ఇప్పుడంతా బాహుబలి ఫ్యాషన్

 

 

బాహుబలి మొదటి భాగం రాకముందు ఉత్తరాదివారికి తెలుగు సినిమా సత్తా ఏమిటో తెలియనే తెలియదు. ఏటా వందల కొద్దీ సినిమాలు తీస్తుంటారు, చూస్తుంటారు అన్న భావన తప్ప మన గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఒకవేళ  అడపాదడపా మాట్లాడుతున్నా తెలుగు సినిమాని ‘సౌత్ ఇండియన్ మూవీ’ అనే పిలిచేవారు. కానీ బాహుబలి మొదటిభాగం టాలీవుడ్ అనే పేరుని బాలీవుడ్కి పరిచయం చేసింది. ఇక బాహుబలి2 ఉత్తరాదిలో విజయబావుటా ఎగరేసి.... సినిమా సరిహద్దలనే చెరిపివేసింది. ఈ కబుర్లన్నీ మనం రోజూ వింటున్నవే! కానీ బాహుబలి ఉత్తరాదిలో ఫ్యషన్ ప్రపంచాన్ని కూడా ఒక ఊపు ఊపుతోందని తెలుసా...

బాహుబలి పెండెంట్

 

 

బాహుబలి సినిమా అంటేనే శివలింగాన్ని పెకిలించే సన్నివేశమే గుర్తుకువస్తుంది. దాంతోపాటుగా బాహుబలి మెడలో చిన్నపాటి శివలింగం ఉన్న గొలుసూ కనిపిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఈ పెండెంట్ విచ్చలవిడిగా కనిపిస్తోంది. మగవారే కాదు ఆడవారు కూడా దీన్ని సరదాగా వేసుకోవచ్చునంటున్నారు.

బాహుబలి నగలు

 

 

 

బాహుబలిలో శివగామి కాసులపేరుని ఎవరు మర్చిపోగలరు, దేవసేన అరవంకీ నుంచి ఎవరు చూపు తిప్పుకోగలరు. ముక్కుపుడకల దగ్గర్నుంచీ, వడ్డాణాల దాకా బాహుబలిలో ప్రతి ఆభరణమూ ప్రత్యేకంగా తయారుచేయించినదే! జైపూర్కి చెందిన ఆమ్రపాలి అనే సంస్థ బాహుబలి కోసం 1500 రకాల ఆభరణాలని రూపొందించింది. ఇప్పుడు వాటిలో 1000 ఆభరణాలని అమ్మకానికి ఉంచింది. హైదరాబాద్ సహా 30 ప్రదేశాలలో ఆమ్రపాలి షోరూంస్లో ఈ ఆభరణాలు దొరుకుతున్నాయి.

బాహుబలి జాకెట్లు

 

ఓ నాలుగుదశాబ్దాల క్రితం బుట్ట జాకెట్లదే హవా. ఆ హవా ఎప్పుడో చల్లబడిపోయింది. బాహుబలి పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ బుట్ట జాకెట్లకి రోజులు వచ్చాయి. దేవసేన పాత్రలో అనుష్క వేసుకునే తరహా జాకెట్లకి క్రేజ్ పెరిగింది. అంతేకాదు! కాంట్రాస్ట్ రంగులు, జరీ అంచులు, పూలు.. ఉండే జాకెట్లని బాహుబలి చూసి మరీ వేసుకుంటున్నారు.

బాహుబలి కుర్తీలు

బాహుబలి2లో అమరేంద్ర బాహుబలి ఠీవిగా ఏనుగునెక్కే సన్నివేశం గుర్తుందా! పోనీ అటు పౌరుషాన్నీ, ఇటు ప్రేమనీ ఏకకాలంలో పలికించే ప్రభాస్, అనుష్కలు విల్లు ఎక్కుపెట్టే దృశ్యం చూశారా. ఇలా బాహుబలిలో ముఖ్యమైన సన్నివేశాలని గుండెలకు హత్తుకునేలా కుర్తీలు వచ్చేశాయి. ఆన్లైన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

బాహుబలి చీరలు

 

అయితే పంజాబీ డ్రెస్సులు, లేకపోతే పాలిస్టర్ చీరలు రాజ్యమేలుతున్న కాలంలో మగ్గం చీరల్ని మరోసారి గుర్తుచేసింది బాహుబలి. నూలు చీరలైనా, పట్టు చీరలైనా మన సంప్రదాయపు కట్టులో ఉన్న అందానికి సాటి లేదని నిరూపించింది. పెద్దరికాన్ని గుర్తుచేసే శివగామి చీరలైనా, రాచరికాన్ని ప్రదర్శించే అనుష్క చీరలైనా... ఇప్పడు బాహుబలి చీరల పేరుతో మార్కెట్ని ముంచెత్తుతున్నాయి.

- నిర్జర.