ఈ రోజుల్లో పెళ్లి సంబంధం కుదరడం అంటే గగనమే అయిపోయింది. ఇక మన జ్యోతిష్యులు ఇచ్చే సలహాలు అయితే మామూలుగా ఉండవు. అయితే దశాబ్దాల క్రితమే ఈ "మ్యాట్రిమోనీ" కష్టాలని మన సుత్తివేలు తనదైన స్టైల్లో ఒక ఆట ఆడుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్న ఈ పాత వీడియో చూస్తే మీరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే!
కళ్యాణచక్రవర్తి, రమ్యకృష్ణ జంటగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన కృష్ణలీల చిత్రంలోని కామెడీ సీన్ ఇది. సుత్తివేలు, పొట్టి ప్రసాద్ కాంబినేషన్‌లో నవ్వులు పూయించిన ఈ సీన్ అప్పట్లో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇందులో సుత్తివేలు ఒక హై-టెక్ జ్యోతిష్యుడి గెటప్‌లో మెరిసిపోయారు. తన దగ్గరకు వచ్చిన ఒక తండ్రి, తన కూతురు "లత" గురించి గోడు వెళ్లబోసుకుంటాడు. పేరు లత అయినా మనిషి మాత్రం మర్రిమానంత ఉంటుందని, వంద కిలోల బరువుందని ఆయన చెప్పే డైలాగ్ వింటే నవ్వు ఆగదు. దీనికి సుత్తివేలు ఇచ్చే కౌంటర్ అసలు హైలైట్!
అమ్మాయికి కుజదోషం ఉందని, అందుకే పెళ్లి కావట్లేదని చెబుతూనే.. తాయిత్తుల్లో వెరైటీలు పరిచయం చేస్తారు మన పంతులు గారు. "డీలక్స్ తాయిత్తు అయితే ఏడాదిలో పెళ్లి, సూపర్ డీలక్స్ అయితే ఆరు నెలల్లో పెళ్లి" అని ఆయన బిజినెస్ మైండ్‌తో చెప్పే లాజిక్ అద్భుతం. ఇక ఆ తండ్రి అత్యుత్సాహం చూసి, "ఒకేసారి రెండు సూపర్ డీలక్స్ తాయిత్తులు కడితే మూడు నెలల్లో పెళ్లి అవుతుందా?" అని అడిగితే.. "రెండు నెలల్లో కడుపు కూడా వస్తుంది" అని సుత్తివేలు వేసే పంచ్‌కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి.
తర్వాత తన భార్య చింతామణితో ఆయన చేసే రొమాంటిక్ కామెడీ ఇంకో లెవల్. మన్మధ పూజ నైవేద్యం అంటూ ఆయన చేసే అల్లరి చూస్తుంటే.. అప్పట్లో కామెడీ ఎంత నేచురల్‌గా ఉండేదో అర్థమవుతుంది. అందుకే ఈ వీడియోకి ఇప్పటికీ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
చూస్తుంటే ఈ జ్యోతిష్యుడి టెక్నిక్ ఫాలో అయితే ఈ కాలం యూత్ కి కూడా పెళ్లిళ్లు ఇట్టే అయిపోయేలా ఉన్నాయి కదా! ఏదేమైనా సుత్తివేలు టైమింగ్‌ని మళ్లీ గుర్తు చేసుకుని నవ్వుకోవడానికి ఈ వీడియో ఒక బూస్టర్ డోస్ లాంటిది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇలాంటి ఫన్నీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.





