
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ సినిమా నుంచి వచ్చిన తొలి పాట 'ఓ మైసా రే'లో మహిళా శక్తిని ఆవిష్కరించే ప్రయత్నం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో మైసాను ఒక సాధారణ మహిళగా కాకుండా.. బాధను దిగమింగుకుని, ఆగ్రహాన్ని ఆయుధంగా మార్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యే శక్తిమంతమైన రూపంగా చూపించారు.
ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. సింధూజ శ్రీనివాసన్ తన గాత్రంతో పాటకు మరింత తీవ్రత తీసుకొచ్చారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
సాహిత్యం:
దాయే దాయే ఐశీ
దాయే దాయే ఈశీ
ఐశీ దాయే లేసీ
లేసీ దాయే ఈశీ
శత్రువుల కుత్తుకపై కత్తులను నూరాలే
దాయే దాయే ఐశీ
బాణాలకు నెత్తుటితో తానాలు పోయాలే
దాయే దాయే ఈశీ
ధనుస్సు మీద మనస్సు పెట్టి పసుపు సిలకరించాలే
పిడికిళ్లతో కొడువళ్లను ముడుపు గట్టుడే
దండోరా దరువేసి చండ్ర నిప్పుల పొగలేసి
గుండెలన్నీ పిండిజేసి శాకవోసుడే
దాయే దాయే ఐశీ దాయే దాయే ఈశీ
మర్లవడే సవాలే
దొర్లిపడే శవాలే
పొర్లాలే నీ కాళ్ళ కాడ
కంటి పొర నరాలే
యంట బడే షరాలే
సాగాలి నా మృత్యు క్రీడ
కాటేసే సర్పాన్ని కాపాడే కర్మేంది
రక్తాన్ని తాగేసే నా ఈట దాహాన్ని
నేనింకా ఆపేదేలే
గంపంతా కన్ను నీ సొంతమే
కంపర మెత్తించాలి కంపించి లే
ఇంగా నీ జంగల్లో సింగాలు తొంగుంటే
రాకాసి రాజ్యంలో దిక్కెవరే
హుంగే రుద్రంగి హుంగే
హుంగే రుధిరంగి హుంగే
మెరుపుల అల ఉరుముల శిలా
రగిలి పగిలి లే
యాది నీ దాడి పిడుగుల జడిలే
నీ అడుగు అడుగు రగడ దగడలే
నువ్వు దూసే కరకు బరిసె బడుగుల గురిలే
భావం:
ఈ పాటలో కనిపించే ఆగ్రహం కేవలం కోపం కాదు. ఎన్నో అవమానాలు, కష్టాలు, అన్యాయాలను ఎదుర్కొన్న ఒక మహిళలో పేరుకుపోయిన ఆవేదనకు ప్రతిరూపం. ఇన్నాళ్లూ భరించిన బాధను ఇకపై భరించేది లేదని, తనపై జరిగిన అన్యాయానికి ఎదురుతిరగాలని నిర్ణయించుకున్న మహిళ మనస్తత్వం ఇందులో కనిపిస్తుంది.
సుద్దాల అశోక్ తేజ ఈ పాటలో ఈశి, ఐశి వంటి దైవిక స్త్రీశక్తి ప్రతీకలను ఉపయోగించారు. శివుడి స్త్రీ రూపమైన శక్తి తత్వాన్ని గుర్తుచేస్తూ.. మహిళలోని ధైర్యం, తెగువ, పోరాట పటిమను చాటిచెప్పేలా సాహిత్యం సాగుతుంది.
ఈ పాటలో మైసా పాత్ర ప్రయాణం కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వెనక్కి తగ్గకూడదనే సంకల్పం ఆమె పాత్రలో కనిపిస్తుంది. తనకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్న ఒక మహిళ అంతరంగాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుంది.
సంగీతం, గాత్రం:
జేక్స్ బిజోయ్ ఈ పాటకు సాధారణ మాస్ బీట్‌ను కాకుండా ఒక యుద్ధ వాతావరణాన్ని గుర్తుచేసే సంగీతాన్ని అందించారు. డప్పులు, గిరిజన సంగీత ఛాయలు, బలమైన బీట్స్ పాటకు ప్రత్యేకమైన ఎనర్జీని తీసుకొచ్చాయి. సింధూజ శ్రీనివాసన్ గాత్రంలోని తీవ్రత పాటలోని ఆవేశాన్ని మరింత పెంచుతుంది.
విజువల్స్:
అడవి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు చేతుల్లో ఆయుధాలు, కాగడాలతో కనిపించడం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఎరుపు రంగు చీరలో రష్మిక కనిపించే తీరు, ఆమె హావభావాలు, డ్యాన్స్ మూవ్స్ పాత్రలోని ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే ‘ఓ మైసా రే’ పాట ఒక మహిళ తనలోని శక్తిని గుర్తించి, అన్యాయంపై యుద్ధం ప్రకటించే సందర్భాన్ని గుర్తుచేస్తుంది. రష్మిక కెరీర్‌లోనే భిన్నమైన పాత్రగా ప్రచారం జరుగుతున్న మైసా సినిమాకు ఈ పాట మంచి ఇంట్రడక్షన్‌గా నిలుస్తోంది.
[O Mysaa Re Song Lyrics Telugu, Mysaa Song Lyrics Telugu, Mysaa Movie Song, Mysaa First Single, Rashmika Mandanna, Mysaa Song, Telugu Songs]




