"నిశాంతా! నువ్వెవరు?" సూటిగా, బలంగా వచ్చిందా మాట అతని నోటివెంట.

 

    "నేనా? ఓ అమ్మాయిని... నిన్ను..." నవ్వబోయిందామె.

 

    చివ్వున అతని నరాల్లో కోపం పొంగడం, వెంటనే అతని కుడిచేయి విసురుగా పైకి లేచి ఆమె చెంపను తాకడం... అంతా ఒకే ఒక క్షణంలో జరిగిపోయింది.

 

    ఆమె కళ్ళలో చివ్వున కన్నీళ్ళు చిమ్మాయి.

 

    "నువ్వు అకస్మాత్తుగా ముస్సోరీలోకి అడుగుపెట్టావ్. అకస్మాత్తుగా బిజినెస్ స్టార్ట్ చేసావ్... యంగ్ ప్యాలెస్ లోకి మామూలు ఆడపిల్ల ఎవరూ అంత డేరింగ్ గా, డేషింగ్ గా రాలేదు. కానీ నువ్వొచ్చావ్... నువ్వొచ్చింది నన్ను తాగించడానికి... నువ్వు ఎక్కడకు రమ్మంటే... ఎప్పుడు రమ్మంటే ఎందుకొచ్చానో తెలుసా? ఎప్పుడయినా, ఒక్కసారయినా నీ గురించి నువ్వు చెపుతావని.

 

    నువ్వెక్కువ చదువుకోలేదని నాకు తెలుసు. నీ తెలివితేటల్ని వుపయోగించి బ్రతుకుతున్నావని నాకు తెలుసు. నీ ప్రేమ ఓ ముసుగని అసలు నువ్వొచ్చిన పని ఇంకేదో వుందని నేనెప్పుడో గమనించాను.

 

    నీ వెనక బార్లకు వచ్చింది ఎప్పుడైనా, ఒక్కసారైనా నువ్వు చెప్పే నిజం విందామని... ఎప్పుడూ... ఎప్పుడూ... నువ్వా ప్రయత్నం చెయ్యలేదు. ఇంతవరకూ ఏ విషయంలోనూ నిన్ను నేను ఒక ప్రశ్న కూడా ఎందుకు వెయ్యలేదో తెలుసా?"

 

    నిశాంత ముఖంలోకి చూశాడు అతను.

 

    అప్పటికే నిశాంత ముఖంలో రంగులు మారిపోయాయి.

 

    తన గురించి సిద్ధార్ధకు ఎవరు చెప్పారు? ఎలా తెలుసుకున్నాడు? బయటకు రాని సవాలక్ష ప్రశ్నలతో సతమతమౌతోందామె.

 

    "నిన్నిప్పటికీ నేను అనుమానించడంలేదు. ఎందుకో తెలుసా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను గనక... నా జీవితంలో నాకు సన్నిహితంగా వచ్చిన దానివి నువ్వు... నా మనసులో సున్నితమైన అనుభూతుల్ని నింపిన దానివి నువ్వు... నేను జైలులాంటి వాతావరణంలో పెరిగాను. నిజమే... కానీ నా మనసు ఎప్పుడూ జైల్లో లేదు. నా ఆలోచనల్ని, అవగాహనని పెంచుకోవడం కోసం నేను నీతో స్నేహం చేశాను. ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నాను. కానీ నువ్వు ప్రేమను నటించావ్ కదూ!"

 

    ఎర్రటి సిద్ధార్ధ ముఖం మరింత ఎర్రగా మారిపోయింది.

 

    మాటల కోసం వెతుక్కుంటోంది ఆమె.

 

    ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆమె ఎప్పుడూ వూహించలేదు.

 

    అనుకూలమైన సమయంలో తన గురించి నిజాన్ని చెప్పి అవసరమైతే సిద్ధార్ధ కోసం దేశ్ ముఖ్ ను కూడా ఎదిరించడానికి మానసికంగా సిద్ధపడ్డ నిశాంత-

 

    అతడు తనని అనుమానించడానికి తనే అవకాశం ఇస్తోందని వూహించని నిశాంత-

 

    అతడి ప్రతిభను తప్ప, మనసును అంచనా వెయ్యడానికి ఎప్పుడూ ప్రయత్నించని నిశాంత-

 

    అతడి ఎదుట దోషిలా నిలబడిపోయింది. అవమానభారంతో తల దించుకున్నదామె.

