శ్రీవారి పుష్ప కైంకర్యం స్కీం
Srivari Pushpa Kaimkaryam Scheme
విజ్ఞప్తి
వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం ఈ విశ్వంలోనే లేదు. శ్రీ వేంకటేశ్వరుని మించిన దైవమూ లేదు. శ్రీ యమునాచార్య సూచన ప్రకారం, శ్రీ తిరుమలనంబి, తిరుమలలోనే కొంతకాలం పుష్పార్చన చేశారు. తర్వాత శ్రీ రామానుజాచార్య ఆదేశాన్ని అనుసరించి అనంతాళ్వారుగా సుప్రసిద్ధులుడైన శ్రీ అనంతసూరి తిరుమలలో పుష్పవనాన్ని ఏర్పాటు చేశారు. తులసీవనంతోపాటు సుగంధ పరిమళ పుష్పాలను ఇచ్చే మొక్కలతో అలరారే వనాన్ని వృద్ధి చేసి స్వామివారికి పుష్పసేవ చేశారాయన. తరిగొండ వెంగమాంబ, ఎందరో రాజులు, రాణులు ఆ తర్వాత తిరుమలలో శాశ్వత వనం ఏర్పరిచి ఆ వనంలో విరిసిన పూలతో స్వామివారిని అర్చించారు. చారిత్రిక ఆధారాలను పరిశీలిస్తే తిరుమలలో ఎన్నో పుష్పవనాలు ఉన్నాయని తెలుస్తోంది.
స్వామివారిని భక్తులు పుష్పాలతో ఆరాధించేందుకు వీలు కల్పించే పథకాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టింది. నిత్య పుష్ప కైంకర్యానికి ఈ పుష్పాలు వినియోగిస్తారు. వీటిలో గులాబీ, గన్నేరు, మొగలి, మరువం, కురివేరు, వట్టివేరు, దవనం, జాజి, మల్లి, కనకాంబరం, తులసి తోబాటు సుగంధ పుష్పాలను ఇచ్చే మొక్కలు, స్వామివారికి ప్రీతికరమైన పుష్పాల మొక్కలతో వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వనాలలోని పుష్పాలు వైకుంఠ ఏకాదశి, ఉగాది, పుష్పపల్లకి, బ్రహ్మోత్సవాలు, పుష్పయాగం తదితర ప్రత్యేక సందర్భాల్లో వాడతారు.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: 0877 – 2277777, 2233333




