కేంద్రం పద్మశ్రీ బిరుదుతోనూ, ఒడిషా రాష్ట్రం లివింగ్ లెజెండ్ అవార్డుతోనూ సత్కరించాయి. తులసికి ఆర్ధికంగా సాయపడేందుకు టాటా స్టీల్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. అంతేకాదు స్ఫూర్తి రగిలించే ఆమె జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘తులసి ఆపా’ పేరుతో ఒక చిత్రం కూడా ఒడిషా భాషలో రూపొందింది. పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటుగా ఒడిషా ప్రభుత్వం సినీరంగానికి అందించే అవార్డులలో ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ఒక్కడితో మార్పు సాధ్యం కాదు అనుకుని వెనకడుగు వేసేవారికి తులసి జీవితమే ఓ ముందడుగు.

- నిర్జర.