వావ్.. ఈ వ్యాయామాలు చేస్తే చాలు.. చేతులు నాజుగ్గా మారిపోతాయ్!

అమ్మాయిలు తమ శరీరం మొత్తం మీద  చాలా కేర్ తీసుకుంటారు. అందుకు తగ్గట్టే అమ్మాయిల దుస్తులు బోలెడు ఫ్యాషన్లలో, బోలెడు మోడల్స్ తో మార్కెట్లోకి వస్తుంటాయి. చాలామంది అమ్మాయిలకు చూసిన మంచి డ్రెస్ ఖచ్చితంగా వేసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఆ కోరిక మాత్రం అలాగే తీరని కోరికగా ఉండిపోతుంది. దీనికి కారణం శరీరం తగిన షేప్ లో లేకపోవడమే. చాలా వరకు ఇప్పట్లో మార్కెట్లోకి వచ్చే అమ్మాయిల దుస్తులు స్లీవ్ లెస్ గానే ఉంటాయి. ఈ దుస్తులు వేసుకోవాలంటే కొందరికి భలే బెరుకు. దీనికి కారణం ఆర్మ్ ఫ్యాట్. చేతులు లావుగా కొందరికి ఉంటే.. మరికొందరికి చేతుల చర్మం వేలాడుతూ ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ సమస్య తొలగిపోవడానికి కొన్ని వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. ఆ తరువాత ఎంచక్కా స్లీవ్ లెస్ దుస్తులు నచ్చినవన్నీ ట్రై చేయచ్చు..

పుషప్స్ తో ఫిట్..

చేతులు బలంగా మారాలన్నా, చేతుల కొవ్వు కరగాలన్నా పుషప్స్ బాగా సహాయపడాయి. నేలమీద బోర్లా పడుకుని చేతులను అటు, ఇటు దూరంగా ఉంచాలి. ఇప్పుడు రెండు అరచేతులను  నేలకు ఆన్చి పాదాలను మునివేళ్లమీద నిలబెట్టాలి.  అరచేతులు, పాదాల మునివేళ్ల మీద బరువు వేస్తూ శరీరం మొత్తాన్ని పైకి లేపాలి.  ఇలా పైకి లేపి మళ్లీ తిరిగి మామూలు స్థితికి రావాలి. కొత్తగా స్టార్ట్ చేసేవారు 10సార్లలోపు మాత్రమే చెయ్యాలి. ఆ తరువాత క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. ఈ పుషప్స్ వల్ల చేతుల కొవ్వు కరుగుతుంది. అలాగే కాళ్ల కండరాలతో పాటు నడుము, భుజాలు కూడా దృఢంగా మారతాయి.

బైసప్స్ తో ఐస్ లా కరిగిపోద్ది..

చేతులకున్న అదనపు కొవ్వు కరిగించడానికి బైసప్ కర్ల్స్ భలే సహాయపడతాయి. దీనికోసం 5 కేజీల మొదలు 15 కేజీల మధ్య బరువున్న డంబెల్స్ తీసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచి నిలబడాలి. ఇప్పడు డంబెల్స్ తీసుకుని వెన్ను, నడుము వంచకుండా శరీరాన్ని నిటారుగా ఉంచి బరువులు మెల్లిగా ఎత్తడం దించడం చెయ్యాలి. ఒక్కోసారి ఒకో చేతిని పైకి లేపి దాన్ని కిందకు దించేటప్పుడు రెండోది పైకి  లేపాలి.

ఆర్మ్ సర్కిల్స్..

చేతుల కొవ్వు తగ్గించుకోవడానికి మరొక సులువైన వ్యాయామం ఇది. స్ట్రైట్ గా నిలబడి రెండు చేతులను చాపాలి. ఈ చేతులను వృత్తాకారంలో తిప్పాలి. 30 నెంబర్స్ లెక్కపెడుతూ ఇలా తిప్పిన తరువాత మళ్లీ విరామం తీసుకోవాలి. ఇలా దీన్ని రెండు చేతులతో చేస్తే చేతి కొవ్వు తొందరగానే తగ్గిపోతుంది.

                                              *నిశ్శబ్ద.