సమాజంలో ఇటీవల చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ సంఘటన అందరినీ కలచివేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో జరిగే నేరాలకు కేవలం సినిమాలను మాత్రమే బాధ్యులుగా చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సినిమాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయనే వాదనలపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
దర్శకులు సమాజంలో ఉన్న పరిస్థితులను, ప్రజల ఆలోచనా విధానాన్ని గమనించి సినిమాలు తీస్తారే తప్ప.. నేరాలను ప్రేరేపించాలనే ఉద్దేశంతో చిత్రాలు చేయరని నట్టి కుమార్ అన్నారు. ఒక సినిమాలో మూడు గంటల సమయం ఉంటే, అందులో కేవలం పది నిమిషాలు ఉండే నెగెటివ్ అంశాలను మాత్రమే పట్టుకుని యువత తమ జీవితాలను నాశనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సినిమాలో చూపించే మంచిని ఎందుకు స్వీకరించరు? చెడును మాత్రమే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాప్తాడు వంటి ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన వారు తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు కోల్పోవడం అత్యంత బాధాకరమని నట్టి కుమార్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో బతికున్నా చచ్చిపోయినట్లుగా జీవితాన్ని గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలకు సినిమాలే కారణమని చెప్పడం కంటే, యువత ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో మెగాస్టార్: ‘కాకా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
అలాగే, కేవలం సినిమాలపైనే నిందలు వేయకుండా సోషల్ మీడియా, యూట్యూబ్‌ల ప్రభావం గురించి కూడా ఆలోచించాలని నట్టి కుమార్ సూచించారు. నేటి డిజిటల్ యుగంలో ఏటీఎం దొంగతనాలు ఎలా చేయాలి? హత్య చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి? వంటి నేరాలకు సంబంధించిన వివరాలు కూడా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటున్నాయని గుర్తుచేశారు. అప్పుడప్పుడు విడుదలయ్యే సినిమాల కంటే నిత్యం అందుబాటులో ఉండే సోషల్ మీడియా కంటెంట్ యువతపై ఎలాంటి ప్రభావం చూపుతోందో కూడా పరిశీలించాలని అన్నారు.
ఇక ప్రేక్షకుల అభిరుచుల గురించి మాట్లాడుతూ.. రామాయణం వంటి మంచి కుటుంబ కథా చిత్రాలను ఉత్తర భారతదేశంలో ఆదరిస్తున్నప్పటికీ, ఇక్కడ మాత్రం అలాంటి సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సినిమాలకు కోట్లాది రూపాయల వసూళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఏ తరహా సినిమాలను ఆదరిస్తున్నారో దర్శకులు కూడా ఆ కోణంలో ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. అయితే సినిమా ఎంత ప్రజాదరణ పొందినా, సమాజానికి, రాబోయే తరానికి మంచి సందేశాన్ని అందించాల్సిన బాధ్యత దర్శకులు, రచయితలపై ఉందని హితవు పలికారు.
ప్రేమ పేరుతో ఆవేశానికి లోనై క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ప్రేమికులను వేధించడం, చివరకు ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని నట్టి కుమార్ అన్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నవారు సమాజంలో ఎంతోమంది ఉన్నారని గుర్తుచేశారు. యువతీయువకులు ఆవేశాన్ని పక్కనపెట్టి ఓపికతో వ్యవహరించాలని, తమ జీవితాలతో పాటు కన్నవారి జీవితాలను కూడా రోడ్డున పడేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరి నట్టి కుమార్ చెప్పినట్లు సమాజంలో జరిగే నేరాలకు సినిమాలే కారణమా? లేక సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందా? అన్నది ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశం.
మీకు నచ్చవచ్చు: ‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన రాజమౌళి.. సినిమా గురించి ఏమన్నారంటే.?
[Natti Kumar Comments, Arjun Reddy Movie, Animal Movie, Rapthadu Incident, Telugu Film Industry, Social Media Impact, Youth Violence, Tollywood News]




