మోదీ సైతం ఆమెకు తలవంచారు
‘‘మీరు నా గురించి కాదు, ఈమె గురించి రాయండి. దేశమంతా ఈమె కథను ప్రచారం చేయండి,’’ అంటూ గత ఫిబ్రవరిలో మీడియాకు సూచించారు మోదీ. ఇంతకీ ఆమె క్రీడల్లో పతకం తెచ్చి వెలిగిపోయిన మహిళకాదు, దుర్మార్గుల భరతం పట్టిన వీరనారి అంతకంటే కాదు... ఒక 105 ఏళ్ల వృద్ధురాలు. మేకల మీద బతికే కడు పేదరాలు! కానీ ఆమె ఆశయమే గ్రామీణ ప్రజానీకానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ‘కున్వర్‌బాయ్ యాదవ్’.
సిగ్గు సిగ్గు
ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఉన్న రికార్డుల గురించి తరచూ చెప్పుకుంటాం. కానీ బహిరంగ మల విసర్జనలో మనది మొదటి స్థానం అన్న విషయం ఏ పత్రికా ఉట్టంకించదు. భారత ప్రజానీకంలో దాదాపు మూడోవంతు మంది ఇంకా మల విసర్జన కోసం బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిందే! కోట్లాది మహిళలు సిగ్గు విడిచి ఊరి బయటకు పోవాల్సిందే. ఇలాంటి అలవాటులో ఉన్న సభ్యత మాట అటుంచితే... డయేరియా, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలి ఏటా లక్షలాది మరణాలకు కారణం అవుతోంది.
కాలం మారలేదు
ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని సబ్సిడీలను అందించినా, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. పెళ్లిల్లు, పెదకర్మలు నిర్వహించేందుకు ఆర్భాటంగా లక్షలాది రూపాయలు ఖర్చుచేసే జనం ఇంటి ఆడపడుచులను నిస్సంకోచంగా వీధుల్లోకి పంపుతూనే ఉన్నారు. అందుకనే 2014లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు, బహిరంగ మల విసర్జనని సమూలంగా నిర్మూలించాలని నిశ్చయించింది ప్రభుత్వం.
అనుకోని స్పందన
చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరి జిల్లాలో కోటబర్రి అనే గ్రామం ఉంది. మన దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లాగానే ఇది కూడా అభివృద్ధికి అందనంత దూరంలో ఉంది. ఆ గ్రామంలో ఉన్న దాదాపు 400 ఇళ్లలో 80 శాతం ఇళ్లలో మరుగుదొడ్లే లేవు. అలాంటి ఒక ఇల్లు కున్వర్‌బాయ్ యాదవ్‌ది. ఆమె టీవీ చూడదు, పేపర్ చదవదు... కానీ ఒకరోజు జిల్లా కలెక్టరు బడిలో ఉపన్యాసం ఇస్తుండగా ‘స్వచ్ఛభారత్’ అనే పదాన్ని విన్నది. కున్వర్బాయ్కి ఎందుకో ఆ పదం నచ్చింది. దాని వలన జరిగే మేలు నచ్చింది. అందులో భాగంగా ఇంట్లోనే మరుగుదొడ్డి నిర్మించుకోవాలి అన్న పిలుపు నచ్చింది. అయితే దాన్ని నిజం చేయడం ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టింది!
మేకలు అమ్మి
కున్వర్బాయ్కి ఉన్న ఆస్తల్లా చిన్న ఇల్లు, ఓ పాతిక మేకలు! భర్త ఎప్పుడో చనిపోయినా, చెట్టంత కొడుకులు మృత్యు ఒడి చేరుకున్నా కోడలితో కలిసి గుట్టుగా గడుపుకొస్తోంది కున్వర్‌బాయ్. మరి ఇప్పుడు ఇంట్లో మరుగుదొడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తనకి ఉన్న మేకలలో కొన్నింటిని అమ్మేసి ఓ 18 వేలు కూడబెట్టింది. రోజుకూలీకి వెళ్లే కోడలు తన వంతుగా ఓ నాలుగువేలు పోగుచేసింది వెరసి ఓ 22 వేలతో మరుగుదొడ్డి పూర్తయ్యింది.
జిల్లానే మారిపోయింది
కున్వర్‌బాయ్ చేసిన ఈ పని ఒక వార్తలా మారింది. ‘అప్పటివరకూ మేం పేదవారం. మాకు సొంత మరుగుదొడ్డి కట్టుకునే స్తోమత ఎక్కడిది’ అనేవారందరి నోళ్లు మూతబడిపోయాయి. ఏడాది గడిచేసరికి కోటబర్రి గ్రామంలో ప్రతిఒక్కరూ మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు. ఈ మార్పు కున్వర్‌బాయ్ ద్వారానే వచ్చిందని గ్రహించిన ప్రభుత్వం ఆమెను సత్కరించింది. అయితే కున్వర్‌బాయ్ ప్రభావం ఇక్కడితో ఆగలేదు. మోదీ ఆమెకు శిరసు వంచి నమస్కరించడం చూసిన ధామ్తరి జిల్లావాసులంతా ఆలోచనలో పడిపోయారు. కున్వర్‌బాయ్ చేసిన పని తామెందుకు చేయలేం అనుకున్నారు. ఫలితం! ఏడులక్షలకు పైగా జనాభా ఉన్న ధామ్తరి జిల్లాలో ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక మరుగుదొడ్డి ఉంది. చత్తీస్‌గఢ్ జిల్లాలో బహిరంగ మలవిసర్జన లేని తొలి జిల్లాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
కున్వర్‌బాయ్ చేసిన పని కొందరికి చాలా సాధారణంగా తోచవచ్చు. ‘మరుగుదొడ్డి కోసం మేకలు అమ్మడం’ లాంటి వాక్యాలు నవ్వు తెప్పించవచ్చు. కానీ ఒక పని పూర్తిచేయాలన్న సంకల్పం ఉంటే, దానికి ఏదో ఒక తోవ కనిపిస్తుందనీ... ఆ తోవలో నడిచినవారు మిగతావారికంటే ముందుంటారనీ కున్వర్‌బాయ్ కథతో తేలిపోతోంది.
- నిర్జర.
