Home

»

Exclusive Movie News

అమెరికా వాళ్లకు చుక్కలు చూపించిన తెలుగు శాస్త్రి గారు.!

Jul 18, 2026 11:49AM

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో రకాల హాస్య పాత్రలు, మరెన్నో అద్భుతమైన కామెడీ సన్నివేశాలు మనల్ని అలరించాయి. కానీ కొన్ని పాత్రలు, కొన్ని నటనలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన క్లాసిక్ కామెడీ చిత్రమే జంధ్యాల దర్శకత్వంలో 1987లో వచ్చిన 'పడమటి సంధ్యా రాగం'. ఈ సినిమాలో గుమ్మలూరి శాస్త్రి పోషించిన సాంప్రదాయవాది పాత్ర, ఆయన పండించిన హాస్యం తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోతుంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ కథలో పక్కా తెలుగు బ్రాహ్మణుడిగా, మడి-ఆచారం అంటూ ఆయన చేసే హంగామా ప్రేక్షకులను ఇప్పటికీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది.

ఈ సినిమాలో అమెరికా వెళ్లిన గుమ్మలూరి శాస్త్రి అక్కడ ఎదుర్కొనే సాంస్కృతిక సంఘర్షణ, ఆచార వ్యవహారాల చుట్టూ తిరిగే సన్నివేశాలు అత్యంత సహజంగా, హాస్యభరితంగా సాగుతాయి. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకోవడం, అమెరికా వాతావరణంలో కూడా తన మడిని కాపాడుకోవడానికి ఆయన పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. నాకు కోట్లు, బూట్లు వద్దు అంటూ షాపింగ్ మాల్ లో నవ్వులు పూయిస్తారు. అలాగే గృహ ప్రవేశానికి తానే ముహూర్తం పెట్టడం, దగ్గరలో ఆవు ఉంటే తీసుకురమ్మనడం, ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే ఫైర్ ఇంజిన్ రావడం.. ఇలా ప్రతి సీన్ నవ్వుల వర్షం కురిపిస్తుంది. 

ముఖ్యంగా అమెరికా సంస్కృతిని చూసి ఆయన షాక్ అవ్వడం, అక్కడ వాళ్లకు మన పద్ధతులు నేర్పించాలని చూడటం హైలైట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆఫీస్ లో సిగరెట్ తాగేవాళ్లకు క్లాస్ లు పీకడం నెక్స్ట్ లెవెల్. జంధ్యాల మార్కు పంచ్ డైలాగులు, దానికి తోడు గుమ్మలూరి శాస్త్రి అద్భుతమైన టైమింగ్ ఈ పాత్రకు ప్రాణం పోశాయి.

ఈ సినిమాలోని సన్నివేశాలు యూట్యూబ్ లో ఇప్పటికీ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. జంధ్యాల కామెడీ విజన్ కు, గుమ్మలూరి శాస్త్రి సహజ నటనకు ఈ చిత్రం ఒక మచ్చుతునక. ఒక విలక్షణమైన పాత్రతో సినిమా విజయానికి ఏ విధంగా వెన్నుముకగా నిలవచ్చో ఈ సినిమా నిరూపించింది. అందుకే 'పడమటి సంధ్యా రాగం' అనగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ముందుగా గుర్తొచ్చేది గుమ్మలూరి శాస్త్రి ఆ నవ్వుల విందు మాత్రమే.

 

Padamati Sandhya Ragam, Jandhyala Comedy, Gummaluri Sastry Comedy, Telugu Comedy

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com