![]()
మీ ప్రెండ్స్‌లో ఎవరో ఒకరు కచ్చితంగా ఒక హీరోలాగా హెయిర్ స్టైల్ మెయింటెన్ చేయడం ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. అసలు టాలీవుడ్‌లో సినిమా హిట్ అవ్వడమే కాదు.. హీరో హెయిర్ స్టైల్ ట్రెండ్ అవ్వడం అనేది ఒక రేంజ్ క్రేజ్. అప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్ రోజుల నుండి ఇప్పటి పవన్ కళ్యాణ్, తారక్ వరకు.. మన టాలీవుడ్ హీరోలు తమ హెయిర్ స్టైల్స్‌తో బాక్సాఫీస్‌నే కాదు, యూత్‌ని కూడా ఎలా షేక్ చేశారో తెలుసుకుందాం.
ముందుగా సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో స్టార్ట్ చేస్తే.. ఆ రోజుల్లో ఈ లెజెండ్స్ ఒత్తయిన జుట్టుతో కనిపించేవారు. క్లీన్ షేవ్, ఒత్తయిన జుట్టుతో అప్పట్లో వీరి లుక్స్ భలే క్లాసీగా ఉండేవి.
ఆ తర్వాత వచ్చిన సోగ్గాడు శోభన్ బాబు హెయిర్ స్టైల్ అయితే ఒక సంచలనమే సృష్టించింది. నుదుటిపైకి పడే ఆయన రింగ్ కటింగ్ చూసి అప్పట్లో కుర్రకారు ఫిదా అయిపోయారు. సెలూన్ షాపులకు వెళ్లే ప్రతి ఒక్కరూ శోభన్ బాబు రింగ్ కటింగ్ కావాలంటూ ప్రత్యేకంగా అడిగి మరీ చేయించుకునేవారంటే ఆ క్రేజ్ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు.
90s కాలానికి వచ్చేసరికి అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ గా అవతరించారు. నాగార్జున ఫంక్ హెయిర్ స్టైల్ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.
అదే సమయంలో 'ప్రేమ దేశం' సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు అబ్బాస్ హెయిర్ కట్ ఒక ఊపు ఊపేసింది. 'అబ్బాస్ కటింగ్' పేరుతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆ మిడిల్ పార్టిషన్ స్టైల్.. 90s కాలేజ్ కుర్రాళ్ళకు ఒక స్టైల్ స్టేట్‌మెంట్ గా మారిపోయింది. ప్రతి సెలూన్ గోడపైనా అబ్బాస్ పోస్టర్ తప్పనిసరిగా దర్శనమిచ్చేది.
ఇక ట్రెండ్ సెట్టింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రస్థానం పూర్తిగా వేరనే చెప్పాలి. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' సినిమాల సమయంలో పవన్ కళ్యాణ్ మెయింటైన్ చేసిన హెయిర్ స్టైల్ కి విపరీతమైన కల్ట్ ఫాలోయింగ్ లభించింది. ఆయన హెయిర్ స్టైల్ తో పాటు, హెయిర్ ని వేళ్లతో సవరించుకునే ఆయన మ్యానరిజం కూడా యువతలో ఒక పిచ్చిగా మారిపోయింది.
అలాగే 'పోకిరి', 'అతిథి' సినిమాల్లో మహేష్ బాబు హెయిర్ స్టైల్ కూడా.. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
స్టైల్ కి సరికొత్త డెఫినేషన్ చెప్పిన అల్లు అర్జున్ కూడా.. తన డిఫరెంట్ హెయిర్ కట్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. 'దేశముదురు', 'జులాయి', 'ఇద్దరమ్మాయిలతో' వంటి సినిమాల్లో ఆయన హెయిర్ స్టయిల్స్ ట్రెండ్ గా మారాయి.
'మున్నా' మూవీలో లాంగ్ హెయిర్ తో ఆకట్టుకున్న ప్రభాస్.. 'మిస్టర్ పర్ఫెక్ట్'లో షార్ట్ హెయిర్ తో కనిపించి సర్ప్రైజ్ చేయడమే కాకుండా, సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు.
'మగధీర', 'ఆరెంజ్' సినిమాల్లో రామ్ చరణ్ హెయిర్ స్టైల్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి. ఆయన ఆఫ్ స్క్రీన్ హెయిర్ స్టైల్ కి కూడా బాగానే ఫ్యాన్స్ ఉంటారు.
ఇక ఈ జనరేషన్ లో యూత్ ని ఒక ఊపు ఊపేసిన హెయిర్ స్టైల్ అంటే.. 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. అల్ట్రా మోడర్న్ హెయిర్ అండ్ బియర్డ్ లుక్ లో తారక్ కనిపించగానే టాలీవుడ్ మొత్తం షాక్ అయింది. ఆ ఒక్క సినిమా దెబ్బకి ప్రతి సెలూన్ షాప్ దగ్గర 'ఎన్టీఆర్ హెయిర్ కట్' ఫోటోలు వెలిశాయి. ఇప్పటికీ 'నాన్నకు ప్రేమతో' హెయిర్ స్టైల్ ట్రెండింగ్ లోనే ఉంది.
మొత్తానికి నాటి బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి పాన్ ఇండియా కాలం వరకు.. తెలుగు హీరోలు తమ హెయిర్ స్టైల్స్ తో టాలీవుడ్ ఫ్యాషన్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే మరపురాని ట్రెండ్స్ క్రియేట్ చేశారు.
[Tollywood Heroes Hairstyles, Sobhan Babu, Nagarjuna, Pawan Kalyan, Abbas Cutting, Nannaku Prematho hairstyle, Allu Arjun, Mahesh Babu, Telugu News]




