
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన చిత్రం 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే కళ్ళు చెదిరే వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. (Peddi Collections)
'పెద్ది' చిత్రం మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 138.36 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ స్టామినాను మరోసారి నిరూపించింది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ కి తోడు జాన్వీ కపూర్ గ్లామర్ ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సకాలంలో స్పెషల్ షోలు, టికెట్ రేట్ల జీవోలు జారీ చేయడం, వేసవి సెలవుల అనంతరం సరైన పెద్ద సినిమా లేకపోవడం 'పెద్ది'కి భారీ ప్లస్ పాయింట్‌గా మారింది. ముందు రోజు (జూన్ 3) రాత్రి 8 గంటల షోల నిర్ణయం వల్ల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా సినిమాను ఎంజాయ్ చేశారు.
నటుడిగా రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఢిల్లీ సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ బ్లాక్స్‌లో చరణ్ నటన మెగాస్టార్ చిరంజీవి 'ఆపద్బాంధవుడు' చిత్రంలోని నటనను గుర్తుచేసేలా ఉందని అభిమానులు మురిసిపోతున్నారు. తన నటనతో రామ్ చరణ్ ఈ సినిమాను ఒంటిచేత్తో ముందుకు నడిపించారని చెప్పవచ్చు.
సాంకేతికంగా ఈ సినిమా విజువల్స్, మేకింగ్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, కొండల నేపథ్యంలో వచ్చే సీన్లను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. జగపతిబాబు క్యారెక్టరైజేషన్, క్రికెట్ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయితే స్క్రిప్ట్ పరంగా కొన్ని చోట్ల నేటివిటీ కంటే పాన్ ఇండియా ఎలివేషన్ల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపించినా, ప్రేక్షకులు ఆశించిన మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం చూస్తుంటే వీకెండ్ ముగిసేసరికి మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో శని, ఆదివారాల్లో వచ్చే కలెక్షన్ల ఫ్లో ఆధారంగా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా లేదా అనేది సోమవారం నాటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.