 

    మొదటి నుంచి జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారి ఆమె కళ్ళముందు కదలాడాయి.

 

    భోరుమని ఏడ్చేసిందామె. ఎలాంటి పరిస్థితినైనా అవలీలగా ఎదుర్కోడానికి తనని తాను మలచుకున్న వ్యక్తిత్వం అతడి మనసు ముందు, అతడి వ్యక్తిత్వం ముందు-

 

    వెలవెలబోయింది.

 

    "సిద్ధార్ధా!" నెమ్మదిగా పెదవి విప్పిందామె. ఆమె బొంగురు గొంతులోంచి వస్తున్న ఒక్కొక్క మాటనూ శ్రద్ధగా వింటున్నాడు అతను.

 

    తను తన పుట్టుక, తన బాధ, తన ఆక్రోశం, తన పరిస్థితి ఏ ఒక్క విషయం దాచకుండా జరిగిన ప్రతి సంఘటననూ అతడి ముందుంచిందామె.

 

    "నేనెప్పుడూ నీ మనసుతో ఆడుకోలేదు సిద్ధార్ధా! నా మనసుతోనే ఆడుకున్నాను. నీ ఎదుట నేను నవ్విన ప్రతి చిరునవ్వూ నేను మింగిన కన్నీళ్ళకు తార్కాణం. నీ ఎదుట నేను నటించిన ప్రతి సంఘటనా నా నిస్సహాయ స్థితికి నిదర్శనం.

 

    నేనెప్పుడూ నిన్ను వంచించాలనుకోలేదు ఎందుకో తెలుసా? నేను నిన్ను ప్రేమించాను కాబట్టి. నా జీవితంలో నా అనుభూతుల్ని, నా స్పర్శను, నా ముద్దుని మొదటిసారిగా పొందిన మగవాడివి నువ్వు.

 

    నా పేదరికాన్ని, నా ఊరు పేదరికాన్ని తొలగించుకోడానికి, ఆకలితో దుర్భరమైన పేదరికంతో ఆడతనాన్ని దాచుకోడానికి కనీసం చిరుగు గుడ్డకు కూడా నోచుకోని పరిస్థితుల్లో మా వూళ్ళో మరే అమ్మాయీ వుండకూడదు. బలిపశువులా మరే అమ్మాయి బొంబాయి బజారులో పడకూడదు. మరే తండ్రీ తన కూతుర్ని డబ్బుకోసం అమ్ముకోకూడదు.

 

    నీకు తెలీదు సిద్ధార్ధా! పద్దెనిమిదేళ్ళ నా జీవితం నాకేమిచ్చిందో తెలుసా? బాధ, నరకయాతన, ఓదార్చలేని కన్నీటి ఆక్రోశం.

 

    కక్షను, పగను, అంతులేని కసిని నాలో నింపి నా మనసును నిర్ధాక్షిణ్యంగా చెరిపేసి నన్ను నీ ఎదుట మానవాయుధంలా నిలబెట్టిన వ్యక్తుల్ని నేను క్షమిస్తాను.

 

    ఎందుకో తెలుసా?

 

    అంతులేని నీ ప్రేమ, మాలిన్యం లేని నీ ప్రేమ, నీ చూపులు, నీ ప్రేమ, నీ స్పర్శ, నీతో గడిపిన క్షణాలు నాకు జీవితంలో బ్రతుకు విలువను తెలిపాయి. మానవత్వపు విలువల్ని తెలిపాయి. నా నవ్వు, నా మాట, నా ప్రవర్తన, అంతా నటనే కావొచ్చు. కానీ అనుక్షణం రగిలిపోయే నా మనసుకు సేదనిచ్చింది నీ ప్రేమ... నా ప్రేమ నటన కాదు సిద్ధార్ధా!"

 

    పొంగుకొచ్చిన దుఃఖం వల్ల ఆమె మరి మాట్లాడలేకపోయింది.

 

    చెట్టుకి చేరబడి చేతుల్లో ముఖాన్ని పెట్టుకొని ఏడుస్తున్న ఆమెవేపు జాలిగా చూశాడు అతను.

 

    నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ప్రేమగా ఆమె ముఖాన్ని పైకెత్తాడు.

 

    చూపుడు వేలితో కన్నీళ్ళను తుడిచాడు.

 

    పెదవుల్ని మెల్లగా చుంబించాడు.