మొగవారికే మొదటి ప్రాధాన్యం

 

 

ఒకప్పుడు ఆడవాళ్లంటే చాలా చులకన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆడవాళ్లు ఏ రంగంలోనూ మగవారికి తీసిపోవడం లేదు. కాబట్టి సమాజం కూడా వాళ్లిద్దరికీ సమానమైన గౌరవం ఇస్తోంది. ఈ మాటలు మీరు కూడా నమ్ముతున్నారా? కానీ నిజంగా మనం మురిసిపోవాల్సినంత మార్పేమీ సమాజంలో రాలేదని అంటున్నారు పరిశోధకులు. అందుకు రుజువుగా ఒకటి కాదు రెండు కాదు, మూడు పరిశోధనలు చేసి చూపిస్తున్నారు. సామాన్యంగా ఒక జంటను సంభోదించేందుకు Mr. & Mrs అంటాము. అలాగే ఎవరన్నా అమరప్రేమికుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రోమియోజూలియట్ లాంటి పోలికలు చేస్తాము. ఇందులో మగవారినే మొదటగా పేర్కొంటాం కదా! ఈ వ్యవహారం లోతుపాతులని చూడాలనుకున్నారు Dr. Hegarty అనే పరిశోధకుడు. అందుకోసం ఓ మూడు పరిశోధనలు చేసి చూశారు. ఆ పరిశోధనలు, వాటి ఫలితాలు ఇవిగో...

 

మొదటి పరిశోధన:

Dr. Hegarty మొదటగా ఇంటర్నెట్లో జంటగా కనిపించే పదాలను వెతికి చూశారు. ఇందుకోసం అటు అమెరికాలోనూ, ఇటు ఇంగ్లండులోనూ తరచూ వినిపించే కొన్ని పేర్లను నెట్లో సెర్చ్ చేశారు. ఉదాహరణకి డేవిడ్ అనే మగ పేరు, మేరీ అనే స్త్రీ పేరు ఉన్నాయనుకోండి. David and Mary అని మగవారి పేరు ముందు వచ్చేట్లుగా, అలాగే Mary and David అని ఆడవారి పేరు ముందు వచ్చేట్లుగా నెట్లో వెతికారు. ఈ ఫలితాలలో వచ్చిన పేర్లలో దాదాపు 80 శాతం సందర్భాలలో మగవారి పేరే ముందు కనిపించింది!

 

రెండో పరిశోధన:

ఈ పరిశోధనలో ఓ 121 మందిని కొన్ని జంటలను ఊహించుకోమని చెప్పారు. ఆ జంటలలో కొన్ని జంటలు సంప్రదాయబద్ధంగా ఉంటాయనీ, మరికొన్ని జంటలు ఆధునికంగా ఉంటాయనీ ఊహించుకోమన్నారు. ఆ జంటల పేర్లు చెప్పమన్నప్పుడు.... సంప్రదాయబద్ధంగా ఉండే జంటల పేర్లలో ఎక్కువగా మగవాడి పేరు ముందు వచ్చింది. ఆధునికంగా ఉండే జంటల పేర్లు చెప్పినప్పుడు మరీ అంత వ్యత్యాసం కనిపించలేదు.

 

మూడో పరిశోధన:

ఈసారి పరిశోధన కోసం ఓ 86 మందిని ఎన్నుకొన్నారు. వీరందరినీ కూడా కొన్ని జంటలని ఊహించుకోమని చెప్పారు. అలా ఊహించుకున్న జంటల మధ్య తేడాలని రాయమన్నారు. ఇలా రాసేటప్పుడు మగవారికి సంబంధించిన లక్షణాలే ఎక్కువగా రాయడాన్ని గమనించారు. అతను ఆమెకంటే బలంగా ఉంటాడు; ఆమె అతనికంటే దూకుడుగా ఉంటుంది; అతను క్రికెట్ బాగా ఆడతాడు లాంటి లక్షణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకానీ వంటావార్పూ, ఇంటిపని, కుటుంబం, నాట్యం.... లాంటి స్త్రీ సంబంధమైన లక్షణాల గురించి అంతగా ప్రస్తావించలేదు.


అదీ విషయం! పైకి మనం ఆడవారి పట్ల అంతగా వివక్ష లేదని చెబుతున్నా, మన మెదడు మగవారికి ప్రాధాన్యత ఇచ్చేందుకే అలవాటుపడిపోయాయి. అదే రాతలోనూ కనిపిస్తోంది. మరి ఆ పరిస్థితి మారేదెప్పుడో!!!

- నిర్జర.